breaking news
defectioned MLAs
-
ఆ ఎమ్మెల్యేలకు ఇంటి బెంగ!
సాక్షి, హైదరాబాద్ : గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి తర్వాత అధికార టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి. అటు పార్టీలో, ఇటు నియోజకవర్గంలో, మరోవైపు అభివృద్ధి పనుల విషయంలోనూ తమకు తగిన ప్రాధా న్యం లభించడం లేదన్న ఆందోళన ఆ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. దీనిపై కొందరు బాహాటంగా అసంతృప్తిని వ్యక్తంచేస్తుండగా.. మరికొందరు తమలో తాము మధనపడుతున్నట్టు ఆయా నేతల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు చేసిన వ్యాఖ్యలే ‘వలస’ ఎమ్మెల్యేల అసంతృప్తికి నిదర్శనమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీఆర్ఎస్లో అసౌకర్యంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నియోజకవర్గస్థాయి నేతలు తమ భవిష్యత్ దృష్ట్యా మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నారని తెలిసింది. వీరిలో కొందరు టీపీసీసీ ముఖ్యులకు టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై స్పష్టమైన హామీ లభిస్తే పాత గూటికి వచ్చేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసంతృప్తిగా ఎవరెవరు? గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. కాంగ్రెస్ నుంచి వచ్చినందునే తమను చిన్నచూపు చూస్తున్నారంటూ అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించినా.. మిగిలిన ఎమ్మెల్యేలు మౌనంగా నెట్టుకొస్తున్నారు. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ ఒకరు. కాంగ్రెస్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈయన.. ప్రస్తుతం టీఆర్ఎస్లో తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారని చర్చ జరుగుతోంది. ఆయన కుమార్తె, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత రాజకీయ భవితవ్యంపై అస్పష్టత కొనసాగుతుండటం కూడా అసంతృప్తికి మరో కారణంగా చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు ఎక్కువే ఉన్నా కవిత రాజకీయ భవిష్యత్తు అస్పష్టంగానే ఉంది. మహబూబాబాద్ టికెట్ ఇస్తారా, డీఎస్ రెడ్యానాయక్‌ను మహబూబాబాద్ ఎంపీగా బరిలో దించి కవితను డోర్నకల్ పంపిస్తారా అన్న విషయాలపై పార్టీ నుంచి స్పష్టత రావడం లేదు. ఈ కారణాలతో రెడ్యానాయక్ ఆందోళనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో గిరిజన ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఇల్లెందు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లడంతో స్థానిక అధికారులను సమన్వయం చేసుకోవడం ఆయనకు కత్తిమీద సాములా మారింది. నియోజకవర్గంలో ఏకైక కోయ నాయకుడిని తానే అయినా చివరి క్షణంలో ఎవరినైనా తీసుకొస్తారో అన్న సందేహం ఆయన్ను వెంటాడుతోంది. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌ను తప్పిస్తే ఆ స్థానంలో తనను పంపి రెడ్యానాయక్ కుమార్తె కవితను ఇల్లెందుకు తెస్తారన్న ప్రచారం కనకయ్యకు ఇబ్బందికరంగా మారింది. ఆదిలాబాద్‌లో ఏంటి పరిస్థితి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన విఠల్‌రెడ్డి కూడా ఇదే కోవలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధినేతను నేరుగా కలిసే పరిస్థితి లేకపోవడం, రాజకీయ భవిష్యత్‌పై పూర్తిస్థాయి భరోసా లేకపోవడం వంటి కారణాలతో ఆయన ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. ముథోల్‌లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఎస్.వేణుగోపాలాచారికి పార్టీలో, ప్రభుత్వంలో ఇస్తున్న ప్రాధాన్యం విఠల్‌రెడ్డికి ఇవ్వకపోవడం నియోజకవర్గంలో ఇబ్బందికరంగా ఉంది. వచ్చే ఎన్నికలలో బ్రాహ్మణ కోటాలో ముథోల్ స్థానాన్ని వేణుగోపాలాచారికే కేటాయిస్తారన్న ఊహాగానాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రులతోనూ నెలకొన్న అంతరం వంటి కారణాలు విఠల్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. యాదయ్యకు ‘చేవెళ్ల’దక్కేనా? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాలె యాదయ్య టీఆర్ఎస్లో తన భవితవ్యం ఏంటో నిర్ణయించుకోలేకపోతున్నారు. చేవెళ్ల నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన కె.ఎస్.రత్నంకు మళ్లీ అవకాశం ఇస్తారన్న ప్రచారంతో యాదయ్య వికారాబాద్ వైపు దృష్టి సారించారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవరావు ఉండడం, వచ్చే ఎన్నికల్లో అవకాశంపై అస్పష్టత ఉండడం యాదయ్యను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకుతోడు ఎమ్మెల్సీ టికెట్లు రెన్యువల్ చేయించుకున్న పాత కాంగ్రెస్ నేతలు కొందరు సైతం టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నారని, కాంగ్రెస్‌లో ఉన్నంత స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ‘‘మా పార్టీ నుంచి వెళ్లిన వాళ్లు అసంతృప్తిగా ఉన్నారని మాకు సమాచారం ఉంది. వారు నేరుగా మాతో మాట్లాడుతున్నారు. సందేశాలు పంపుతున్నారు. మా దగ్గర అధికారం లేకపోయినా గౌరవం ఉండేది. పరస్పర స్నేహం ఉండేది. అక్కడకు వెళ్లాక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కనీసం ఏదైనా పనిచేయించుకుందామన్నా వీల్లేని పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే వారిని పలకరించే దిక్కేలేదు. అందుకే మళ్లీ మా వైపు చూస్తున్నారు’’అని కాంగ్రెస్‌లోని కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యులు సైతం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లి రాజ్యసభ స్థానం పొందిన వారిలో డి.