breaking news
District Medical and Health Officer
-
మహిళా ఉద్యోగులపై వేధింపులు.. కామారెడ్డి DMHO సస్పెండ్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్లు రుజువుకావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్ సింగ్ నాయక్ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి వివరాలను సేకరించారు. తమను డీఎంహెచ్‌వో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మహిళా ఉద్యోగులు ఆయనకు వివరించారు. దీంతో లక్ష్మణ్‌సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మహిళా మెడికల్ ఆఫీసర్లను లక్ష్మణ్ సింగ్ వేధిస్తున్నాడని తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. -
ఏసీబీ వలలో జిల్లా వైద్య అధికారి
కరీంనగర్: ఓ వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్‌వో) కొమరం బాలు గత రాత్రి ఏసీబీకి చిక్కాడు. దీంతో ఏసీబీ అధికారులు కరీంనగర్, వరంగల్‌లోని కొమరం బాలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా రూ. 50 లక్షల నగదుతోపాటు అర కిలో బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొమరం బాలు అతడి కుటుంబ సభ్యులకు దాదాపు 10కిపైగా బ్యాంకు లాకర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆ లాకర్లను ఒకటి రెండు రోజుల్లో తెరవనున్నట్లు తెలిపారు. వీణవంకలో విధులు నిర్వహిస్తున్న అనస్థీషియా వైద్యుడు ఎన్. సుధాకర్‌కు ఇటీవల చీర్లవంక బదిలీ అయింది. అయితే తన బదిలీని రద్దు చేసి స్వస్థలంలోనే విధులు నిర్వహించేలా కొనసాగించాలని జిల్లా డీఎం అండ్ హెచ్వోను కలిశారు. ఆ క్రమంలో భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. తాను రూ. 60 వేల మాత్రమే ఇవ్వగలనని తెలిపారు. అందుకు డీఎంహెచ్‌వో అంగీకరించాడు. దాంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారుల వల వేసి డీఎంహెచ్‌వోను పట్టుకున్నారు. ఆ వ్యవహారంలో పాత్ర ఉన్న జూనియర్ అసిస్టెంట్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
అంతా నీ ఇష్టమా..?
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ‘నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు.. జీవోలున్నా అమలు చేయడం లేదు. ఎస్టాబ్లిష్మెంట్పై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఏదైనా అడిగితే డెరైక్టర్ ఆఫ్ హెల్త్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. అంతా నీ ఇష్టమా...?. ఇప్పటి వరకు ఏఏ ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయో చూసి సోమవారం నా వద్దకు తీసుకురండి’ అంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) డాక్టర్ వై. నరసింహులుపై జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వోపై పలు ఫిర్యాదులు రావడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబుతో కలిసి కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి స్వయంగా శనివారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో డీఎంహెచ్‌వోతో పాటు చాలా మంది ఉద్యోగులు కూడా లేకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు. దీంతో ఆయన డీఎంహెచ్‌వో ఎక్కడున్నారని అక్కడున్న అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ రాజాసుబ్బారావును, ఉద్యోగులను ప్రశ్నించారు. ఇంకా రాలేదని వారు చెప్పడంతో... వెంటనే పిలిపించండన్నారు. అనంతరం కలెక్టర్, జేసీ ఇద్దరూ కార్యాలయంలోని అన్ని సెక్షన్లను పరిశీలించారు. ఏఏ సెక్షన్లో ఎవరు పనిచేస్తున్నారు.. వారు ఏఏ విధులు నిర్వరిస్తున్నారు...ఏవైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అర్ధ గంటకు పైగా వారిద్దరూ కార్యాలయంలో పర్యటించారు. ఎంతో కాలంగా డీఎంహెచ్‌వోపై అసంతృప్తిగా ఉన్న సిబ్బంది ఈ సందర్భంగా కలెక్టర్‌తో వారి సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు. డీఎంహెచ్‌వోపై వచ్చిన పలు ఆరోపణలను ప్రస్తావించారు. ఇక్కడ సమస్యలతో విసిగి వేసారిన తమకు న్యాయం చేయాలని కోరారు. ఈలోగా డీఎంహెచ్‌వో డాక్టర్ వై. నరసింహులు వచ్చి వారితో కలిశారు. ఆయనతో పెద్దగా మాట్లాడకుండా పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారంలోగా ఎస్టాబ్లిష్మెంట్ ఫైళ్లన్నీ తన దగ్గరకు తీసుకురావాలని ఆదేశించారు. కుప్పలు తెప్పలుగా పెండింగ్ ఫైళ్లు ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, వారు తిరిగి విధుల్లో చేరాలని తిరుగుతున్నా స్పందన లేదు. వారిని విధుల్లో చేర్చుకోకుండా తిప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి రెండు సంవత్సరాల ఇంక్రిమెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పత్తికొండ సీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ గొడవ పడి అక్కడి కార్యాలయానికి 15 రోజులుగా తాళం వేశారు. దీంతో అక్కడి సిబ్బంది జీతాలు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు ఉన్నాయి. ఫార్మాసిస్టు శారద సస్పెన్షన్‌పై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఆ ఉత్తర్వులను తెచ్చి చూపినా సస్పెన్షన్‌పై డీఎంహెచ్‌వో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఆమె వారం రోజుల క్రితం గట్టిగా ప్రశ్నించారు. దీంతో డీఎంహెచ్‌వో పోలీసులను ఆశ్రయించి రక్షణ కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు నెలలుగా గార్గేయపురం మెడికల్ ఆఫీసర్ జీతాన్ని డీఎంహెచ్‌వో ఆపేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వెల్దుర్తి పీహెచ్సీవో ఓ హెల్త్ అసిస్టెంట్ మూడు నెలలు సెలవు పెట్టి తిరిగి విధుల్లో చేరాలని వచ్చినా పోస్టింగ్ ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. కారుణ్య నియామకాలు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం చెన్నయ్య అనే డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే నైట్‌వాచ్‌మెన్ హుసేన్ ఆరు నెలల క్రితం మరణించారు. పత్తికొండ ల్యాబ్‌టెక్నీషియన్ స్వాములు ఆరు నెలల క్రితం చనిపోయారు. వీరికి సంబంధించి కారుణ్య నియామకాలు, బెనిఫిట్స్ ఇప్పటి వరకు తేల్చకుండా తిప్పుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పలు ఆసుపత్రులు, క్లినిక్‌లను రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. నంద్యాలలోని ఎంఎస్ నగర్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్‌ను నియమించాలని దరఖాస్తులు వచ్చినా స్పందన లేదు. కర్నూలు నగరం వీకర్‌సెక్షన్ కాలనీలోని అర్బన్‌హెల్త్ సెంటర్‌ను రెడ్‌క్రాస్ సొసైటీకి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించి రెండు నెలలైనా అమలు కాలేదు. -
అనంత జిల్లా వైద్యాధికారికి బెదిరింపులు
అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులలో ముమ్మురంగా తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్ఓ) రామ సుబ్బారావు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలలో తనిఖీలు నిర్వహిస్తే చంపేస్తామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఆయన్ని బెదిరించారు. జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులలో ఆయన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను ఆయన సీజ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఆశా ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్‌ను రామసుబ్బారావు సీజ్ చేశారు. దాంతో ఆయనకు బెదిరింపులు వచ్చి ఉంటాయని ఆయన భావిస్తున్నారు.