breaking news
DSLR camera
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం...
షోపూర్: కునో నేషనల్ పార్కు. శనివారం ఉదయం 11.30 గంటలు. బోను తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఓ చీతా హుందాగా, నెమ్మదిగా బయటికొచ్చింది. తనకు బొత్తిగా అలవాటు లేని కొత్త వాతావరణం పలకరించడంతో తొలుత కాస్త అయోమయానికి లోనైంది. మెల్లిగా పరిసరాలను 360 డిగ్రీలూ స్కాన్ చేసింది. తర్వాత ఎదురుగా పరుచుకున్న తనకెంతో ఇష్టమైన గడ్డి మైదానంలోకి ఒక్కో అడుగే వేసింది. చూస్తుండగానే మెరుపు వేగంతో పరుగందుకుంది. కాస్త దూరం వెళ్లగానే ఓ చెట్టు దగ్గర ఆగింది. తలను చుట్టూ తిప్పుతూ పరిసరాలను మరోసారి నింపాదిగా పరికించి చూసింది. తర్వాత స్వేచ్ఛా సంచారం మొదలు పెట్టింది. అలా... 70 ఏళ్ల కింద భారత్‌లో అంతరించిన చీతా జాతి మళ్లీ దేశంలోకి అడుగు పెట్టింది. ఈ అపురూప క్షణాలను మీడియాతో పాటు బోన్ మీదుగా ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అత్యాధునిక డీఎస్ఎల్ఆర్ కెమెరాలో బంధించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయనే వాటిని కునో పార్కులోకి వదిలిపెట్టారు. ‘‘అవి మన అతిథులు. కొద్ది నెలల్లో కునో పార్కును తమ నివాసంగా మార్చుకుంటాయి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ‘మిషన్ చీతా’ పేరిట ఆఫ్రికాలోని నమీబియా నుంచి కేంద్రం రప్పించిన 8 చీతాలు ప్రత్యేక విమానంలో 10 గంటలు సుదీర్ఘ ప్రయాణం చేసి శనివారం ఉదయం గ్వాలియర్ చేరుకున్నాయి. అక్కడినుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లలో కునోకు తరలాయి. ప్రభుత్వాలు పట్టించుకోలేదు ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో చీతాల ఉనికిని పునరుద్ధరించేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. ‘‘ఇన్ని దశాబ్దాల తర్వాత మిత్రదేశమైన నమీబియా మద్దతుతో వాటిని రప్పించగలిగాం. ఇకనుంచి కునో పార్కు గడ్డి మైదానాల్లో చీతాలు పరుగులు తీస్తూ కనువిందు చేస్తాయి’’ అన్నారు. ‘‘కేంద్రం నిరంతర కృషి ఫలితంగా పులులు, ఏనుగులు, సింహాలు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ కూడా ప్రగతి సాధ్యమేనని ప్రపంచానికి మనం సందేశమిస్తున్నాం’’ అని చెప్పారు. ఇలా తరలించారు... నమీబియా నుంచి వచ్చిన 8 చీతాల్లో 3 మగవి కాగా 5 ఆడవి. వీటి వయసు 30 నుంచి 66 నెలలు. వాటికి మత్తు ఇంజక్షన్లిచ్చి ప్రత్యేక చెక్క బోన్లలో విమానంలో తరలించారు. 8,000 కిలోమీటర్ల సుదీర్ఘ ఖండాంతర ప్రయాణం కావడంతో వాంతులు చేసుకోకుండా ఖాళీ కడుపుతో తీసుకొచ్చారు. కునో పార్కులో ఎన్క్లోజర్లలోకి వదిలాక ఆహారమిచ్చారు. నెల రోజుల క్వారెంటైన్ అనంతరం మరో రెండు నుంచి నాలుగు నెలల పాటు చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. తర్వాత స్వేచ్ఛగా వదిలేస్తారు. చీతాల ఉనికిని నిరంతరం ట్రాక్ చేసేందుకు వాటికి రేడియో ట్యాగింగ్ చేశారు. చివరిసారిగా 1947లో నేటి ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోస్థానిక రాజు మూడు చీతాలను వేటాడాడు. అంతటితో భారత్‌లో వాటి కథ ముగిసిపోయింది. ఇవేం తమాషాలు: కాంగ్రెస్ మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. సమస్యల నుంచి, భారత్ జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు చీతాల విడుదల పేరిట తమాషాకు తెర తీశారంటూ దుయ్యబట్టింది. చౌకబారు ట్రిక్స్‌లో బీజేపీ నేతలకు భారతరత్న ఇవ్వొచ్చంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. చీతాలను రప్పించే ప్రాజెక్టుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం 2009లో తెర తీసిందంటూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాంల్లో ప్రత్యేకంగా జోడో యాత్ర చేస్తామన్నారు. నన్ను కూడా రానివ్వొద్దు! తర్వాత ‘చీతా మిత్ర’ సిబ్బందితో ప్రధాని సరదాగా ముచ్చటించారు. ‘‘చీతాలను జాగ్రత్తగా చూసుకోండి. మనుషులకు, వాటికి అనవసర సంఘర్షణ తలెత్తకుండా చూడండి. కొత్త వాతావరణానికి అవి అలవాటు పడేదాకా ఎవరినీ వాటి దగ్గరికి పోనివ్వకండి. నాయకులు, బ్రేకింగ్ న్యూస్ కోసం వచ్చే మీడియా, అధికారులు, నా బంధువులు ఎవరినీ కునో నేషనల్ పార్కులోకి అనుమతించొద్దు. స్వయంగా నేనే వచ్చినా సరే, అడ్డుకోండి’’ అని సూచించారు! చీతాల పరిరక్షణకు, వాటిని గురించి పరిసర గ్రామాల వారికి అవగాహన కల్పించేందుకు 400 మంది యువకులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. గుజరాత్ సీఎంగా ఉండగా సింహాల సంఖ్య పెంచే చర్యల్లో భాగంగా ఇలాగే 300 మంది వన్యప్రాణి మిత్రులను నియమించినట్టు మోదీ గుర్తు తెచ్చుకున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో కెమెరా ఆర్డర్ చేస్తే...
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? బిజీ లైఫ్ లో షాపింగ్ చేసే ఓపిక లేకో...లేక బిజీబిజీ షెడ్యూల్ ..సమయం లేదనో ఆన్లైన్ షాపింగ్‌ను ఎంచుకుంటున్నారా? అయితే మీకో హెచ్చరిక. ఎందుకంటే ఆన్లైన్ లో విలువైన వస్తువులను ఆర్డర్ చేస్తే .. రాళ్లు, రప్పలు మనల్ని వెక్కిరించడం ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతోంది. ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్న వినియోగదారులకు వస్తువులకు బదులు రాళ్లు, ఇటుకలు రావడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఇలాంటి ఆన్లైన్ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ లో కెమెరాను ఆర్డర్ చేసిన వ్యక్తికి పార్సిల్లో రాయి, పిల్లలు ఆడుకునే రెండు బొమ్మ కెమెరాలు రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. నాగోల్ మమతా నగర్‌కాలనీకి చెందిన వినయ్(24) డీఎస్ఎల్ ఆర్ కెమెరా కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశారు. రూ.41 వేల విలువైన కెనాన్ ఈవోఎస్ 700డి కెమెరాను ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. తీరా సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్ విప్పి చూస్తే అందులో రాయి, డమ్మి కెమెరాలు దర్శనమిచ్చాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది, డెలివరీ బాయ్ ఎవరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని ఎల్బీ నగర్ ఎస్ఐ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఫ్లిప్‌కార్ట్ తిరస్కరించింది. కస్టమర్ కేర్ ద్వారా సంప్రదించినపుడు అత్యంత భద్రత మధ్య తమ ప్యాకింగ్ ఉంటుందనీ, డెలివరీకంపెనీ మోసం చేసి ఉంటుందని, దీనికి తమ బాధ్యత ఏమీ లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆన్లైన్ మోసాలు ఎంతలా జరుగుతున్నాయనేదానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం.. సో..ఇకపై ఆన్లైన్ షాపింగ్ చేసేటపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే.