breaking news
Director Dasari Narayana Rao
-
దాసరికి తుది వీడ్కోలు..
మొయినాబాద్ రూరల్ (చేవెళ్ల) : సినీ దర్శకుడు, నటుడు, సామాజిక ఉద్యమకారుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట సమీపంలోని ఆయన ఫాంహౌస్ పద్మ గార్డెన్స్‌లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆయన అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు చితికి నిప్పంటించారు. దాసరి భౌతికకాయానికి నిప్పంటించే ముందు పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అంతకుముందు హైదరాబాద్ నగరంలోని ఫిలిం ఛాంబర్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట పద్మగార్డెన్కు చేరుకుంది. అనంతరం దాసరి పద్మ సమాధి పక్కన ఏర్పాటు చేసిన చితిపై దాసరి మృతదేహాన్ని ఉంచారు. దాసరి చితిపై చేవెళ్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు పుష్పగుచ్చాలుంచి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరైన సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు... దాసరి అంత్యక్రియలకు సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాత కోడి రామకృష్ణ, సినీ నటులు మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్. నారాయణమూర్తి, శ్రీకాంత్, శివాజీ, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతురావు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ముద్రడడ పద్మనాభం తదితరులు హాజరయ్యారుజ కన్నీరు మున్నీరైన దాసరి కుటుంబ సభ్యులు దాసరి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దహనసంస్కారం జరుగుతున్న సమయంలో అందరూ ఒక్కసారిగా బోరున రోదించడం అందరినీ కంట తడి పెట్టించింది. దాసరి నారాయణరావు కుమారులు ప్రభు, అరుణ్, కూతురు హేమ, మనుమలు, మనవరాళ్లు తాత మరణాన్ని జీర్ణించుకోలేక కంటతడి పెట్టుకున్నారు. భార్య సమాధి పక్కనే.. దాసరి నారాయణరావు గతంలో ఫాంహౌస్‌కు 15 రోజులకొకసారి, పండుగలప్పుడు ఫాంహౌస్‌కు వచ్చేవారని ఫాంహౌస్ మేనేజర్ మధుసూదన్‌రావు తెలిపారు. ఆయన వచ్చినప్పుడల్లా నా సమాధిని కూడా తన భార్య పద్మ సమాధి పక్కనే ఏర్పాటు చేయాలని చెప్పేవారన్నారు. మూలస్తంభాన్ని కోల్పోయాం : ఎస్పీ బాలసుబ్రమణ్యం దాసరి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. ఆయన మరణంతో తెలుగు సినీరంగం మూలస్తంభాన్ని కోలో్పయినట్టయిందని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నారు. దాసరి అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంతోమంది నటులు, నటీమణులను, కళాకారులను పోషించి చిత్ర పరిశ్రమకు అందించిన దాసరి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. యువతకు చేయూతనిచ్చిన దాసరి : వీహెచ్ సినీరంగంలో యువతకు దాసరి ఎంతో చేయూతనిచ్చాడని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. పద్మ గార్డెన్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దర్శకరత్న దాసరి మృతి యువతకు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. రాజకీయంగా, సినీరంగంలో అందరినీ కలుపుకుపోయే స్వభావం కలిగిన మహనీయుడు దాసరి అన్నారు. -
