అమెరికాలో జాతి వివక్ష పెరిగింది: దిగ్విజయ్
హైదరాబాద్సిటీ: ఇటీవల ఇద్దరు తెలుగు వారు అమెరికాలో హత్యకు గురికావడాన్ని ఖండిస్తున్నానని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో జాతి వివక్ష పెరిగిందన్నారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుస్మా స్వరాజ్ అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి భారతీయులకి రక్షణ కల్పించాలని కోరారు. ట్విటర్ లో చేసిన వాఖ్యలకు తెలంగాణలో నా పై ఎఫ్ఐఆర్ దాఖలు అయినట్లు తెలిసిందన్నారు.
హిందూ-ముస్లిం మత ఛాందస వాదాన్ని మొదట నుంచి తాను వ్యతిరేకిస్తున్నానని, మదర్సాలను ఆధునికరించాలని కోరినట్లు తెలిపారు. మత ఛాందస వాదం సెక్యులరిజానికి విఘాతం కలిగిస్తోందన్నారు. ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటుందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దిగ్విజయ్ విమర్శించారు. ఇష్టానుసారం ప్రాజెక్టుల వ్యయ అంచనాలను ప్రభుత్వం పెంచుతోందన్నారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న పేద రైతులకు 2013 కేంద్ర భూ సేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రెవిన్యూ మిగులు ఉన్న రాష్ట్రానికి సీఎం కేసీఆర్ అవసరం లేకపోయినా అప్పులు తెస్తున్నారని ఆరోపించారు. పెత్తనం అంతా కేసీఆర్ కుటుంబం చేతిలోనే సాగుతోందన్నారు దుయ్యబట్టారు. మార్చి 31 లోగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు పూర్తవుతుందని, ఈ నెల 9న సీఎల్పీ భేటీలో పాల్గొనేందుకు మళ్లీ హైదరాబాద్ రానున్నట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు.