breaking news
division issue
-
విభజన సమస్యల పరిష్కారానికి.. ఇక ప్రతి నెలా..
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉప కమిటీ ఇకపై ప్రతి నెలా సమావేశమై పురోగతిని సమీక్షించాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉప కమిటీ తొలి సమావేశం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. సుమారు గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ధిక శాఖ ప్రత్యేక సీఎస్ ఎస్.ఎస్.రావత్, రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఎస్ఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.గుల్జార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పెండింగ్ అంశాలపై చర్చించేందుకు ఇకపై ప్రతి నెలా సమావేశాన్ని నిర్వహిస్తామని ఆశిష్ కుమార్ తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి రావాల్సిన పలు రకాల బకాయిలపై ఉత్తర్వులు జారీ చేయాలని సమావేశంలో కేంద్ర హోంశాఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. సమస్యలు వేగంగా పరిష్కారమయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీ ఇద్దరికీ ఇవ్వాల్సిందే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనకు సంబంధించి కేంద్రానికి ప్రణాళిక అందచేశామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరారు. దీనిపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలం జాప్యం చేసి ఇటీవలే కౌంటర్ దాఖలు చేయగా, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని ఏపీ అధికారులు పేర్కొన్నారు. డబ్బులకు బదులుగా ఇచ్చిన ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలన్నారు. కరెంట్ బకాయిలపై.. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలపై ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర హోంశాఖను ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినందున ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. న్యాయపరంగా పరిశీలన చేసి విభజన చట్టప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ అధికారులు పేర్కొన్నారు. రూ.3,800 కోట్ల పన్నులు రావాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో నమోదైన పలు కంపెనీలు పన్నులు కూడా అక్కడే చెల్లించాయి. ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన రూ.3,800 కోట్ల పన్నులను ఇప్పించాలని ఏపీ అధికారులు ఉప కమిటీ సమావేశంలో కోరారు. ధాన్యం డబ్బులు, సబ్సిడీ.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ధాన్యం సేకరణకు కోసం వినియోగించిన రూ.400 కోట్ల ఏపీ నిధులను తిరిగి చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వడంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన రూ.600 కోట్ల సబ్సిడీని విడుదల చేయాలని సమావేశంలో ఏపీ అధికారులు కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులపైనా ఏపీ అధికారులు వాదనలు వినిపించారు. -
విభజన అంశాలపై పార్లమెంటులో చర్చించాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన విషయాలన్నింటినీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎజెండాగా చేర్చాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ వివరాలను రాష్ట్రపతి ప్రసంగంలో కూడా పొందుపరచాలని కోరుతూ ప్రధాని మోదీకి ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రఘువీరా మంగళవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తర కోస్తాలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన కన్పిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 27 లక్షల సంతకాలు సేకరించామన్నారు. ఈ-మెయిల్, మిస్డ్ కాల్ (7842434121) నంబరుకు కూడా ప్రజలు బాగా స్పందిస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయని పదేపదే చెబుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య ఆ లొసుగులేమిటో వెల్లడించాలన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో పోలీసులు, ఎన్నికల అధికారులు కుమ్మక్కై రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు