breaking news
deputy tahasildhar
-
ఏసీబీకి చిక్కిన డిప్యూటి తహసీల్దార్
సాక్షి, నాగర్‌కర్నూల్ : కలెక్టరేట్లోని సి–సెక్షన్లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డిప్యూటి తహసీల్దార్ జయలక్ష్మి సోమవారం సాయంత్రం రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాలిలా.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారెపల్లికి చెందిన దోమ వెంకటయ్య అనే రైతు అదే గ్రామానికి చెందిన బంధువులు విమల, విప్లవ, వికాస్ అనే వ్యక్తుల వద్ద 3 ఎకరాల 15 గుంటల భూమిని 2016లో కొనుగోలు చేశాడు. ఆ భూమిని తన పేరుపై పట్టా మార్చుకునేందుకు తిమ్మాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి 2006లో విమల, విప్లవ, వికాస్‌ల తాతయ్య బృంగి తిర్పతయ్య తనకు ఆ భూమిని ముందే అమ్మాడని, దోమ వెంకటయ్యకు పట్టా చేయవద్దంటూ తిమ్మాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో పిటిషన్ వేశాడు. అప్పటినుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై నాగర్‌కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకటయ్య జేసీకి పిటిషన్ ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన క్రమంలో సి–సెక్షన్లో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జయలక్ష్మీతో పరిచయం ఏర్పడింది. ఈ వ్యవహారాన్ని తాను చక్కబెట్టి వెంకటయ్యకు అనుకూలంగా కేసు వచ్చేలా చూస్తానని డీటీ రూ.13లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.10 లక్షలకు బేరం కుదిరింది. ఒకేసారి అంత నగదు ఇవ్వలేకపోతే విడతలవారీగా ఇవ్వాలని జయలక్ష్మి కోరడంతో తన వద్ద అంత డబ్బు లేదని వెంకటయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పట్టుబడిందిలా.. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు అవినీతి చేపను పట్టేందుకు వలపన్నారు. సోమవారం రూ.లక్ష అడ్వాన్స్‌గా డీటీ జయలక్షి్మకి వెంకటయ్య ఇచ్చేలా పతకం రచించారు. ముందుగా డీటీని వెంకటయ్య కలిసి డబ్బులు తెచ్చానని కోరగా కాసేపు అటుఇటు తిప్పి కలెక్టరేట్లోని ఓ గదిలో తీసుకరావాలని కోరారు. అనుకున్నట్టుగా డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి ఏసీబీ అధికారులకు చెప్పాడు. వెంటనే వారు దాడిచేసి రెడ్ హ్యాడెడ్‌గా çపట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు . కోర్టులో హాజరు పరుస్తాం రైతు వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించామని, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు ఫిర్యాదును స్వీకరించి దాడులు చేశామని, అనుకున్నట్టుగానే డబ్బులు తీసుకుంటూ డీటీ పట్టుబడ్డారని తెలిపారు. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో కూడా మరో బృందం తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీనెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని కోరారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పాలమూరులో తనిఖీలు మహబూబ్‌నగర్ క్రైం: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న జయలక్ష్మీ సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సరిగ్గా అదే సమయంలో పాలమూరులోని ఆమె ఇంట్లో సైతం తనిఖీలు జరిగాయి. జయలక్ష్మీ నివాసం ఉండే మర్లులోని మహాలక్ష్మీ టవర్స్‌లోని 203 ఫ్లాట్‌లో ఏసీబీ సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు ఇంటిని మొత్తం తనిఖీలు చేశారు. ఇంట్లో ఉన్న ప్రతి గదిని, బీరువాలు, ఇతర స్థలాలు అన్నింటిని పరిశీలించారు. ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్, ల్యాప్‌టాప్‌ను స్వా«దీనం చేసుకున్నారు. -
రైస్‌మిల్లులపై విజిలెన్స్ దాడులు
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగరంలోని పలు రైస్‌మిల్లులపై పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్ అధికారులు, డిప్యూటీ తహశీల్దార్లు సోమవారం దాడులు నిర్వహించారు. ‘ఎల్లలు దాటుతున్న మన బియ్యం’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన వార్తకు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. జిల్లావ్యాప్తంగా రైస్‌మిల్లులపై దాడులకు ఆదేశాలు జారీచేశారు. స్టోన్‌హౌస్‌పేటలోని లక్ష్మీప్రసన్న, కో ఆపరేటివ్ సొసైటీ మిల్లులపై అధికారులు దాడులు చేశారు. దీంతోపాటు శ్రీలక్ష్మీపద్మావతీ రైస్‌మిల్లులో కూడా తనిఖీలు నిర్వహించి బియ్యం శాంపిళ్లు సేకరించారు. నివేదికలను జేసీకి అందజేస్తామని అధికారులు తెలిపారు. జేసీ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ శాంపిళ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్రోలు, కిరోసిన్ బంకులపై కూడా దాడులు జిల్లాలో ఒక పెట్రోల్, 11 కిరోసిన్ హోల్‌సేల్ బంకులతోపాటు ఆరు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించామని జేసీ తెలిపారు. అక్రమాలకు పాల్పడిన గ్యాస్ ఏజెన్సీలకు రూ.1.55 లక్షలు, ఆయిల్ ట్రేడర్లకు రూ.60 వేలు జరిమానా విధించామని చెప్పారు. కోవూరు కిరోసిన్ బంకు (జ్యోతి ఏజెన్సీ) లెసైన్సు రద్దుచేశామన్నారు. మిల్లులకు రూ.46,342 జరిమానా విధించినట్లు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ, కావలి ఏఎస్వో శ్రీహరి, సీఎస్ డీటీలు లాజరస్, కాయల సతీష్‌కుమార్ పాల్గొన్నారు.