శ్రీనివాస్ క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. ఆయన కుమారుడు అరవింద్ బీజేపీలో చేరి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కూతురు కవితతో పోటీ పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కారణంతో టీఆర్ఎస్ పెద్దలు డీఎస్‌కు గతంలో ఇచ్చిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్ మళ్లీ కాంగ్రెస్ గూటికి వస్తారన్న చర్చ జరుగుతోంది. ‘గుత్తా’కే చుక్కలు కాంగ్రెస్‌లో కీలక నేతగా గుర్తింపు పొందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరాక రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్లో చేరిన సమయంలో ఆయనకు మంత్రి పదవి హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. చాలా నెలలు వేచి చూసినా ఫలితం దక్కలేదు. టీఆర్ఎస్లోకి వెళ్లి తాము తప్పు చేశామని గుత్తా అనుచరులు కొందరు బాహటంగానే వ్యాఖ్యానించారు. నల్లగొండ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు కొందరు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే యత్నాలను తీవ్రం చేశారు. గుత్తా తన అసంతృప్తిని నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే... రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి విషయంలో నిర్ణయం జరిగిందన్న ప్రచారం ఉంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ మార్పులకు కొంత విరామం పడింది. -
ఫిరాయింపుల పిటిషన్‌పై వచ్చేనెలలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్‌లో విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యేలు ఫిరాయించగా స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు దాఖలు చేశామని, వాటిని పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ గతంలో సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఆర్.కె.అగ్రవాల్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం.. దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి సిఫారసు చేసింది. ఈ సందర్భంగా ‘‘అనర్హత పిటిషన్లు ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉండడాన్ని ఎలా చూడాలి? స్వయంగా స్పీకర్ ఫిరాయింపులకు పాల్పడ్డ ఉదంతాలు చూశాం. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా కళ్లు మూసుకొని కూర్చోలేం. స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు తగిన కాలపరిమితి ఉంటే పిటిషన్లు పరిష్కారమవుతాయి’’ అంటూ వ్యాఖ్యలు చేసింది. సాధ్యమైనంత త్వరగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయ మూర్తికి నివేదిస్తూ గతేడాది నవంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసు మళ్లీ విచారణకు రాలేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరపున న్యాయవాది జంద్యాల రవిశంకర్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో అక్టోబర్‌లో రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారిస్తుందని బెంచ్ పేర్కొంది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పయ్యావుల ఫైర్
వాళ్లు పొద్దు తిరుగుడు పువ్వులు లాంటివాళ్లు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే చేరుతారు కళ్యాణదుర్గం (అనంతపురం): అధికారం కోసం కొందరు పొద్దుతిరుగుడు పువ్వుల్లాంటి రాజకీయ నాయకులు వస్తుంటారని, వారి పట్ల పార్టీ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సూచించారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరే వారున్నారని పరోక్షంగా టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటి నాయకులతో టీడీపీకి ఇబ్బందులు రావొచ్చని హెచ్చరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డులో సోమవారం నిర్వహించిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీ బీజేపీ కన్నా టీడీపీనే కేంద్రాన్ని శాసించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ... ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని, లేనిపక్షంలో కేంద్రంలోని బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా.. మినీ మహానాడు నుంచి మధ్యలోనే నిష్ర్కమించారు. దీంతో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, కందికుంట వెంకట ప్రసాద్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు.