breaking news
erriswamy
-
కారుతో ఢీ కొట్టి.. మృతదేహంతో 18 కిలోమీటర్లు..
ఆత్మకూరు: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొన్నాడు. ఎగిరి కారుపై పడి మృతిచెందిన యువకుడిని అలాగే 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అటుగా వెళుతున్న వాహనదారులు కారు పైభాగంలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో కారును రోడ్డుపక్కన ఆపి ఉడాయించాడు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జెన్నే ఎర్రిస్వామి (35)కి ఆత్మకూరు మండలం సిద్ధరామపురం గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న ఎర్రిస్వామి ఆదివారం ద్విచక్ర వాహనంపై అత్తారింటికి వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై వై.కొత్తపల్లి వద్దకు చేరుకోగా.. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి కారు పైభాగంపై పడి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాడు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద వాహన చోదకులు కారు పైభాగంపై మృతదేహం ఉండటాన్ని గుర్తించి.. కారు డ్రైవర్‌కు చెప్పారు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి, టాప్‌పై పడి ఉన్న మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఉడాయించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బురద జల్లేందుకే ఆరోపణలు
- న్యాయబద్ధంగా మిస్సమ్మ స్థలాన్ని కొనుగోలు చేశాం - చార్జ్‌షీట్ వేసినంత మాత్రాన మేము ముద్దాయిలం కాదు - వైకుంఠం ప్రభాకర్ చౌదరిలా మునిసిపల్ ఆస్తులు దోచుకోలేదు? - మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అనంతపురం న్యూసిటీ : ‘మిస్సమ్మ స్థలం సీఎస్ఐ సంస్థకు చెందినది. ఆ స్థలాన్ని మా కుటుంబం న్యాయబద్ధంగా కొనుగోలు చేసింది. ప్రజల్లో తమకొస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే రాజకీయంగా బురదజల్లుతున్నారు. ప్రభాకర్ చౌదరి ఓ కళంకిత ఎమ్మెల్యే. ఆయనలాగా మేము మునిసిపల్ ఆస్తులను దోచుకోలేదు. సీఐడీ చార్జ్‌షీట్ వేసినంత మాత్రాన మేము ముద్దాయిలం అవుతామా’ అని మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అన్నారు. గురువారం బీఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ స్థలంలో ఆయన తన సోదరుడు ఎర్రిస్వామిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పలు ఛానళ్లు, పత్రికలు సీఐడీ కేసు నమోదు చేసిందని, తాము పరారీ అయ్యామని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాల్సిన మీడియా తమను ముద్దాయిలుగా చిత్రీకరించడం ఏంటని ప్రశ్నించారు. తాము పరారీలో ఉన్నట్లు వార్తలు రావడం హాస్యాస్పదమన్నారు. పీఆర్పీ రేటింగ్స్ పెంచుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శించకూడదన్నారు. తమ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై తాము పరువునష్టం దావా ఎందుకు వేయకూడదని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మునిసిపల్ ఆస్తులను వేలం వేయించి వాటిని ఆక్రమించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సంఘమిత్ర పేరుతో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారు అన్నీ గమనిస్తున్నారని, బీఎన్ఆర్ కుటుంబంపై ఉన్న నమ్మకంతోనే ఐదుసార్లు తమకు పట్టం కట్టారని అన్నారు. కళంకిత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్యవర్తులతో ఓ తప్పుడు నివేదికను తయారు చేసి సీఐడీకి ఫిర్యాదు చేయించారని, దానికి సీఎం చంద్రబాబునాయుడు వంత పాడారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి మిస్సమ్మ స్థల వివాదం తెరపైకి వచ్చిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా లబ్ధి పొందినవారే తాము కాంగ్రెస్ పార్టీ వీడాక ఈ వివాదానికి ఆజ్యం పోశారన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారన్నారు. సీఎస్ఐ చట్టబద్ధత కలిగిన సంస్థ అని, అందులో రిటైర్డు జడ్జిలు, ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఫోర్జరీ చేసి స్థలాన్ని ఆక్రమించుకుంటే వారు చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తమకు న్యాయస్థానాలపై అపారమైన నమ్మకం, గౌరవం ఉందని, న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పారిపోవాల్సిన అవసరం తమకు ఎంతమాత్రమూ లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడులాగా స్టే తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నించబోమన్నారు. ఈ స్థల వివాదంపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొనుగోలు చేస్తే అక్రమదారులా.. : ఎర్రిస్వామిరెడ్డి ‘ఏడెకరాల స్థలాన్ని న్యాయబద్ధంగా కొనుగోలు చేస్తే మమ్మల్ని అక్రమదారులుగా చిత్రీకరిస్తున్నారు. మరి కొనుగోలే చేయకుండా 20 ఎకరాల్లో భవనాలు, కరెంటు ఆఫీసులు, ప్రహరీ గోడలు నిర్మించివారు ఆక్రమణదారులు కారా?’ అని ఎర్రిస్వామిరెడ్డి ప్రశ్నించారు. 1923లో సీఎస్ఐ సంస్థ ఈ స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం అది సీఎస్ఐ సంస్థకు చెందినదేనని పేర్కొందన్నారు. ఆ సంస్థ నుంచి తాము కొనుగోలు చేశామే తప్ప కబ్జాకు పాల్పడలేదన్నారు. నిజానిజాలు త్వరలోనే వెలువడతాయన్నారు.