breaking news
The dairy industry
-
పాడితో ఆర్థిక స్వావలంబన సాధించాలి
బాన్సువాడరూరల్ : అతివృష్టి, అనావృష్టిలతో సాగు భారమవుతున్న ప్రస్తుత తరుణంలో మహిళలు, రైతు కుటుంబాలు పాడిపరిశ్రమ వైపు దృష్టి సారించి ఆర్థిక స్వావలంబన సాధించాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మండలంలోని పోచారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి స్త్రీనిధి రుణంతో డ్వాక్రా మహిళలకు గేదెలు కొనుగోలు చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సాగుఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులు నాబార్డు, ఐకేపీలు సంయుక్తంగా అందిస్తున్న రుణాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకుని పాడితో అధిక లాభాలు గడించాలన్నారు. ఒక గేదెను పెంచడం ద్వారా అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ. 8వేల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. తొలివిడతగా గ్రామంలోని డ్వాక్రా మహిళలకు ఒక గేదె ఇప్పిస్తున్నామని, రుణాల కిస్తులను ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లించినట్లయితే మరో గేదె ఇప్పించడం జరుగుతుందన్నారు. రూ. 40 వేల గేదెకు రూ. 10వేలు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. గతంలో ఉన్న ఇతర రాష్ట్రాల గేదెలు కొనుగోలు చేయాలనే నిబంధన తొలగించామన్నారు. పోచారం గ్రామంలో కార్యక్రమం విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అలాగే గొర్లపెంపకందారులకు రూ. లక్ష రుణంతో 20 గొర్రెలు ఒక పొటేలు అందజేస్తున్నామన్నారు. దీంట్లో రూ. 20 వేలు లబ్ధిదారు, రూ. 20 వేలు సబ్సిడీ, రూ. 60 వేలు ఎన్సీడీసీ ద్వారా రుణం ఇప్పిస్తామన్నారు. రూ. 50 కోట్లతో ఇప్పటికే మహబూబ్ నగర్, వరంగల్ తదితర జిల్లాల్లో ఈకార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. చేపల పెంపకం దారులకు సబ్సిడీపై చేపవిత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వ స్థలం ఉంటే ప్రతి మండల కేంద్రంలో రూ. 15 లక్షలతో చేపల విక్రయకేంద్రాలు నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీఏ కిరణ్‌కుమార్, సర్పంచ్ బైరి అంజవ్వ, నాయకులు ఎర్వాలకృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాస్, జంగం గంగాధర్, దుద్దాల అంజిరెడ్డి, సాయిరెడ్డి, విజయ్‌గౌడ్, లతీఫ్, నరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకో పాల శీతలీకరణ కేంద్రం
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం ఒక్కో కేంద్రంలో రెండు లక్షల నుంచి మూడు లక్షల లీటర్ల సేకరణ హైదరాబాద్: తెలంగాణలో పాడిపరిశ్రమ అభివృద్ధికి, ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాల సేకరణ, పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ఒక పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఒక్కోదాంట్లో రెండు లక్షల నుంచి మూడు లక్షల లీటర్ల పాలు సేకరించి, శీతలీకరణ చేయడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాల వ్యాపారానికి విపరీతమైన అవకాశాలు ఉన్నందున రైతులకు దీని నుంచి అదనపు ఆదాయం సమకూర్చే విధంగా కార్యక్రమాలు రూపొందించనుంది. ఒక్క హైదరాబాద్‌లో ప్రతీరోజు 20 లక్షల లీటర్లపాలు విక్రయిస్తుంటే.. అందులో ప్రభుత్వ పాల డెయిరీ నుంచి కేవలం నాలుగు లక్షల లీటర్ల పాలు మాత్రమే సేకరిస్తున్నారని, ఇందులోనూ లక్ష లీటర్లు కర్ణాటక నుంచి వస్తుండగా, మూడు లక్షల లీటర్లు తెలంగాణ నుంచి వస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. ఇక్కడ పాల ఉత్పత్తికి అవకాశాలు ఉన్నందున రైతులను, మహిళా సంఘాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రస్తుతం పాల శీతలీకరణ కేంద్రాలు లేక పాల సేకరణ కూడా సరిగా సాగడంలేదన్నారు. అలాగే తెలంగాణలో మత్స్య సంపదను పెంచడానికి కోల్‌కతాకు చెందిన సంస్థతో సంప్రదించినట్లు ఆయన వెల్లడించారు.