breaking news
DEO in charge
-
బాబు చేసిన పాపం..సర్కారు బడులకది శాపం
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం, అన్ని పాఠశాలలకు మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేదికలెక్కిన ప్రతిచోట ఊపదంపుడు ఉపన్యాసాలను చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి చూస్తే మేడిపండు చందంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో çసరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం, సరైన మౌలిక వసతులు కల్పించలేక పోవడంతోపాటు పిల్లల చదువుపై అంతగా భరోసా ఇచ్చే పాలకులు కానీ అధికారులు గానీ లేరు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. విద్యార్థులు లేని కారణంగా రేషనలైజేషన్ పేరుతో గత ఐదేళ్లలో జిల్లాలో 208 పాఠశాలలు మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాథమిక విద్య పిల్లల భవిష్యత్తుకు పునాది లాంటిది. అలాంటి పునాదిగా ఉండే ప్రాథమిక విద్యాలయాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మొక్కుబడులుగా మారాయి. దీంతో పేద వర్గాల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇష్టపడడం లేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ రోజు పిల్లలు లేక కళావిహీనంగా మారాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టని కారణంగా ఏటేటా మూతపడే స్కూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని పాఠశాలలు మూతపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉన్న ఊరిలో బడులు మూసేయడంతో పొరుగు ఊళ్లకు పిల్లలను పంపడం భారంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాన్వెంటులకు పంపుకునే స్థోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలు డ్రాపౌట్స్‌గా మారి బాల కార్మికులుగా మారుతున్నారని ఆందోళన చెందుతున్నారు. 2017 ఏడాదిలో 70 స్కూళ్లు జిల్లాలో 2017లో విద్యార్థుల సంఖ్య లేని కారణంగా 70 స్కూళ్లు మూతపడ్డాయి. ఇందులో బి.మఠం మండలంలో 3 స్కూళ్లు, కాశినాయనలో 3, టి.సుండుపల్లెలో 6, వేములలో 4, ఒంటిమిట్టలో 3, బి.కోడూరులో 2, సీకే దిన్నెలో 2, చక్రాయపల్లెలో 2, చిన్నమండెంలో 2, కలసపాడులో 2 కమలాపురంలో 2, ఖాజీపేటలో 2, ఎల్‌ఆర్‌పల్లెలో 2, నందలూరులో 2, పెండ్లిమర్రిలో 2, రాయచోటిలో 2, సంబేపల్లెలో 2, సిద్దవటంలో రెండు పాఠశాలలతోపాటు పలు మండలాల్లో పలు పాఠశాలలు మూతపడ్డాయి. కనుమరుగవుతున్న పాఠశాలలు: జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటంతో రేషనలైజేషన్ పేరుతో 2015లో 136 పాఠశాలలు మూతపడ్డాయి. ఇందులో అట్లూరు మండలంలో 7 స్కూళ్లు, బి.మఠం మండలంలో 5, చక్రాయపేటలో 9, చిన్నమండెంలో 6, కడపలో ఒకటి, జమ్మలమడులో 3, కలసపాడులో 3, కొండాపురంలో 3, ఎల్‌ఆర్‌పల్లిలో 5, ముద్దనూరులో 5, మైదుకూరులో 6, పెనగలూరులో 8. పెండ్లిమర్రిలో 5, పులివెందులలో 3, పుల్లంపేటలో 8, రాజంపేటలో 6, రాయచోటి 3, కాశినాయనలో 3, సంబేపల్లెలో 5, సుండుపల్లెలో 8, వల్లూరులో 3 స్కూళ్లతోపాటు పలు మండలాల్లోని పాఠశాలలు మూతపడ్డాయి. రెండు హైస్కూళ్లు సైతం.. జిల్లాలో రెండు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలను కూడా విద్యార్థుల సంఖ్యలేని కారణంగా మూసివేశారు. ఇందులో రాయచోటి మండలంలోని బి. అంబవరం, కమలాపురం మండలంలోని సి. రాజుపాలెం మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలను మూసి వేశారు. 53 ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ప్రాథమిక పాఠశాలలుగా డిమోషన్ ప్రాథమికోన్నత పాఠశాలలు మనుగడ సాగించడానికి ప్రధానం కారణం టీచర్ల కొరతే. 6, 7 తరగతులకు బోధించాల్సిన సబ్జెక్టు టీచర్లను నియమించకుండా ఒకరిద్దరితోనే నెట్టుకురావడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు ఆయా స్కూళ్లకు పిల్లలను పంపేందుకు విముఖత చూపారు. ఫలితంగా జిల్లాలో 53 ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా డిమోషన్ చేశారు. ఇందులో అట్లూరు మండలంలో 3 యూపీ స్కూళ్లు, చాపాడులో 3, చిట్వేల్‌లో 4, కొండాపురంలో 4, పుల్లంపేటలో 3, తొండూరులో 4, బద్వేల్లో 2, గాలివీడులో 2, గోపవరంలో 2, లింగాలలో 2, మైలవరంలో 2, పులివెందులలో 2, సంబేపల్లెలో 2తో పాటు పలు మండలాల్లో ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా డిమోషన్ చేశారు. ఏకోపాధ్యాయుడు ఉన్నపాఠశాలలు 485 జిల్లాలో 1 నుంచి 5వ తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు 485 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రాథమిక విద్య బలోపేతం ఎలాగో పాలకులకు అధికారులకే తెలియాíల్సి ఉంది. ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వ్యక్తిగత కారణాల చేత సెలవును పెడితే మాత్ర ఈ పాఠశాలలకు సెలవులను ప్రకటించాల్సిందే. లేకుంటే పక్క గ్రామంలోని టీచర్లను పిలిపించుకుని పాఠశాలలను నిర్వహించాలి. డీఈఓ పూల్‌లో 256 మంది ఉపాధ్యాయులు జిల్లాలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు రేషనలైజేషన్ పేరుతో మూతపడటంతో ఆయా పాఠశాలల్లో పనిచేసే 256 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం డీఈఓ పూల్‌లో ఉన్నారు. వీరందరు పని ఒక చోట చేస్తే వీరికి జీతం మరోచోట ఇవ్వాల్సిన పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వం పుణ్యమా అని జిల్లాలో సర్కారు చదువుకు తీవ్ర విఘాతం కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. బడులు మూత..విద్యార్థులకు వెత జమ్మలమడుగు: జమ్మలమడుగు పట్టణం కోటవీధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆ పాఠశాల విద్యార్థులను సమీపంలో ఉన్న ఈడిగపేట పాఠశాలలో కలిపి కోటవీధిలో ఉన్న పాఠశాలను మూత వేసేశారు. గంగమ్మదేవాలయం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలను, ఎస్టీలకోసం ఏర్పాటు చేసిన శబరి కాలనీలో ప్రాథమిక పాఠశాలను సైతం విద్యార్థులు లేరంటూ మూసివేశారు. మండల పరిధిలోని సలివెందుల, శేషారెడ్డిపల్లె, ఒంటిమిద్దె ప్రభుత్వ పాఠశాలలను మూత వేశారు. ఈడిగపేట ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్నా మరమ్మత్తులకు, నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. సరైన మౌలిక వసతులు లేకపోవడంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతోనే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడంలేదు. పాఠశాలలో ఏకోపాధ్యాయులు ఉండటంతో ఆయన సెలవు పెడితే ఆరోజు పాఠశాల మూత పడాల్సి వస్తోంది. – ఎం. ఆంజనేయులు, దళిత కాలనీ,జమ్మలమడుగు. పిల్లలు లేరని మూసేశారు పిల్లలు లేరనే నెపంతో ఉన్న స్కూల్‌ను మూతవేశారు. దీంతో మా ఊరి పిల్లలు చదువుకోవడానికి రెండు కిలో మీటర్ల దూరం పొలాల వెంట తిరుగుతూ వెళ్లాలి. లేదంటే ప్రైవేట్ పాఠశాలకు పంపాలి. ప్రైవేట్ పాఠశాలకు పంపాలంటే వేలకు వేలు డబ్బులు చెల్లించాలి. అంత డబ్బులు మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మా పిల్లలకు చదువులు వస్తాయేమోనని ఆశగా ఉన్నాము. – వి. రాజశేఖర్, చిన్నమండెం పేదల బిడ్డలకు చదువు దూరం చేస్తున్నారు పిల్లలకు తక్కువ ఉన్నారని పేరుపెట్టి పేద పిల్లలకు చదువు లేకుండా చేస్తున్నారు. ఇదేమని అడిగితే పిల్లలు తక్కువగా ఉన్నారు. ఇంత తక్కువ మంది పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు ఎలా వస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పిల్లల చదువు కోసం కూడా వేలకు వేలు అప్పులు చేయాలి. అదే ప్రభుత్వ పాఠశాలలు అయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ప్రభుత్వం మారితే కానీ మా పిల్లలకు చదువులు అబ్బే రకం కనిపించడం లేదు. – పి. శివ, కమ్మపల్లె ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నాము