breaking news
Debts canceled
-
బీసీలపై టీడీపీ కక్షసాధింపు
సాక్షి, కర్నూలు : జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గ ప్రజలపై అధికార తెలుగుదేశం పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న వారందరికీ రుణాలు రద్దయ్యాయి. వైఎస్ జగన్‌ను కలిసినందుకే తనకు మంజూరైన రుణాన్ని రద్దు చేశారని వెనుకబడిన కులానికి చెందిన లబ్ధిదారుడు అరవప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రజాసంకల్పయాత్రలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. సాయంత్రానికి తనకు మంజూరైన రుణం రద్దు చేశారని తెలిపారు. తనకు మంజూరైన రుణాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. -
రాష్ట్ర విభజన పుణ్యమా అని....
రాష్ట్ర విభజన నేపధ్యంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు లాభపడ్డాయి. విభజన పుణ్యమా అని కొన్ని సంస్థల బకాయిలు రద్దయ్యాయి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన రుణ బకాయిలను, కొన్ని సంస్థలు చెల్లించవలసిన పన్ను బకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది. రెండు రాష్ట్రాలకు ఈ రుణాల పంపిణీ సమస్యగా మారనుంది. ఈ బకాయిల పంపిణీకంటే వాటిని రద్దు చేసి, ఖాతాలను పూర్తిగా మూసివేయడం మంచిదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. చాలా ఏళ్ల క్రితం పలు ప్రభుత్వ, విదేశీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఆ బకాయిలు వసూలు కావడంలేదు. దాంతో తిరిగి చెల్లించే అవకాశం లేని చిన్న చిన్న రుణాలను రద్దు చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసికి బాగా ఊరట లభించింది. ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేశారు. ఆర్టీసి చెల్లించవలసిన బకాయిలను గ్రాంట్‌గా మార్చేశారు. ఆర్టీసీ బకాయి పడిన వాహన పన్ను 1116 కోట్ల రూపాయలను రద్దు చేశారు. ఎన్నో ఏళ్ల క్రితం రుణాలు తీసుకున్నవాటిలో కొన్ని సంస్థలు ఇప్పుడు అస్తిత్వంలో లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వాటికి మంజూరు చేసిన రుణాల వివరాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు బకాయిలను చెల్లించే స్థితిలో లేవు. ఈ పరిస్థితులలో ఈ రుణాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం కష్టం. అందువల్ల పెద్దగా ఫలితం కూడా ఉండదు. వసూలు కాని బకాయిలను లెక్కలలో చూపడం వృధా అని ఆర్థిక శాఖ భావించింది. అందువల్ల పలు రుణాలను రద్దు చేస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి రుణాలను రద్దు చేసిన సంస్థలలో దేశంలోనే కాకుండా విదేశాలలోని సంస్థలు కూడా ఉండటం విశేషం. పాకిస్థాన్, శ్రీలంక, బర్మాలలోని కొన్ని సంస్థల రుణాలను రద్దు చేశారు. చట్టపరంగా ఇబ్బందులు లేని కొన్ని రుణాలను రద్దు చేశారు. మరి కొన్ని రుణాలను గ్రాంట్లుగా మార్చివేశారు. ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఐఐసీ, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్, ఏపీఎస్‌సి ఫైనాన్స్ కార్పొరేషన్లకు మంజూరు చేసిన రుణాలను ఆస్తుల కల్పన వ్యయం కిందికి మార్చేశారు. రాష్ట్ర విభజన కారణంగా చాలా సంస్థలు లాభపడ్డాయి. చాలా సంస్థల లెక్కలు పెండింగ్‌లో లేకుండా తేలిపోయాయి. ఏ మాత్రం ప్రయత్నం చేయకుండానే ఈ రకంగా ఆయా సంస్థలకు పరిష్కార మార్గం లభించింది.