తెలుగు 'క్యారెక్టర్' లేదు
అల్లు అర్జున్ తండ్రి క్యారెక్టర్ వేయడానికి తెలుగులో ‘సరైనోడు’ లేడట! తమిళ జయప్రకాశ్‌ను తెచ్చుకున్నారు! ‘మిర్చి’లో ప్రభాస్ తండ్రి పాత్ర చేయడానికి తెలుగువాళ్ళలో గుంటూరు కారం లేదట! సత్యరాజ్‌ను ఇంపోర్ట్ చేసుకున్నారు! ‘అత్తారింటి’ని ‘దారి’లో పెట్టాలనుకున్న కల్యాణ్‌కి తెలుగు తాత దొరకలేదట! బాంబే ‘దారి’ పట్టాల్సి వచ్చింది! బొమన్ ఇరానీని తేవాల్సి వచ్చింది! ‘భలే భలే మగాడి’కి భలే భలే తెలుగు మామా కరవేనట! హిందీ నుంచి మురళీశర్మను పిలిపించాల్సి వచ్చింది! ...ఇలా తెలుగు సినిమా ఇప్పుడు దారి మళ్ళింది. తెలుగు ‘క్యారెక్టర్’లపై మాకు గాలి మళ్ళింది. లేటెస్ట్ సమ్మర్ రిలీజ్ ‘సరైనోడు’లో హీరో అల్లు అర్జున్ అచ్చ తెలుగు తండ్రి పాత్ర చూశారా? ఆ పాత్ర వేసింది - తమిళ యాక్టర్ జయప్రకాశ్. ఆయనొక్కడే కాదు... ఇవాళ మన తెలుగు తెరపై కనిపిస్తున్న చాలామంది తండ్రులు, బాబాయ్‌లు పరాయిభాషల నుంచి వలస వచ్చిన యాక్టర్లే! ఇప్పుడు తెలుగు తెరపై క్యారెక్టర్లన్నీ వాళ్ళతోనే పండుతున్నాయి. పొరుగింటి పుల్లకూరే రుచా?! ‘‘మాకు వచ్చే అవకాశాలే తక్కువ. ఒక వేళ ఒకటీ అరా వచ్చినా, ఇచ్చినా - షూటింగ్లో వసతులుండవు. సరైన పారితోషికమూ ఇవ్వరు. కానీ, పరాయి రాష్ట్రాల నుంచి రప్పించిన నటీనటులకు మాత్రం మన దర్శక, నిర్మాతలు ఫైవ్‌స్టార్ హోటళ్ళు, వ్యక్తిగత మేకప్, హెయిర్స్టైలిస్ట్లతో సహా రాజభోగాలు అందిస్తారు’’ అని తెలుగువారైన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకరు వాపోయారు. కళకు కులం, మతం, భాష, ప్రాంతం లాంటి ఎల్లలు ఉండవు. కరెక్టే! కానీ, పక్కా తెలుగు సినిమాలో అచ్చ తెలుగు పాత్రల్ని కూడా ఈ అరువు తారలతో నింపేయడం ఏమిటన్నది అవకాశాలు కోసం ఆకలితో ఎదురుచూస్తున్న ఈ స్థానిక తెలుగు కళాకారుల ఆవేదన. కానీ, బాహాటంగా ఆ విమర్శ చేస్తే, వచ్చే ఆ నాలుగు చిన్న వేషాలు కూడా రాకుండా పోతాయేమోనని చాలామంది ఆర్టిస్టులు పెదవి విప్పడం లేదు. కోట శ్రీనివాసరావు లాంటి ఒకరిద్దరు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లే ఈ అన్యాయంపై బాహాటంగా ఒకటికి రెండుసార్లు గతంలో వ్యాఖ్యానించారు. మనకి మనవాళ్ళు లేరా? పనికిరారా? నిజానికి, తెలుగులో తెలుగువాళ్ళయిన క్యారెక్టర్ ఆర్టిసులు లేరా అంటే, ఉన్నారు. అద్భుతమైన నటులున్నారు. కోట శ్రీనివాసరావు నుంచి ఇప్పుడు మళ్ళీ కొత్త ఊపందుకున్న నరేశ్, రాజేంద్రప్రసాద్ దాకా సీనియర్లున్నారు. నిన్నటి సాయికుమార్ మొదలు ఇవాళ్టి కొత్త తరం రావు రమేశ్, అజయ్, సుబ్బరాజు దాకా అనేకమంది ఉన్నారు. అంతమంది ఉన్నా గత సినిమా సక్సెస్‌ను బట్టే తప్ప, వాళ్ళ అసలుసిసలు ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తున్న సందర్భాలు అరుదని వాపోతున్నారు. మనవాళ్ళకు వచ్చే అవకాశాలు, ఇచ్చే