breaking news
divison
-
‘కల్లూరు’ ఖరారు!
రెవెన్యూ డివిజన్ కేంద్రంగా దాదాపు ఖాయం అధికారికంగా ప్రకటించటమే తరువాయి.. పది మండలాలతో ప్రతిపాదనలు సత్తుపల్లి/కల్లూరు : కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి.. అంటున్నారు. వైరా రెవెన్యూ డివిజన్ కేంద్రమనే ప్రకటనతో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కల్లూరు లేదా సత్తుపల్లిని రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. నియోజకవర్గంలో ప్రాబల్యం ఉన్న రాజకీయనాయకులు ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలూ వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పంచాయితీ వెళ్లడంతో చివరకు కల్లూరును రెవెన్యూ డివిజన్ కేంద్రం చేస్తున్నట్టు సమాచారం. సత్తుపల్లి/కల్లూరు : కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టేనని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ప్రభుత్వంలో నిర్ణయం జరిగిపోయిందని.. అధికారికంగా ప్రకటించటమే తరువాయి అని తెలిసింది. వైరా రెవెన్యూ డివిజన్ ప్రకటన వెలువడగానే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. సత్తుపల్లి లేదా కల్లూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తారని భావించారు. అకస్మాత్తుగా వైరా తెరపైకి రావటం రాజకీయవర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల ప్రజల నుంచి బలంగా డిమాండ్ వినిపించింది. అధికార, ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలిచాయి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కల్లూరు రెవెన్యూ డివిజన్ సాధించేందుకు అండగా నిలిచాయి. సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు అత్యవసర మండల సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపించారు. కల్లూరు మండలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. కలెక్టర్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ప్రతి ఒక్కర్నీ అఖిలపక్షం బృందం కలిసి సమస్యను వివరించింది. కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ఆన్లైన్లో అభ్యంతరాలు, వినతులను పంపించారు. పంచాయితీ ముఖ్యమంత్రి వద్దకు.. కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ఈ ప్రాంత ప్రజలు రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి ఒప్పించినట్టు సమాచారం. కల్లూరు రెవెన్యూ డివిజన్ అన్ని మండలాలకు కేంద్రంగా ఉంటుందని.. ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు స్థల సేకరణ కూడా పూర్తయిందని వివరించినట్లు తెలిసింది. వైరా రెవెన్యూ డివిజన్ ఖమ్మానికి కేవలం 20 కిలోమీటర్ల దూరమే ఉందని.. వైరా రెవెన్యూ డివిజన్ కేంద్రం కావాలంటూ ఎన్నడూ కనీస ప్రతిపాదన కూడా లేదని వివరించినట్లు సమాచారం. పది మండలాలతో.. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, మధిర, ఎర్రుపాలెం మండలాలతో కలిపి కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు రెవెన్యూ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. ఇప్పటికే అధికార వర్గాలలో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఒక స్పష్టత వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
తూర్పున హై అలర్ట్
నేటి నుంచి మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు టార్గెట్లను అప్రమతం చేసిన పోలీసులు మంథని/మహాముత్తారం : ఉద్యమబాటలో అసువులు బాసిన అమరులను స్మరించుకునేందుకు మావోయిస్టులు ఏటా నిర్వహించే సంస్మరణ వారోత్సవాలు గురువారం నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. వారోత్సవాలను భగ్నం చేసేందుకు అటవీ గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. పశ్చిమ మావోయిస్టు సిద్దాంతకర్త చార్‌మజూందార్ 1977లో మృతిచెందాడు. అప్పటి నుంచి మావోయిస్టులు సంస్మరణ వారోత్సవాలను ఏటా తమకు పట్టున్న ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి పెట్టిన కోటాగా ఉన్న మహదేవాపూర్, మహాముత్తారం ప్రాంతాన్ని నక్సల్స్ గెరిల్లా జోన్‌గా ప్రకటించుకుని సమాంతర పాలన నడిపారు. కాలక్రమంలో పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అగ్రనాయకులు హతమయ్యారు. కొన్నేళ్లు ఈ ప్రాంతాన్ని వీడిన మావోయిస్టులు దండకారణ్యంలో తిష్టివేసి అప్పుడప్పుడు తూర్పున తమ ఉనికిని చాటుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్కౌంటర్లు ఆగుతాయని మావోయిస్టులు భావించారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన శృతి, విద్యాసాగర్‌ను తెలంగాణ పోలీసులు కాల్చి చంపడంతో మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు అందును కోసం చూస్తున్నారు. తాజాగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించి తూర్పున మళ్లీ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో తిప్పి కొట్టడానికి పోలీసులు గోదావారి పరీవాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మావోల టార్గెట్లను, మాజీ నక్సలైట్లను అప్రమత్తం చేసినట్లు మహాముత్తారం ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపారు. అయితే కొన్నేళ్లుగా ఉనికి కోల్పోయిన మావోయిస్టు పార్టీ జిల్లాలో ఎక్కడా సంస్మరణ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఏదేమైనా వారం రోజులు అటవీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.