మా ఊరిలోని ప్రాథమిక పాఠశాల మూత పడటంతో వేరే గ్రామంలోని పాఠశాలకు వెళ్లాలంటే చాలా దూరం ఉంది. పిల్లలను చదివించుకోవాలనే ఆశతో వేరే గత్యంతరం లేక ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నాము. వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తే మా ఊరి బడి మళ్లీ తెరుచుకొంటుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. – రామచంద్రయ్య, పాలంగొల్లపల్లె పడకేసిన ప్రభుత్వ విద్య రాజంపేట: రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలంలో రెండు, ఒంటిమిట్ట మండలంలో ఐదు పాఠశాలలు, సుండుపల్లెలో రెండు , నందలూరులో ఒకటి, రాజంపేట మండలంలో నాలుగు పాఠశాలలను ఎత్తివేశారు. పాఠశాలల ఎత్తివేసిన ప్రాంతాల్లోని పేద విద్యార్ధులు పొరుగు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లలేక చాలామంది బడి మానేసుకున్నారు. ప్రభుత్వ విద్యకు జగన్ భరోసా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. తాను సీఎం కాగానే నవరత్నాలు పథకాన్ని అమలు చేయడంలో భాగంగా పేదవాడి విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలా చూస్తానని, పేద వర్గాలకు ఉచిత విద్యను మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజన కోసం అదనంగా ప్రతి యేటా ప్రతి విద్యార్ధికి రూ.20వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యకు మంగళం బద్వేలుఅర్బన్ : బద్వేలు మండలంలో 56 ప్రాథమిక పాఠశాలలు, 6 ప్రాథమికోన్నత పాఠశాలలు, మూడు ఉన్నత పాఠశాలలు ఉండగా గత విద్యా సంవత్సరంలో రెండు ప్రాథమిక పాఠశాలలు, ఈ విద్యా సంవత్సరంలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయి. గత ఏడాది తిప్పనపల్లె, నందిపల్లె పాఠశాలలు మూతపడగా, ఈ ఏడాది గుండంరాజుపల్లె, విజయరామాపురం, అయ్యవారిపల్లె, వనంపుల పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలు చదువుకు దూరమవుతున్నారు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకు చూపి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను గత ఏడాది మూసివేశారు. దీంతో పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో పాఠశాల ఉన్నప్పుడు రోజూ బడికి పోయేవాడు. ప్రస్తుతం దూరం కావడంతో బడికి సక్రమంగా వెళ్లడం లేదు. గ్రామంలోని పాఠశాలను తిరిగి తెరిపిస్తే ఉపయోగం ఉంటుంది.– మౌనిక, విజయరామాపురం -
డీఈవోపై వేటు
సస్పెండ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ - టీచర్ల బదిలీల్లో అక్రమాల ఫలితం - వరంగల్‌ను విడిచి వెళ్లకూడ దని ఆంక్షలు - ఇన్చార్జి డీఈవోగా ఆర్జేడీకి బాధ్యతలు - ఇక డిప్యూటీ డీఈవోల వంతు! విద్యారణ్యపురి : టీచర్ల బదిలీల్లో అక్రమాల వ్యవహారంపై సర్కారు స్పందిం చింది. జిల్లా విద్యాశాఖాధికారి వై.చంద్రమోహన్‌ను సస్పెండ్ చేసింది. ప్రజాప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బదిలీల్లో అక్రమాలపై సమగ్ర విచారణ నేపథ్యంలో చంద్రమోహన్ వరంగల్ నగరం విడిచి వెళ్లవద్దని స్పష్టం చేసింది. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్యకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ జరిగింది.. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకోవడంతో.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన నియోజకవర్గంలోని పలుచోట్ల టీచర్ల అక్రమ బదిలీలు జరిగాయని జాబితాతో సహా వచ్చి డీఈవోను నిలదీశారు. విద్యాశాఖ బాధ్యతలను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి పిర్యాదు చేశారు. జిల్లాలోని టీచర్ల బదిలీల అక్రమాలపై ఫిర్యాదుల అంశాన్ని ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బదిలీల్లో అక్రమాలపై ఆరోపణల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు.. అడిషనల్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. సత్యనారాయణరెడ్డి ఈనెల 29న డీఈవో కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు. ఆరోపణలపై సంబంధిత టీచర్ల ఆప్షన్ల ఫారాలు పరిశీలించారు. ప్రధానంగా ఒక్కసారి టీచర్లను బదిలీ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో మాడిఫికేషన్ చేయకూడదు. డీఈవో చంద్రమోహన్ పలువురి టీచర్లకు ఇలా మాడిఫికేషన్ చేసినట్లు వెల్లడైంది. మరోవైపు పలుచోట్ల టీచర్లు తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్టైటిల్పాయింట్లు పొంది బదిలీ చేయించుకున్నారని తేలింది. ఇలా బదిలీల్లో అనేక ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా జిల్లాలో టీచర్ల బదిలీల్లో అనేక రకాలుగా అక్రమాలు చోటుచేసుకోవడం, ముడుపులు తీసుకొనే అవకతకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సత్యనారాయణరెడ్డి విచారణ నివేదికను పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ అందజేశారు. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలు జరిగాయనేది వెల్లడికావడంతో డీఈవో చంద్రమోహన్‌పై ప్రభుత్వం వేటు వేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజాప్రయోజనాల దృష్ట్యా డీఈవో చంద్రమోహన్‌ను సస్పెన్షన్ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని తెలుస్తోంది. కాగా, చంద్రమోహన్ వరంగల్ డీఈవోగా 2014 నవంబర్ 18న బాధ్యతలను స్వీకరించారు. 8 నెలల 14 రోజులు బాధ్యతలు నిర్వర్తించి సస్పెండ్ అయ్యారు. ఆర్జేడీ బాలయ్యకు అదనపు బాధ్యతలు వరంగల్‌లోని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్యకు ఇన్చార్జి జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్చార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లుగా హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ కార్యాలయం నుంచి సమాచారం బాలయ్యకు అందజేశారు. బాలయ్య ఖమ్మం జిల్లా గార్లబయ్యారం ప్రాంతానికి చెందిన వారు. గత రెండేళ్లగా వరంగల్‌లో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా పని చేస్తున్నారు. మూడురోజుల క్రితమే ఖమ్మం డీఈవోగా పని చేస్తున్న రవీందర్‌రెడ్డిని ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేసింది. బాలయ్యకు ఖమ్మం జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించింది. బాలయ్య ఈ నెల 3న ఖమ్మం డీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తాజాగా వరంగల్ జిల్లా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. బాలయ్య రెండు జిల్లాల బాధ్యతలను నిర్వర్తించడం ప్రస్తుత పరిస్థితులో ఇబ్బందికరంగానే ఉండనుంది. వరంగల్‌కు పూర్తిస్థాయి డీఈవోగా ఎవరు వస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రాజేష్, రాజీవ్, లక్ష్మిబాయిలలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక డిప్యూటీ డీఈవోల వంతు! టీచర్ల బదిలీల అక్రమాలల్లో డిప్యూటీ డీఈవోల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు అందుతున్నాయి. డిప్యూటీ డీఈవోలపై పలు ఉపాధ్యాయ సంఘాలు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బదిలీల్లో అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే బాధ్యులైన డిప్యూటీ డీఈవోలపైనా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. ముగ్గురు డిప్యూటీ డీఈవోలపై ఆరోపణలున్నాయి. మరోవైపు కలెక్టర్ వాకాటి కరణ టీచర్ల బదిలీల అక్రమాల వ్యవహారంపై విచారణకు ఏజేసీ తిరుపతిరావు నియమించటంతో ఇక అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరగబోతుంది. విద్యాశాఖాధికారితోపాటు డిప్యూటీ డీఈవోల పాత్ర కూడా ఇందులో వెలుగులోకి రానుందని భావిస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన టీచర్లు, సరిగా స్రూట్నీని చేయని ఇన్చార్జి ఎంఈవోలపాత్రపైనా విచారణ జరిగే అవకాశం ఉంది.