పారితోషికాలతో పోలిస్తే, పరభాషా నటులదే పైచేయి! వెరసి, స్థానిక కళాకారులు ఇప్పుడు ‘ద్వితీయ శ్రేణి పౌరులు’గా మిగిలిపోతున్నారు. ఈ విషయంలో ఏదైనా చేసి, స్థానిక కళాకారులకు ఛాన్స్‌లు వచ్చేందుకు తమ వంతుగా ఏదో ఒకటి చేయాలని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. బడ్జెట్... తడిసి మోపెడు! ఆ మాట ఎలా ఉన్నా, సినిమా బడ్జెట్ పైనా ఈ ప్రభావం పడుతోంది. ‘‘పరాయి రాష్ట్రాల నుంచి వస్తున్న నటులకు వారి వారి స్థాయిని బట్టి రోజుకు లక్ష పైగానే పారితోషికం ఇస్తున్నాం. వారి వెంట వచ్చే అసిస్టెంట్స్‌కూ రాజభోగాలే. ఇక, రానూపోనూ విమానం టికెట్లు, షూటింగ్లో ప్రత్యేకంగా క్యారవాన్ల ఖర్చు సరేసరి. ఇవాళ తెలుగు సినిమా బడ్జెట్ తడిసిమోపెడవడానికి ఇదీ ఒక కారణమే’’ అని సినీరంగంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ప్రొడక్షన్ కంట్రోలర్ ఒకరు వ్యాఖ్యానించారు. పెద్దవాళ్ళయిన పరాయి నటులు కొందరికైతే పాతిక లక్షల పైగా చెల్లిస్తున్నారు. తాజాగా ‘జనతా గ్యారేజ్’లో నటించడానికి మోహన్‌లాల్‌కు ఎనిమిది అంకెల పారితోషికం చెల్లించినట్లు కృష్ణానగర్ గుసగుస. వట్టి ఇంపోర్టేనా? ఎక్స్పోర్ట్ లేదా? బ్లాక్ అండ్ వైట్ సినిమాల యుగంలో ఎస్వీ రంగారావు, కన్నాంబ, సావిత్రి లాంటి వాళ్ళు స్వచ్ఛమైన ఉచ్చారణతో ‘అచ్చమైన అరవవాళ్ళ’ను మించి మరీ తమిళనాడును ఏలారు. తమిళ ప్రేక్షకులకు ఇంట్లో మనుషులయ్యారు. కానీ, ఇప్పుడు తెలుగుగడ్డ నుంచి ఇతర భాషల్లోకి వెళ్ళి అక్కడ నటిస్తున్నవారు కొద్దిమందే! కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం లాంటి ఒకరిద్దరు మటుకే పరాయి భాషల సినిమాల్లో అప్పుడప్పుడు మన ఉనికిని గుర్తుచేస్తున్నారు. హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్‌గా మారిన జగపతిబాబు మాత్రం ఒకట్రెండు తాజా ఛాన్సలతో తెలుగు నుంచి తమిళ, మలయాళాలకూ ఎగుమతి అయ్యారు. కానీ, అప్పుడూ ఇప్పుడూ మన నుంచి ఎగుమతి కన్నా దిగుమతే ఎక్కువ. అందుకే, ఇవాళ తెలుగు తెర అరవ, హిందీ తారలతో నేటివిటీని వదులుకొని, పరాయి అత్తరు పులుముకొంటోంది. ‘‘అవార్డ్స కూడా సాధించిన ఇన్నేళ్ళ తరువాత కూడా సినీరంగంలోకి కొత్తగా కాలుపెట్టినవాడిలాగే ఉంది నా పరిస్థితి. మా కోసం రాసిన పాత్రలు లేవు. ఎవరి కోసమో రాసిన పాత్రలు ఆఖరి క్షణంలో మా కొస్తే, వాటితో సర్దుకోవాల్సి వస్తోంది’’ అని సాక్షాత్తూ సాయికుమార్ కూడా ఆ మధ్య కడుపు చించుకున్నారు. కానీ, ఆవేదన నిండిన ఈ మాటల్ని వినేవాళ్ళెవరన్నది ప్రశ్న. మార్కెట్ విస్తరణ వ్యూహమా? అసలు ఇలా పరాయివాళ్ళతో మన వెండితెరను ముంచెత్తుతున్న పాపం ప్రధానంగా మన దర్శకులదేనని ఒక ఆరోపణ. కానీ, దర్శకుల వాదన మాత్రం వేరుగా ఉంది. ‘పరాయిభాషల వాళ్ళయినంత మాత్రాన వారి ప్రతిభను మనం ఉపయోగించుకోకూడదా’ అన్నది వారి ప్రశ్న. పైగా, ప్రపంచీకరణ నేపథ్యంలో భాష, ప్రాంతాల సరిహద్దులు చెరిగిపోతున్నప్పుడు ఇంకా భాషాభేదాల్ని పట్టుకు వేలాడడం తప్పంటున్నారు. పెపైచ్చు, దీనికి ఒక మార్కెట్ కోణాన్ని కూడా ఆపాదిస్తున్నారు. తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు తమిళ, మలయాళ, కన్నడ, ఉత్తరాది ప్రాంతాలకు కూడా క్రమంగా విస్తరిస్తోంది. అక్కడ మన సినిమాకు వ్యాపారం, వసూళ్ళు బాగా ఉండాలంటే - అక్కడ సుపరిచితమైన ఆ స్థానిక తారల్ని ఉపయోగించడం కూడా మార్కెట్ వ్యూహంలో భాగమే అన్నది దర్శక, నిర్మాతల వాదన. కానీ, ఎవరి వాదన ఎలా ఉన్నా... కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టులను అన్వేషించి, వారికి అవకాశాలిచ్చి ఆదరించిన దాసరి నారాయణరావు, జంధ్యాల, ఇ.వి.వి. సత్యనారాయణ లాంటి దర్శకుల తరం తరువాత ఇప్పుడు తెలుగు తెర బోసిపోయింది. స్థానికంగా నటుల్ని తయారుచేసుకొని, ప్రోత్సహించలేకపోతోంది. వెరసి, తెలుగు ‘క్యారెక్టర్’ మారిపోయింది! ఇంకా చెప్పాలంటే, తెలుగు ‘క్యారెక్టర్’ ఆల్మోస్ట్ లేకుండా పోయింది! - రెంటాల జయదేవ భారీగా పారితోషికాలు గతంలో ‘సినిమాకింత’ అని పారితోషికమిచ్చేవారు. నయా రియల్ ఎస్టేట్ నిర్మాతలు, వాళ్ళని మభ్యపెట్టిన కొందరు మేనేజర్ల వల్ల ‘రోజుకు ఇంత’ అనే సంస్కృతి వచ్చింది. మన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల్లో చాలామంది పారితోషికం రోజుకి లక్ష లోపే. పరాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్‌కి మాత్రం పాపులారిటీ, గత సక్సెస్‌ని బట్టి రోజుకు లక్షల్లో ఇస్తున్నారని సినీవర్గాల మాట! ప్రకాశ్‌రాజ్: రూ. 75 లక్షలు- 1.5 కోట్లు (సిన్మాకిచ్చే డేట్స్ బట్టి) మోహన్‌లాల్: రూ. 1 కోటి పైనే (‘జనతా గ్యారేజ్, మనమంతా’) ఉపేంద్ర: రూ. 1.40 కోట్ల దాకా (‘సన్నాఫ్ సత్యమూర్తి’) సత్యరాజ్: రూ. 75 లక్షలు- కోటి (‘బాహుబలి2, బ్రహ్మోత్సవం’) సోనూసూద్: రూ. 80 లక్షలు - 1 కోటి (‘అతడు’కి రూ.4లక్షల్తో మొదలై, ‘జులాయి’కి 80 లక్షలకెదిగి, ఇప్పుడు కోటి తీసుకుంటున్నారు) ‘మిర్చి’ సంపత్‌రాజ్: రూ. 50 లక్షల పైనే (‘లౌక్యం, శ్రీమంతుడు’) బొమన్ ఇరానీ: 40లక్షలు (‘అత్తారింటికి దారేది, బెంగాల్ టైగర్’) మురళీశర్మ: రూ. 50 లక్షలు (‘సావిత్రి, భలేభలే మగాడివోయ్’) ముఖేశ్ బుషి: రోజుకు 1.5 - 2 లక్షలు (‘స్పీడున్నోడు, ఒక్కడు’) ఆశిష్ విద్యార్థి: రోజుకు 1 లక్ష పైనే (‘కల్యాణవైభోగమే, కిక్2’) మహేశ్‌మంజ్రేకర్: రోజుకు 1లక్ష పైనే (‘గుంటూర్ టాకీస్, అఖిల్’) జయప్రకాశ్: రోజుకు రూ. 1 లక్ష పైనే (‘సరైనోడు’) రహమాన్: రోజుకు1లక్ష పైనే (‘గోవిందుడు అందరివాడేలే, సింహ’) నాజర్: రోజుకు రూ. 1 లక్ష పైనే (‘బాహుబలి’) ‘‘ఇదివరకూ పరభాషా నటులున్నారు. ఈ మధ్య ఎక్కువయ్యారు. స్టార్ డెరైక్టర్ - స్టార్ హీరో కాంబినేషన్ల ట్రెండ్ వచ్చాక, ఇతర భాషల నుంచి నటీనటులను తీసుకుంటే అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుందనే తప్పుడు ఆలో చనతో ఈ సంస్కృతి ఎక్కువైంది. మనకిక్కడ ఆర్టిస్టులు లేరనుకోవడం కరెక్ట్ కాదు! పరిశ్రమే నటీనటుల్ని తయారుచేసుకోవాలి. రంగస్థలం నుంచి నటుల్ని ప్రోత్సహించాలి.’’ - దర్శకుడు దాసరి నారాయణరావు