breaking news
e-ration
-
ఇక ఈ-రేషన్
ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. పారదర్శకంగా సరుకులు పంపిణీ చేసి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధార్ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు నుంచి ఈ-రేషన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ భావిస్తోంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఈపీడీఎస్) డాటా బేస్‌లో ఆధార్ నంబర్లతో అనుసంధానం చేస్తున్నారు. ఈపీడీఎస్‌లో ఉన్న కార్డుదారులకు మాత్రమే సరుకులు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. అనుసంధానం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ విధానం అమలైతే బోగస్‌కార్డులకు అడ్డుకట్ట వేయడంతోపాటు రూ.కోట్ల నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా ఉంటాయి. అయితే సరుకులు పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) విధానం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇందుకు ఎలక్ట్రానిక్ యంత్రాలు వాడనున్నారు. ప్రతీ రేషన్ దుకాణాల్లో యంత్రాలు అమర్చి నెట్ సౌకర్యం కల్పిస్తారు. నెట్వర్క్ సహాయంతో ఈ యంత్రాలు పనిచేస్తాయి. ఈ విధానం అమలైతే ఈపీడీఎస్తో నేరుగా కమిషనరేట్ నుంచి సరుకుల కేటాయింపు జరుగుతుంది. 5.10 లక్షల కార్డులు అనుసంధానం జిల్లాలో 6,72,011 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 23,81,015 మంది (యూనిట్లు) ఉన్నారు. ఇప్పటి వరకు ఈపీడీఎస్ డాటాబేస్ 5,10,728 రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇంకా 1,61,283 రేషన్ కార్డులను అనుసంధానించాల్సి ఉంది. రేషన్‌కార్డులోని కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటిదాక 16,92,657 మంది తమ ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసుకున్నారు. ఇంకా 6,88,358 మంది ఆధార్ నంబర్లతో అనుసందానం చేయాలి. 5,57,211 మంది వివరాలు అనుసంధానం చేయుటకు అధికారుల వద్ద పెండింగ్ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,617 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,72,011 తెల్లరేషన్ కార్డులకు, 42,251 రచ్చబండ కూపన్లకు, 1695 అన్నపూర్ణ కార్డులకు, 66,483 అంత్యోదయ కార్డులకు సరుకులు సరఫరా అవుతున్నాయి. రేషన్‌కు ఆధార్ అనుసంధానంతో ఇప్పటి వరకు 24 వేల రేషన్‌కార్డులు బోగస్‌గా తేల్చారు. ప్రస్తుతమున్న కార్డులకు ప్రతి నెల కోటా కింద 10 వేల మెట్రిక్ టన్నుల బి య్యం, 350 క్వింటాళ్ల చక్కెర పంపిణీ అవుతోంది. ఆధార్ అనుసంధానం పూర్తయితే ఈ-రేషన్ అమలుకానుంది. నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు - వసంత్‌రావు దేశ్‌పాండే, జిల్లా పౌర సరఫరాల అధికారి రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈపీడీఎస్‌లో అనుసంధానం 76 శాతం పూర్తి చేశాం. నిత్యావసరాలు నూతన పీవోఎస్ విధానంతో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఒకేసారి ఈ విధానాన్ని ప్రారంభించవచ్చు. కమిషనరేట్ నుంచి ఆదేశాలు వస్తే ఆగస్టులో ప్రారంభిస్తాం. -
ఇక ఈ-రేషన్
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఈ-రేషన్ విధానం అమలు కాబోతోంది. బోగస్ కార్డులకు అడ్డుకట్ట పడనుంది. ప్రజా పంపిణీ విధానం(పీడీఎస్)లో సమూల మార్పులు రానున్నాయి. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఆధార్ అనుసంధానిత ప్రజాపంపిణీ వ్యవస్థ(ఏఈపీడీఎస్) ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పథకాన్ని జిల్లాలోని కొన్ని రేషన్ దుకాణాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలంటూ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆ శాఖ కమిషనర్ సునీల్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.100 కోట్లకు పైగా నిధులు ఆదా కావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో తొలిసారిగా ఈ పెలైట్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయంచారు. జిల్లాలో మొదటి దశలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని రేషన్ దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ఏఈపీడీఎస్ అమలు చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు రంగం సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. పథకంలో భాగంగా కార్డుదారులకు బయోమెట్రిక్ పద్ధతిలో సరుకులను పంపిణీ చేస్తారు. ఇక్కడ ఫలితాల ఆధారంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆమోదంతో జిల్లా అంతటా వర్తింపజేస్తారు. జిల్లాలో 11 లక్షలకుపైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో సుమారు 39 లక్షల మంది సభ్యులకు గాను 10 లక్షల యూనిట్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఏఈపీడీఎస్ విధానం అమలైతే కీ రిజిస్టర్‌ను తాజా సమాచారంతో క్రోడీకరించి సరుకులు సరఫరా చేస్తారు. ఏఈపీడీఎస్ను అమలుచేస్తే జిల్లాలో 30 శాతం యూనిట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను జిల్లాలో సమూలంగా ప్రక్షాళన చేయడానికి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేయనున్న నేపథ్యంలో కొత్త విధానంపై త్వరలో డీలర్లందరికీ అవగాహన కల్పించి ఈ-పోస్ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న వనరులేంటి? అక్కడ ఏ నెట్వర్క్ పనిచేస్తుంది? తదితర అంశాలను పరిశీలించనున్నారు.