breaking news
diva junction
-
విధ్వంసానికి ప్లాన్.. రైలు పట్టాలపై అడ్డంగా..
ముంబయి: మొన్న కాన్పూర్.. నిన్న విజయనగరం.. నేడు ముంబయి.. ఈ మూడింట్లో రెండు చోట్ల భీకర రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా ముంబయిలో మాత్రం డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే గణతంత్ర దినోత్సవ వేళ మరో విషాదాన్ని గురించి చర్చించుకోవాల్సి వచ్చేది. గుర్తు తెలియని దుండగులు ఎవరో పట్టాలపై అడ్డంగా పెద్ద విరిగిన రైలుపట్టాను పెట్టారు. దాదాపు 15 మీటర్ల పొడవుండే పట్టాను రైలు ప్రమాదానికి గురయ్యేలా ఉంచి విధ్వంసక రచనకు దిగారు. ఈ ఘటన బుధవారం ముంబయిలోని దివా జంక్షన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. మడ్గావ్ నుంచి దాదార్‌కు వెళుతున్న జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఆ సమయంలో పట్టాలపై వెళుతోంది. అయితే, డ్రైవర్ అప్రమత్తత కారణంగా అతడు ముందుగానే పట్టాలపై అడ్డంగా పెట్టిన మరో పట్టాను గుర్తించి అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపేశాడు. అనంతరం కొంతమంది సహాయకుల ద్వారా దానిని పక్కకు తీసి పడేసి పదిహేను నిమిషాలు ఆలస్యంగా తిరిగి రైలు బయలుదేరింది. దీనిపై అత్యున్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిల్లో విధ్వంసక శక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు తలెత్తిన నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఈ ఘటన రైల్వే అధికారుల్లో మరింత గుబులు రేకెత్తిస్తోంది. -
దీవా జంక్షన్లో మరో ఫ్లాట్‌ఫాం..!
ప్రణాళిక రూపొందించిన ఎమ్మార్వీసీ సాక్షి, ముంబై: దీవా జంక్షన్లో లోకల్ ఫాస్ట్ రైళ్లు నిలిపేందుకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దీవా స్టేషన్లో ఒకటో నంబరు ప్లాట్‌ఫాం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మరో ప్లాట్‌ఫాం నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. ఫ్లాట్‌ఫాం నిర్మాణానికి దాదాపు ఏడాది పట్టవచ్చని సెంట్రల్ రైల్వే ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) నరేంద్ర పాటిల్ తెలిపారు. దీవా జంక్షన్ కావడంతో ఇక్కడ ఫాస్ట్ లోకల్ రైళ్లు ఆపాలని కొంత కాలంగా స్థానికులు, ముంబై శివారు ప్రాంతాల్లో ఉంటున్న కొంకణ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో ఇదే అంశంపై రైలు రోకో కూడా నిర్వహించారు. అది హింసాత్మకంగా మారడంతో ఈ అంశం రైల్వే దృష్టికి వచ్చింది. దీంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీవా స్టేషన్ నుంచి పన్వేల్ మీదుగా కొంకణ్, గోవా, మంగళూర్ తదితర (అప్, డౌన్) దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. వీటి కోసం పర్లాంగు దూరంలో ప్రత్యేకంగా ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. వాటిపై లోకల్ ఫాస్ట్ రైళ్లు ఆపేందుకు వీలుపడదు. కర్జత్, అంబర్నాథ్, ఉల్లాస్‌నగర్, కసరా, టిట్వాల, శహాడ్ తదితర ప్రాంతాల నుంచి దీవాకు వచ్చేవారు కల్యాణ్‌లో రైలు మారాల్సి వస్తోంది. వికలాంగులు, వృద్ధులు, పిల్లలు, లగేజీ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఫ్లాట్‌ఫాం నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదన రూపొందించడంలో అధికారులు మునిగిపోయారు. ఆ మేరకు కొత్తగా నిర్మించే ప్లాట్‌ఫారంపై స్లో అప్, డౌన్ లోకల్ రైళ్లు, ప్రస్తుతం ఉన్న పాత ప్లాట్‌ఫారంపై ఫాస్ట్ అప్, డౌన్ రైళ్లు నిలిపేందుకు మార్గం సుగమం కానుంది.