breaking news
dr. vishesh
-
క్రేజీ క్రేజీ టీనేజ్!
ఆత్మబంధువు ‘‘హాయ్ అక్కా.... ఎలా ఉన్నారు?’’ మాధవిని పలకరించింది రేఖ. ‘‘ఫైన్. నువ్వేంటీ ఇక్కడా?!’’ ఆశ్చర్యంగా అడిగింది మాధవి. ‘‘ఏం నేను షాపింగ్‌కు రాకూడదా?’’ ‘‘అలాగనేం కాదు. నువ్వు పుస్తకాల పురుగువి కదా. షాపింగ్‌కి ఆమడ దూరం కదా. అందుకే అడిగాను.’’ ‘‘అఫ్కోర్స్.. ఐ లవ్ బుక్స్. ఇప్పుడు కూడా బుక్స్ కొందామనే వచ్చా.’’ ‘‘అనుకున్నా’’ నవ్వుతూ అంది మాధవి. ‘‘సర్లే అక్కా నీ జోకులాపు. ఇంకేంటీ సంగతులు. పిల్లలెలా ఉన్నారు?’’ ‘‘పిల్లలకేం... బాగానే ఉన్నారు. మాకే కష్టంగా ఉంది.’’ ‘‘ఏమైందక్కా?’’ ‘‘ఏం చెప్పన్రా. చెప్పాలంటే పెద్ద కథే.’’ ‘‘అవునా... అయితే కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పద’’ అంటూ కాఫీ షాపుకు తీసుకెళ్లింది రేఖ. ‘‘ఆకాష్ ఇంటర్, నీహారిక టెన్త్ క్లాస్. ఇద్దరూ ఇద్దరే. చెప్పిన మాట అస్సలు వినడం లేదు’’ కాఫీ తాగుతూ చెప్పింది మాధవి. ‘‘టీనేజ్ కదా. ఇది కామన్.’’ ‘‘ఏంటి కామన్? ఒక్క మాట వినరు. ఏం చెప్పినా.. మాకు తెలుసులే అంటారు. ఇంకా చెప్పాలంటే... ఎదురు మాట్లాడతారు. వాడైతే విసురుగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. అదేమో గదిలోకి వెళ్లి ధడేల్మని తలుపేసుకుంటుంది. వీళ్లతో ఎలా వేగాలో అర్థం కావడం లేదు.’’ ‘‘టీనేజ్ అంటే అంతే. నిన్నటిదాకా చిన్నపిల్లల్లా మన వెంటే తిరిగినవాళ్లు పెద్దాళ్లయిపోయే వయసు. ఆ క్రమంలో వాళ్లు సొంతంగా ఆలోచిస్తారు. సొంత అభిప్రాయాలు ఏర్పడతాయి. వాటిని స్పష్టంగా చెప్పేస్తారు. వాటికి మనం అంగీకరించనప్పుడు మరింత గట్టిగా చెప్తారు. దాంతో వాళ్లు ఎదురు మాట్లాడి నట్లు మనం అనుకుంటాం. అంతే’’ చెప్పింది రేఖ. ‘‘అంతేనంటావా?! సరే... పొద్దున లేస్తే ఫోన్, ఫ్రెండ్స్. దీనికేమంటావ్?’’ ‘‘టీనేజ్ పిల్లలు ఫ్రెండ్స్‌కు ఇచ్చినంత ఇంపార్టెన్స్ పేరెంట్స్‌కు ఇవ్వరు. ఆ వయ సులో ఫ్రెండ్స్ మాటే వేదం. ఇక ఫోనం టావా... ఇప్పుడది లేకుండా ఎవరమైనా బయటకు కదులుతున్నామా?’’ ‘‘అలాగని వాళ్లు ఫోన్లో ఏమేమో మాట్లాడితే ఎలా?’’ ‘‘అక్కా... ఇక్కడే మనం తెలివిగా, లౌక్యంగా వ్యవహ రించాలి. వయసుకు వచ్చిన పిల్లలతో స్నేహితుల్లా ఉండాలని పెద్దలు చెప్పిన మాట గుర్తుందా? టీనేజ్ పిల్లలు మనం చెప్పింది వినాలంటే, మనం వాళ్ల ఫ్రెండ్స్‌గా మారిపోవాలి. వారి ఆశలు, ఆశయాలు, కలలు, కబుర్లు అన్నీ ఓపిగ్గా వినాలి, వాళ్లతో మన ఆలోచనలు పంచు కోవాలి. అప్పుడు వాళ్లే అన్నీ చెప్తారు. ఆ వయసులో శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా మార్పులు చాలా వేగంగా ఉంటాయి. ఆ మార్పులను వాళ్లు అర్థం చేసుకోలేక గాభరా పడుతుంటారు. అప్పుడు మనమే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే ఫ్రెండ్స్‌ను అడుగు తారు, వాళ్లు తమకు తెలిసింది చెప్తారు. అది మంచీ కావచ్చు, చెడూ చేయొచ్చు.’’ ‘‘నిజమే రేఖా... మొన్న నీహారికకు మొటిమలు వస్తే వాళ్ల ఫ్రెండ్స్ ఇచ్చిందని ఏదో క్రీమ్ రాసింది. మొహమంతా దద్దుర్లు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. ఒకటే తిట్లు, ఇలాంటివి మొహానికి ఎలా రాస్తారని’’ చెప్పింది మాధవి. ‘‘అందుకే... వాళ్లకు మనం నమ్మక మివ్వాలి... ఏం చెప్పినా అమ్మా నాన్నా అర్థం చేసుకుంటారని. అప్పుడు అన్నీ మనతోనే చెప్తారు.’’ ‘‘ఇక మీదట అలాగే ఉంటాను’’ చెప్పింది మాధవి. ‘‘ఈ వయసులో వాళ్ల ఇంట్రస్ట్‌లు, ఆటిట్యూడ్, వాల్యూస్ వేగంగా మారిపో తుంటాయి. వాటిని గమనించాలి.’’ ‘‘ఔన్రా... ఆకాష్గాడికి ఈ మధ్య బైక్స్ పిచ్చి పట్టింది. వాళ్ల నాన్నను అడిగితే ఇవ్వడని, మొన్న ఫ్రెండ్ బైక్ నడిపి దెబ్బలు తాకించుకున్నాడు. పెద్ద దెబ్బలేం కాదులే. కానీ వాళ్ల నాన్న నాలుగు పీకాడు గట్టిగా.’’ ‘‘అదే మనం చేసే తప్పు. ఆ వయసు పిల్లల్ని కొడితే మనపై ద్వేషం పెంచుకునే ప్రమాదం ఉంది.’’ ‘‘అలాగని వాళ్లు తప్పులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? ‘‘చూస్తూ ఊరుకోమని కాదక్కా. తప్పేమిటో ఒప్పేమిటో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆకాష్‌ను కొట్టే కంటే... అన్నయ్యే దగ్గరుండి బైక్ నేర్పితే సరిపోయేది.’’ ‘‘ఓహ్.. అలానా! సరే ఆయనకు చెప్తాలే. ఇంకా?’’ ‘‘అక్కా... పిల్లలకు లంచ్ టైమ్ అవుతుంది. నేను వెళ్లాలి. నీకు వీలైనప్పుడు ఇంటికి రా. తాపీగా మాట్లాడుకుందాం.’’ ‘‘ష్యూర్ రేఖా. తప్పకుండా త్వరగానే వస్తా. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫో!’’ అంటూ వీడ్కోలు తీసుకుంది మాధవి. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మీ జీవితంలో ఉప్పు ఉందా?
ఆత్మబంధువు ‘‘హాయ్ అక్కా’’ అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు సంతోష్. ఎవరా అని చూసింది రేఖ. తమ్ముడు సంతోష్. ఆనందం... ఆశ్చర్యం! ‘‘ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి. రారా’’ అంటూ ఆహ్వానించింది. ‘‘ఈ అక్కను చూడ్డానికి కూడా టైమ్ దొరకడం లేదా నీకు’’ అంటూ చిరుకోపం ప్రదర్శించింది. ‘‘సారీ అక్కా. వద్దామని ఉన్నా కుదరట్లేదు. అయినా నువ్వు కూడా ఇలా తిడితే నేనేం చేయగలను?’’ ‘‘సర్లేరా. అయినా నేను కాక ఇంకా తిట్టేవాళ్లున్నారా నిన్ను?’’ ‘‘ఉందిగా... మీ మరదలు.’’ ‘‘అదేంట్రా... ఇద్దరూ బాగానే ఉంటారుగా?’’ ‘‘ఉంటారు కాదు... ఉండేవాళ్లం. ఇప్పుడు రోజూ చిరాకులు పరాకులు.’’ ‘‘రోజూనా?’’ ‘‘రోజూ అంటే రోజూ కాదు. తరచుగా.’’ ఇంతలో ఆఫీసు నుంచి ఆనంద్ వచ్చేశాడు. ‘‘హల్లో సంతోష్... ఎలా ఉన్నావ్’’ అంటూ కూర్చున్నాడు. ‘‘సరే.. బావా మరుదులు మాట్లాడు కుంటూ ఉండండి. నేను వంట చేస్తా’’ అంటూ లేచింది రేఖ. ‘‘వంట అయిపోయింది. రండి’’ పిలిచింది రేఖ. ‘‘వద్దు అక్కా... నేను వెళ్తాను’’ అన్నాడు సంతోష్. ‘‘నేను కీర్తికి ఫోన్ చేసి చెప్పాలే. నువ్ భోంచేసి వెళ్లు.’’ తప్పదన్నట్లుగా కూర్చున్నాడు. రేఖ భోజనం వడ్డించింది. ‘‘ఏంటోయ్ ఈ కూరలో ఉప్పేలేదు’’ అన్నాడు ఆనంద్. ‘‘ఔనా... మర్చిపోయుంటాను.’’ ‘‘ఔనౌను.. తమ్ముడు వచ్చాడన్న ఆనందంలో మర్చిపోయుంటావ్.’’ ‘‘అంత లేదులెండి.’’ అంటూ కూరలో కాస్త ఉప్పు కలిపి, మళ్లీ వడ్డించింది రేఖ. ‘‘అబ్బబ్బ... ఇప్పుడు ఉప్పు ఎక్కువైందోయ్’’.. అరిచాడు ఆనంద్. ‘‘అబ్బబ్బ... తక్కువైతే తక్కువైందంటారు. ఎక్కువైతే ఎక్కువైందని అరుస్తారు. ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా?’’ ‘‘రోజూ అవుతూనే ఉన్నాంలే.’’ ‘‘ఇదిగో ఇదిరా మీ బావగారి వరస. పేరు ఆనందే కానీ, దుర్వాసుడి టైపు.’’ ‘‘నేను దుర్వాసుడి టైపయితే నీ పని బానే ఉండేది’’ అన్నాడు ఆనంద్. ‘‘బావుందనేగా చెప్తున్నా’’ అంది కొంటెగా రేఖ. అక్కాబావల గొడవ ముచ్చటగా అనిపించింది సంతోష్‌కి. అదే విషయం చెప్పాడు అక్కతో భోజనాల తర్వాత. ‘‘కూరలో ఉప్పు లేకపోతే ఎంత చప్పగా ఉంటుందో సంసారంలో చిన్న చిన్న గొడవలు లేకపోయినా అలాగే ఉంటుందిరా’’ అంది రేఖ. ‘‘చిన్న చిన్నవైతే పర్లేదక్కా. మావి పెద్ద పెద్ద గొడవలు. అంటే మా కూరలో ఉప్పు ఎక్కువైందన్నమాట’’ అన్నాడు నవ్వుతూ. ‘‘ఫీలవకురా. ఆ ఉప్పు బ్యాలెన్స చేయడానికి ఓ చిట్కా చెప్పనా?’’ అంది. ‘‘నీ దగ్గరకు వచ్చిందే అందుక్కదా.’’ ‘‘సరే... ఈసారి మీ ఆవిడ అరిచేటప్పుడు కొంచె నీళ్లు తాగు.’’ ‘‘కోపం వచ్చినవాళ్లు కదా వాటర్ తాగాలి?’’ సందేహం వ్యక్తం చేశాడు. ‘‘నేను చెప్పింది చెయ్యరా. కొంచెం వాటర్ తాగి, మీ ఆవిడ అరుపులు తగ్గేంత వరకూ నోట్లో అలాగే ఉంచుకో. అలా రెండు వారాలు చేసి చూడు.’’ ‘‘ఓకే. ఐ విల్ ట్రై’’ అనేసి సెలవు తీసుకున్నాడు సంతోష్. రెండు వారాల తర్వాత ఫోన్ చేశాడు సంతోష్. ‘‘నువ్వు చెప్పిన చిట్కా బాగా పని చేసిందక్కా. ఇప్పుడు తను అరవడం లేదు’’ అన్నాడు సంతోషంగా. ‘‘వెరీగుడ్... ఇక హ్యాపీగా ఉండు’’ అంది రేఖ తృప్తిగా. ‘‘అలాగే అక్కా. కానీ నాదో డౌట్. జస్ట్ గుక్కెడు నీళ్లు నా సమస్యని ఎలా పరిష్కరించాయంటావ్?’’ నవ్వింది రేఖ.‘‘నీ సమస్యను పరిష్కరించింది నీళ్లు కాదురా... నువ్వే.’’ ‘‘నేనా? అర్థం కాలేదు’’ అన్నాడు అయోమయంగా. ‘‘నోట్లో నీళ్లు ఉంటే నువ్వు మాట్లాడ లేవు కదా! అందుకే నీ భార్య అరిచే టప్పుడు నువ్వు ఎదురు మాట్లాడి ఉండవు. ఎప్పుడైనా రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఇద్దరి మధ్య మాటా మాటా సమానంగా పెరిగితేనే సమస్యలు. ఒకరికి కోపం వచ్చినప్పుడు రెండోవాళ్లు మౌనంగా ఉంటే కొట్లాట అన్నదే రాదు.’’ ‘‘వామ్మో... ఎన్ని తెలివి తేటలక్కా నీకు’’ అన్నాడు అక్క తెలివికి మురిసిపోతూ. ‘‘ఏడ్చావ్‌లే. జాగ్రత్తగా ఉండు’’... నవ్వి ఫోన్ పెట్టేసింది రేఖ. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్