breaking news
dengue treatment
-
కోవిడ్ మూడో వేవ్ ముంగిట.. పులి మీద పుట్ర! జర జాగ్రత్త
కరోనా అన్నది సీవోవీ–2 వైరస్‌తో వచ్చినట్టే డెంగీ కూడా డెంగీ వైరస్ వల్ల వ్యాపించే ఒక రకం వైరల్ జ్వరం. ఏడిస్ ఈజిపై్ట అనే టైగర్ మస్కిటో ఈ వైరల్ జ్వరాన్ని వ్యాప్తి చేస్తుంది. చాలా వైరల్ జ్వరాల్లాగే ఇది తనంతట తానే తగ్గిపోయే జ్వరం. కాకపోతే ప్లేట్లెట్స్ విపరీతంగా తగ్గిపోవడం వల్ల కొందరిలో ఇది ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటివారిలో మినహా మిగతావారిలో ఇది అంత ప్రమాదం కాదు. అయితే డెంగీ కారణంగా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్న వారు, బీపీ పడిపోతున్నవారు, చిగుళ్లలోగానీ లేదా అంతర్గతంగాగాని రక్తస్రావం అవుతున్నవారు (ఇలా జరిగినప్పుడు మలం నల్లగా వస్తుంది), లేదా స్పృహతప్పిపోయినా... వారు హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవాల్సిందే. అందుబాటులో వ్యాక్సిన్ ఉన్నప్పటికీ: డెంగీకి టీకా (వ్యాక్సినేషన్) ఉంది. అయితే ఈ టీకాను గతంలో డెంగీ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మొదటిసారి కంటే రెండోసారి డెంగీ (సెకండరీ డెంగీ ఇన్ఫెక్షన్) రావడం చాలా ప్రమాదకరం కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిబంధనను విధించింది. డెంగీలో జ్వరం వచ్చి తగ్గాక వ్యాధి పూర్తిగా తగ్గిందని అనుకోకూడదు. నిజానికి ప్లేట్లెట్స్ తగ్గడం అన్నది జ్వరం తగ్గాకే మొదలవుతుంది. అందుకే ప్లేట్లెట్స్ తగ్గి, మళ్లీ నార్మల్కు వచ్చాక మాత్రమే డెంగీ తగ్గిందని అనుకోవాలి. డెంగీలో కనిపించే లక్షణాలేమిటి? ప్లేట్ లెట్స్ తక్కువైన కారణాన అంతర్గత అవయవాల్లో ఆగకుండా రక్తస్రావం కారడమనే ప్రమాదకరమైన లక్షణమే కాకుండా కొందరిలో ఒంట్లోని నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్ డీహైడ్రేషన్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఎర్రరక్తకణాల సాంద్రత (హీమోగ్లోబిన్ కాన్సంట్రేషన్) పెరుగుతుంది. హెమటోక్రిట్ పెరుగుతుంది. కొంతమందిలో కడుపులో, ఊపిరితిత్తుల పొరల్లో నీరుచేరుతుంది. దీన్ని క్యాపిల్లరీ లీక్ అంటారు. ఇది మరింత వేగంగా, తీవ్రంగా (అగ్రెసివ్‌గా) చికిత్స అవసరమైన కండిషన్. బీపీ తగ్గడం వల్ల రక్తపోటు పడిపోతుంది. జబ్బు తీవ్రంగా ఉంటే కొందరిలో లివర్, మూత్రపిండాలూ దెబ్బతినవచ్చు. ఆగకుండా రక్తస్రావం కావడం, ఫిట్స్ రావడం సంభవించి మెదడు కూడా దెబ్బతినవచ్చు. కొందరిలో గుండె స్పందనలు (హార్ట్‌బీట్) 60 కంటే తక్కువకు పడిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి బాధితులకు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలి. నిర్ధారణ పరీక్షలు : ప్లేట్లెట్స్ తగ్గిన సందర్భాల్లో ప్రతి 24 గంటలకు ఒకసారి రక్తపరీక్ష (సీబీపీ) చేయాలి. డెంగీ ఎన్ఎస్1 (స్క్రీనింగ్), ఐజీఎమ్, ఐజీజీ పరీక్షలు (నిర్ధారణ కోసం) అవసరం కావచ్చు. ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనేది డెంగీ నిర్ధారణకు పెద్ద పెద్ద మెడికల్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉండే అత్యాధునికమైన నిర్ధారణ పరీక్ష. అయితే ఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో రిపోర్టులు వచ్చేసరికి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున, వాటికోసం వేచిచూడకుండా లక్షణాల ఆధారంగానే చికిత్స కొనసాగించాలి. చికిత్స: డెంగీ అన్నది వైరస్‌తో వచ్చేది కాబట్టి దానికంటూ మందులు లేవు. లక్షణాల ఆధారంగా చికిత్స అందించాలి. అంటే డీ హైడ్రేషన్‌కు నోటి ద్వారా ఓఆర్ఎస్ వంటివి ఇస్తూ ఉండాలి. పరిస్థితి మరీ విషమిస్తే రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ అందించాలి. రక్తస్రావం జరుగుతుంటే అవసరాన్ని బట్టి రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) ఇవ్వాలి. ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేలు – 15 వేలకు పడిపోతే ప్లేట్లెట్స్ ఇవ్వడం తప్పనిసరి. డెంగీ జ్వరానికి సాధారణ జ్వరం వచ్చిన వారికిలా ఆస్పిరిన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబరుస్తుంది కాబట్టి రక్తస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. నివారణ ఎంతో మేలు... ఎందుకంటే? అన్ని వ్యాధుల లాగే డెంగీకి కూడా చికిత్స కంటే నివారణ మేలు. డెంగీని కలిగించే టైగర్ దోమ సాధారణంగా పట్టపగలే కుడుతుంటుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఇంట్లోని మూలల్లోని చీకటి / చల్లని ప్రదేశాల్లో ఆవాసం ఏర్పరచుకుంటుంది. అందుకే పగలు అవి కుట్టకుండా ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. నీళ్లు ఎక్కడా నిల్వ కాకుండా చూసుకోవాలి. ఇల్లంతా గాలి వెలుతురు వచ్చేలా జాగ్రత్తపడాలి. - డాక్టర్ కె. శివ రాజు, సీనియర్ ఫిజీషియన్ -
ఎంత లక్కీ గురూ నువ్వు!
ఢిల్లీ దగ్గరి గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇటీవల ఓ ఏడేళ్ల అమ్మాయికి డెంగ్యూ చికిత్సకు డాక్టర్లు 16 లక్షల ఫీజు వసూలు చేసిన ఘటనను దేశ ప్రజలు మర్చిపోక ముందే విజయ్ శంకర్ అనే యువకుడు.. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోకుండా ‘హా ’ మని తుమ్మాడని అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఇంకో స్టార్ హాస్పిటల్ అతడికి 2 లక్షల రూపాయల ఫీజు వేసింది! ఆ బిల్లు చూసి గుండె గుభేల్మన్న విజయ్ శంకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ చాయ్‌వాలా చెప్పడంతో ఈ విషయం బయటికి పొక్కింది. విజయ్ కుప్పకూలిన వెంటనే అదే హాస్పిటల్ డాక్టర్లు అతడిని ఐసీయూలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ అప్పుడే స్పృహలోకి వచ్చిన విజయ్ అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. ఈ సంగతి మాత్రం స్వయంగా అతడే చెప్పుకున్నాడు. ‘ఒకవేళ వాళ్లు నన్ను తీసుకెళ్లి ఉంటే, గ్లూకోజ్ ఎక్కించి, ఒక్కో బాటిల్‌కి 5 లక్షలు బిల్లు వేసి ఉండేవారని’ విజయ్ ఇప్పుడు తన సమయస్ఫూర్తికి మురిసిపోతున్నాడట. సామాజిక పరిణామాల మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తుండే ఓ వెబ్సైటు చేసిన పరిహాసం ఇది. -
డెంగీతో బాలిక మృతి
మహానంది(కర్నూలు): డెంగీతో చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం తమ్మలపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన తేజస్విని(7) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందింది.