breaking news
Eluru tour
-
భూములిస్తే పరిశ్రమలన్నీ పశ్చిమకే..
పాతపాటే పాడిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌పై మాట మార్పు భీమవరంలో 150 ఎకరాల్లో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటన ద్వారకాతిరుమల సమీపంలో విర్డ్ ఆసుపత్రి భవనం ప్రారంభం సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో భూ సమస్య తీవ్రంగా ఉందని.. భూములిచ్చేందుకు ముందుకొస్తే పరిశ్రమలన్నీ పశ్చిమగోదావరికే తీసుకువస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ద్వారకాతిరుమల సమీపంలో శారీరక వికలాంగుల కోసం నిర్మించిన వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహేబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ (విర్డ్) ఆసుపత్రిని సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభిం చారు. తొలుత ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించుకున్న ముఖ్య మంత్రి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత విర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి భూ సమస్య అడ్డంకిగా ఉందని ఆయన చెప్పారు. ద్వారకాతిరుమలకు సమీపంలో ఉన్న 17వేల ఎకరాల అటవీ భూములను డీనోటిఫై చేసి పెద్దఎత్తున పరిశ్రమలకు నెలకొల్పుతామని ప్రకటించారు. భీమవరంలో ఆక్వా యూని వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం 150 ఎకరాల భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చిన విశ్వనాథరాజును అభినందించారు. ఆయిల్‌పామ్, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం నిర్మాణంపై తడవకో మాట గత నెల ఆగస్టు 15న పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ పట్టిసీమ నిర్మాణం స్ఫూర్తితో మూడేళ్లలోపే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు భిన్నంగా గురువారం నాటి సభలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేం దుకు నాలుగైదేళ్లు పడుతుందని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను ఈ ఏడాది ప్రారంభించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఈనెల 16న పట్టిసీమ ఎత్తిపోతల పథకం తొలిదశను ప్రారంభించి గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తరలిస్తామన్నారు. ద్వారకాతిరుమలకు పాత హామీలే గత ఏడాది జూలై 16న తొలిసారి జిల్లాకు వచ్చిన చంద్రబాబు ద్వారకాతిరుమలలో పర్యటించిన విష యం విదితమే. ఆ సందర్భంగా తిరుమల తిరుపతికి దీటుగా చినతిరుపతిని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతాన్ని టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుం టామని ప్రకటించారు. ఎడ్యుకేషనల్, వైద్య హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 14 నెలల తర్వాత గురువారం ఇక్కడకు వచ్చిన సీఎం తిరిగి అవే హామీలు గుప్పించారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అడిగిందే తడవుగా ద్వారకాతిరుమలలో నర్సింగ్, గోపాలపురంలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, పిచ్చికగండి బ్రిడ్జి, జగన్నాధపురం- గజ్జవరం రోడ్డు నిర్మిస్తామని వాగ్దానాలు ఇచ్చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తున్న ప్రాణదానం ట్రస్ట్ తరహాలో ద్వారకాతిరుమల పరిధిలో కూడా ప్రాణదానం ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావును చైర్మన్‌గా, అనంతకోటిరాజును వర్కింగ్ చైర్మన్‌గా నియమిస్తున్నట్టు చెప్పారు. తిరుమల తరహాలోనే చినవెంకన్న దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి అన్నదానం చేసే విధంగా ట్రస్ట్‌ను తీర్చిదిద్దాలన్నారు. రాజు వేగేశ్న ఫౌండేషన్‌కు బాబు ప్రశంసలు వికలాంగులకు చేయూత అందిం చేందుకు రాజు వేగేశ్న ఫౌండేషన్ ముం దుకు వచ్చి విర్డ్ సంస్థను నెలకొల్పడం అభినందనీయమని సీఎం ప్రశంసిం చారు. రూ.13.50 కోట్లతో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన విర్డ్ చైర్మన్ అనంతకోటిరాజు అభినందనీయులని సీఎం అన్నారు. విర్డ్ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ కూడా అమలయ్యేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. సీఎంకు పెళ్లిరోజు శుభాకాంక్షలు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. గురువారం చంద్ర బాబు పెళ్లి రోజు అని తెలియడంతో ఆయనకు బొకేలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, విప్‌లు అంగర రామ్మోహనరావు, చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎంపీలు మాగంటి మురళీ మోహన్, మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీలు ఎంఎ షరీఫ్, కంతేటి సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, పులపర్తి రామాంజనేయులు, బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, కేఎస్ జవహర్, బడేటి బుజ్జి పాల్గొన్నారు. -
16న విజయమ్మ పర్యటన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈనెల 16న జిల్లాకు రానున్నారు. చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల సమర శంఖారావం పూరిస్తారు. బుధవారం ఉదయం 10గంటలకు చింతలపూడిలో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. అనంతరం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వెళతారు. అక్కడ రోడ్ షో నిర్వహించి, గోపాలపురం నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గోపాలపురంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని తాళ్లపూడి వెళతారు. అక్కడ నిర్వహించే సభలో విజయమ్మ ప్రసంగిస్తారు. విజయమ్మ పర్యటనకు మూడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నాయి. -
వచ్చినట్టే వచ్చి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తున్నారని జిల్లా అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. వందలాది పోలీసుల హైరానా పడ్డారు. ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారంటూ ప్రజలంతా ఎదురుచూశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇదే తంతు. చివరకు చావుకబురు చల్లగా చెప్పినట్టు ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యిందనే కబురు అందింది. ఇదీ గురువారం జిల్లాలో నెలకొన్న పరిస్థితి. లక్షలాది రూపాయలు వెచ్చించి చేసిన ఏర్పాట్లు వృథా కావడంతోపాటు అత్యంత కీలకమైన సమయంలో జిల్లా అధికారులు, వందలాది ఉద్యోగులు, పోలీసులు ఒక రోజంతా ముఖ్యమంత్రి కోసం పడిగాపులు కాసి చివరకు ఉసూరుమంటూ వెనుతిరగాల్సివచ్చింది. భారీ వర్షాల వల్ల మునిగిన పొలాలను చూసి, నష్టాలపై జిల్లా అధికారులతో సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పర్యటనను అర్ధాంతంగా ముగించుకుని వెళ్లిపోయారు. నష్టాన్ని చూడకుండానే.. ఏ రైతునూ పరామర్శించకుండానే.. అధికారుల నుంచి వివరాలు తెలుసుకోకుండానే నరసాపురం మండలం పెదమైనవానిలంకలోని హెలిప్యాడ్ నుంచే వెనుదిరిగారు. షెడ్యూల్ ప్రకారం నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గురువారం పర్యటించాల్సి ఉంది. ఆయన వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేకపోగా లక్షల రూపాయలు వృథాగా ఖర్చయ్యూరుు. అధికారులు, సిబ్బంది శ్రమ కూడా వృథా అరుు్యంది. బయల్దేరడమే లేటు తూర్పుగోదావరి జిల్లా పర్యటన పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. ఉదయం హైదరాబాద్‌లోనే రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరిన ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాకు ఆలస్యంగా చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ అక్కడే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత 4.30 గంటలకు పెదమైనవానిలంక చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి సీఎం దిగిన వెంటనే వాతావరణం బాగోలేదని, వెంటనే వెళ్లకపోతే ఇబ్బందని పైలట్ చెప్పడంతో సీఎం హెలికాప్టర్ ఎక్కేశారు. దీంతో ఉదయం నుంచి పడిగాపులు పడిన అధికారులు, సిబ్బంది నీరుగారిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పెదమైనవానిలంకలో సముద్రం కోతకు గురైన ప్రాంతాన్ని చూసి నష్టపోయిన గ్రామస్తులు, మత్స్యకారులతో సీఎం మాట్లాడాల్సి ఉంది. కానీ ఆయన వచ్చీరాగానే వెళ్లిపోవడంతో ఆ కార్యక్రమాలేవీ జరగలేదు. ఇందుకోసం మూడురోజుల నుంచి అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌తోపాటు పలువురు జిల్లా అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ సీఎం కోసం అక్కడే మకాం వేశారు. చివరకు వారంతా నీరసంతో వెనక్కు వచ్చేశారు. రోజంతా పడిగాపులే మరోవైపు సీఎం కోసం తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్ కళాశాలలో చేసిన భారీ ఏర్పాట్లు కూడా వృథా అయ్యాయి. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశం కోసం ఉదయం నుంచే అధికారులు సిద్ధమయ్యారు. అన్ని శాఖల అధికారులు సాయంత్రం వరకూ అక్కడే ఉన్నారు. చివరకు సీఎం రాకపోవడంతో వారి సమయమంతా వృథా అరుు్యంది. సీఎం పర్యటన లేకపోతే ముంపు ప్రాంతాల్లో వారు చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, మరమ్మతులు తదితర పనుల్లో నిమగ్నమై ఉండేవారు. సొమ్ము.. శ్రమ వృథా సీఎం పర్యటన కోసం ఖర్చు చేసిన సుమారు రూ.20 లక్షలు బూడిదలో పోసిన పన్నీరైంది. హెలిప్యాడ్ల నిర్మాణం, రోడ్లకు మరమ్మతులు, వందలాది మందికి భోజనాలు, టీఏ, డీఏలు, వాహనాలు, వాటికి కావాల్సిన అయిల్తోపాటు ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.20 లక్షలపైనే అరుు ఉంటుందని అధికారుల ద్వారా తెలిసింది. జి ల్లా అధికారులు, వారి సిబ్బంది రావడానికి భా రీ స్థాయిలో వాహనాలు సమకూర్చుకున్నారు. బందోబస్తు కోసం 605 మంది పోలీసులు పని చేశారు. వారికి భోజనాలు, వాహన సదుపా యం, టీఏ, డీఏ అంతా నష్టమే. వారి శ్రమ కూ డా వృథా అయింది. ఇదంతా సీఎం చలవేనని అధికారులు గుసగుసలాడుకోవడం కనిపించింది. ప్రజల్ని సముదారుుంచేందుకు తంటాలు నరసాపురం రూరల్, న్యూస్‌లైన్ : పెదమైనవానిలంక గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెలిప్యాడ్ నుంచే తిరుగు ప్రయూణం కావడంతో ఆయన కోసం ఎదురుచూసిన రైతులు, ప్రజలు నిరాశకు గురయ్యూరు. దీంతో ఎంపీ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, కలెక్టర్ సిద్ధార్థజైన్ అక్కడ వేచివున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాతావరణ పరిస్థితులు, సమయం అనుకూలంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభాస్థలికి రాలేకపోయారని ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ప్రతికూల పరిస్థితుల వల్ల హెలికాప్టర్‌ను గ్రామంలో దింపడానికి కూడా పైలట్ అంగీకరించలేదని, ఒక్కసారి గ్రామస్తులకు కనిపించి వెళ్లిపోదామని సీఎం బలవంతం చేసి హెలిప్యాడ్ వరకూ వచ్చారని చెప్పారు. శుక్రవారం ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం కావడం వల్ల హైదరాబాద్‌కు వెళ్లిపోవాల్సి వస్తోందని, లేదంటా ఈ రాత్రి పెదమైనవానిలంక గ్రామంలోనే బస చేసేవాడినని కిరణ్‌కుమార్‌రెడ్డి తమకు చెప్పారన్నారు. ఈ విషయూలను రైతులకు, మత్స్యకారులకు తమను చెప్పమన్నారంటూ అక్కడి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. త్వరలోనే సీఎం వస్తారని చెప్పుకొచ్చారు. నష్టాలపై సీఎంకు నివేదిక పంటలు, ఆస్తి నష్టం రూ.808.18 కోట్లుగా అంచనా ఏలూరు/నరసాపురం రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో అక్టోబర్ 22 నుంచి 27వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో పంటలు, ఆస్తులకు రూ.808.18 కోట్ల మేర నష్టం సంభవించిందని కలెక్టర్ సిద్ధార్థజైన్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. నరసాపురం మండలం పెదమైనివానిలంక గ్రామానికి వచ్చి, వెనుదిరిగిన ముఖ్యమంత్రికి నష్టాలపై కలెక్టర్ నివేదిక అందించారు. జిల్లాలో 59 వేల 45 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, దీని విలువ రూ.150 కోట్లు ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. 2,453 హెక్టార్లలో ఉద్యాన పంటలకు వాటిల్లిన నష్టం విలువ రూ.41.88 కోట్లు అని వివరించారు. 41 హెక్టార్లలో రూ.5 లక్షల విలువైన పట్టు పురుగుల పెంపకానికి, 9.05 హెక్టార్ల చెరువుల్లో రూ.96 లక్షల విలువైన చేపల నష్టం సంభవించినట్టు వివరించారు. 768.10 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రహదారులు ధ్వంసం కావడంతో రూ.370 కోట్ల 86 లక్షలు, 1139.78 కిలోమీటర్లు పంచాయతీ రోడ్లు దెబ్బతినగా రూ.214.8 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 220 కిలోమీటర్ల మునిసిపల్ రహదారులకు రూ.23.66 కోట్ల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు. రూ.53 లక్షల విలువైన 358 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దె బ్బతిన్నాయన్నారు. 8 నీటిపారుదల వనరులు దెబ్బతినటంతో రూ.29 లక్షల నష్టం సంభవించిందన్నారు. జిల్లాలో 1,945 ఇళ్లు దెబ్బతిన్నాయని, భారీ వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారని వివరించారు. ముంపు బాధితుల కోసం 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,054 మందిని ఆదుకున్నామన్నారు. 66 వైద్య శిబిరాలు నిర్వహించి సేవలందించామని పేర్కొన్నారు. భారీ వర్షాలకు రూ.5 లక్షల విలువైన 25 పశువులు మృత్యువాత పడ్డాయని సీఎంకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు.