breaking news
dull tax
-
తగ్గిన ఐఓబీ నష్టాలు
న్యూఢిల్లీ: మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) నికర నష్టం 2017 జూన్ త్రైమాసికంలో రూ. 499 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదేకాలంలో బ్యాంకు రూ. 1,450 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం కూడా రూ. 5,868 కోట్ల నుంచి రూ. 5,174 కోట్లకు తగ్గిందని, ఇందుకు వడ్డీ రేట్ల తగ్గుదల కారణమని స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఐఓబీ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గినా...స్థూల ఎన్పీఏలు 20.48 శాతం నుంచి 23.60 శాతానికి పెరిగాయి. జూన్ క్వార్టర్లో రుణ వితరణ తగ్గడంతో ఎన్పీఏల శాతం పెరగడానికి ప్రధాన కారణమని బ్యాంకు తెలిపింది. నికర ఎన్పీఏలు 13.97 శాతం నుంచి 14.97 శాతానికి పెరిగాయి. బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ 1.87 శాతం నుంచి 1.65 శాతానికి తగ్గింది. ఫలితాల నేపథ్యంలో ఐఓబీ షేరు 3.35 శాతం క్షీణతతో రూ. 23.10 వద్ద ముగిసింది. -
కంపెనీలా... అప్పుల కుప్పలా?
♦ కార్పొరేట్లను వెంటాడుతున్న రుణభారం... ♦ గతేడాది 85 కంపెనీల నిర్వహణ లాభం కంటే చెల్లించాల్సిన వడ్డీయే అధికం! ♦ అంతకంతకూ పెరుగుతున్న జాబితా... ♦ బ్యాంకుల నెత్తిన మొండిబకాయిల బండ... దేశంలో ఇప్పుడు అత్యధికంగా వినిపిస్తున్న పదం ‘మొండిబకాయి’ అంటే అతిశయోక్తి కాదేమో!! వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసిన వారి భరతం పట్టేందుకు అటు కేంద్రం, ఇటు ఆర్బీఐ నేరుగా రంగంలోకి దిగడంతో ఈ మొండిబకాయిల(ఎన్పీఏ)పై చర్చ తీవ్రంగానే జరుగుతోంది. మొదటివిడతగా 12 కంపెనీలపై(డర్టీ డజన్) చర్యలు చేపట్టాల్సిందిగా కూడా బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న రుణభారం తారస్థాయికి చేరడం, చెల్లింపుల విషయంలో చేతులెత్తేయడంతో బ్యాంకుల మెడకు చుట్టుకుంటోంది. ఇలాంటి కంపెనీల జాబితా అంతకంతకూ పెరిగిపోతుండటం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. గడచిన ఆర్థిక సంవత్సరం(2016–17)లో మొత్తం 85 కంపెనీలు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం వాటి నిర్వహణ లాభం కంటే అధికంగా ఉండటం గమనార్హం. దేశీ కార్పొరేట్ రంగంపై రుణాల భారం ఎంతగా ఉందనేదానికి ఇదే నిదర్శనం. 2015–16లో ఇలాంటి కంపెనీల సంఖ్య 67 మాత్రమే. మొత్తంమీద చూస్తే కార్పొరేట్ల లాభదాయకత కాస్త మెరుగుపడినప్పటికీ.. రుణ ఊబిలో కూరుకుపోతున్న కంపెనీల సంఖ్య పెరుగుతుండటం విశేషం. వడ్డీ చెల్లింపూ గగనమే... దేశంలో స్టాక్మార్కెట్లో లిస్టయిన మొత్తం కంపెనీల్లో దాదాపు 11 శాతం(బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మినహా) గతేడాది తమ రుణాలపై వడ్డీని కూడా చెల్లించలేని స్థాయికి దిగజారాయి. 2016–17 చివరినాటికి మొత్తం కార్పొరేట్ రుణాల్లో ఐదో వంతు ఈ 11 శాతం కంపెనీలదే. 2016–17లో ఈ సంస్థల నిర్వహణ లాభం రూ.12,000 కోట్లు కాగా, అవి ఇప్పటిదాకా చెల్లించాల్సిన మొత్తం వడ్డీ భారమే రూ.60,000 కోట్లుగా ఉంది. 2015–16లో ఈ జాబితాలో ఉన్న 67 కంపెనీల మొత్తం నిర్వహణ భారం రూ.5,100 కోట్లు. పేరుకు పోయిన వడ్డీ చెల్లింపులు రూ.43,200 కోట్లుగా లెక్కతేలింది. కాగా, తగినంత లాభాలులేని కం పెనీల సంఖ్య 2012–13 నుంచి 2014–15 మధ్య పెరగకుండా స్థిరంగా ఉండటం గమనార్హం. ఏదైనా కంపెనీ నిర్వహణ లాభం గనుక అది చెల్లించా ల్సిన వడ్డీ కంటే తక్కువగా ఉంటే.. రుణాలు తీర్చలేని స్థాయికి పడిపోతుంది. దీంతో బ్యాంకులు ఆయా కంపెనీలకు ఇచ్చిన రుణాలన్నీ మొండిబకాయిలుగా మారిపోతాయి. గతేడాది ఈ జాబితాలోకి చేరిన కంపెనీల్లో అలోక్ ఇండస్ట్రీస్, కాస్టెక్స్ టెక్నాలజీస్, ఉత్తమ్ గాల్వా, వీడియోకాన్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్, ఉషా మార్టిన్, రుచి సోయా, ఆమ్టెక్ ఆటో వంటివి ఉన్నాయి. ఆర్బీఐ చర్యలకు ఆదేశించిన డర్టీ డజన్(ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్, జేపీ ఇన్ఫ్రా, ల్యాంకో ఇన్ఫ్రా, మోనెత్ ఇస్పాత్, జ్యోతి స్ట్రక్చర్స్, ఆమ్టెక్ ఆటో, ఎరా ఇన్ఫ్రా ఉన్నట్లు అనధికారిక సమాచారం) ఈ కంపెనీలూ ఉన్నాయి. వీటి రుణ భారం దాదాపు రూ. 2 లక్షల కోట్లుగా అంచనా. బ్యాంకులకు ఉన్న మొత్తం మొండిబకాయిల్లో వీటిదే సుమారు 25 శాతం కావడం గమనార్హం. ఆ 85 కంపెనీల రుణ భారం రూ.5 లక్షల కోట్లు పైనే... అప్పుల కుప్పలుగా లెక్కతేలిన సుమారు 85 కంపెనీల మొత్తం రుణ భారం గతేడాది చివరినాటికి రూ.5.04 లక్షల కోట్లుగా అంచనా. 2015–16 చివరికి ఈ మొత్తం రూ.4.6 లక్షల కోట్లుగా ఉంది. కాగా, 2016–17కు సంబంధించి ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్లను ఇంకా చాలా కార్పొరేట్లు సమర్పించాల్సి ఉన్నందున ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్ర రుణ భారం ఉన్న ఈ 85 కంపెనీలు గతేడాది రూ.60,300 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నట్లు అంచనా. వీటి మొత్తం ఆదాయం రూ.2.83 లక్షల కోట్లు. బీఎస్ఈ–500, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల(బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలు మినహా)లో 761 కంపెనీలను పరిగణలోకి తీసుకొని ఒక ఫైనాన్షియల్ వార్తా పత్రిక ఈ విశ్లేషణను చేసింది. ప్రధానంగా 2006–07 నుంచి వార్షిక ఆర్థిక ఫలితాలు అందుబాటులో ఉన్న కంపెనీల ఆధారంగా దీన్ని రూపొందించారు. ‘గతేడాది చివరి త్రైమాసికంలో మొత్తంమీద రుణ చెల్లింపుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న కంపెనీల్లో పెద్దగా మెరుగుదలేమీ లేదు. బలహీనమైన కంపెనీలు మరింత బలహీనం అయ్యాయి. రుణాలపై వడ్డీ కూడా చెల్లించలేని స్థాయి ఉన్న కంపెనీలు ఇంకా 40 శాతం ఉన్నాయి. నిర్వహణ లాభాలు కుచించుకుపోతున్నాయి. కార్పొరేట్ల మొత్తం రుణాల్లో నష్టాల్లో ఉన్న కంపెనీల శాతం 32 శాతం నుంచి 36 శాతానికి ఎగబాకింది’ అని క్రెడిట్ సూసీకి చెందిన ఆశిష్ గుప్తా, కుష్ షా పేర్కొన్నారు. నోట్ల రద్దు, పెట్టుబడి కార్యకలాపాలు, పారిశ్రామిక మందగమనం కొనసాగుతుండటం వంటివి కూడా కంపెనీల రుణ చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘నోట్ల రద్దు తర్వాత హఠాత్తుగా డిమాండ్ పడిపోవడం చాలా కంపెనీల ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది. ప్రభుత్వ వ్యయం కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటోంది.