సముద్రంలో చిక్కుకున్న నావ..
ముంబై: భారత నౌకాదళానికి చెందిన జిందాల్ కామాక్షి నౌక సముద్రంలో చిక్కుకుపోయింది. అయితే తక్షణమే రంగంలోకి దిగిన రక్షకదళాలు సహాయక చర్యలు చేపట్టి సిబ్బందిని కాపాడాయి ఇరవైమంది సిబ్బందితో ఉన్న నౌక ముంబై నౌకాశ్రయానికి నలభై నాటికల్ మైళ్లదూరంలో ప్రమాదంలో పడింది. బలమైన గాలుల కారణంగా పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో సిబ్బంది కలవరపడ్డారు. దాదాపు ఒక పక్కకు ఒరిగిపోతూ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తక్షణమే తమని రక్షించాలని కోరుతూ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
వెంటనే నావీకి చెందిన కింగ్ సీ 42 సీ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. ఆదివారం రాత్రికి 19 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. వాతావరణం అనుకూలించకపోవడంతో తరలింపు చర్యలను నిలిపివేశారు. అయితే ఓడలోనే ఉండిపోయిన మాస్టర్‌ను సోమవారం ఉదయం తరలించడంతో మొత్తం సిబ్బంది ప్రమాదం నుంచి బైటపడ్డారు.
కాగా ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రవాణా వ్యవస్థలు స్థంభించి, జనజీవనం అప్తవ్యస్తమైన సంగతి తెలిసిందే.