breaking news
C.V. Raman
-
National Science Day: ప్రజల చేతిలో ఆయుధం సైన్స్
మన దేశంలో ‘నేషనల్ సైన్స్ డే’ (ఎన్ఎస్డీ) 1987 ఫిబ్రవరి 28 నుంచి ప్రతి ఏడాదీ నిర్వహించుకుంటున్నాం. అదే రోజు మన భారత శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ తన పరిశోధనల్ని ‘రామన్ ఎఫెక్ట్’ పేరుతో 28 ఫిబ్రవరి 1928న ప్రతిపాదించారు. దీనికే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఇది భారత్‌కే కాదు మొత్తం ఆసియా ఖండానికే దక్కిన మొదటి నోబెల్ బహుమతి. సైన్స్ డే సందర్భంగా నిర్వహించు కోవాల్సిన కార్యక్రమాలు: 1. నిత్య జీవితంలో సైన్సు ప్రాముఖ్యతను గ్రహించే విధంగా కార్యక్రమాలు రూపొందించు కోవాలి. 2. మానవాభ్యు దయానికి ఉపయోగపడే వైజ్ఞా నిక పథకాలకు రూపకల్పన చేసుకోవాలి. 3. సమాజంలో వైజ్ఞానిక అవగాహన పెంచడా నికి కృషి చేసిన, చేస్తున్నవారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. వాటికి ప్రాధాన్యత కల్పించాలి.సైన్స్ డే పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వవిద్యాల యాలకు మాత్రమే పరిమితం కాదు. అన్ని పౌర సంఘాల్లో దీన్ని ఘనంగా జరుపు కోవాలి. దేశ పౌరుల్లో ముఖ్యంగా బాల బాలికల్లో సైన్సుపట్ల ఆసక్తిని పెంచడానికి దీన్ని ఉపయోగించాలి. సైన్స్ డే సందర్భంగా ఉప న్యాసాలు, ఊరేగింపులు, వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ సంబంధిత పోటీలు నిర్వహించి జనంలో అవగాహనపెంచాలి.మన విద్యా విధానంలో ఉన్న ప్రధాన లోపమేమంటే, క్లాస్ రూంలో సైన్స్ సూత్రాలు మాత్రమే చెబుతారు. అంతేగానీ, ఒక శాస్త్రవేత్త ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ పరిశోధ నలు చేయగలిగాడన్నది మాత్రం సంక్షిప్తంగా నైనా చెప్పరు. ఈ ధోరణి మారాలి.ప్రపంచమంతా వైజ్ఞానికంగా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో కొందరు మన దేశ పౌరులు మన ప్రభుత్వ పెద్దలు మూఢ నమ్మకాలకు పెద్ద పీట వేస్తున్నారు. దేశాన్ని మూడు వేల ఏళ్ళ నాటి అనాగరిక సమాజంలోకి లాక్కుపోతున్నారు. ఆ ప్రమాదంలోంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశ పౌరులంతా వివేకం ప్రదర్శించాలి. సైన్సును ఒక వెన్నెముకగా చేసుకుని ప్రగతి పథంలోకి నడవాలి.మూఢత్వాన్ని వదిలి, చేతనత్వం లోకి రావాలంటే – మనం మన రాజ్యాంగంలో రాసుకున్న 51ఏ (హెచ్) స్ఫూర్తిని నిలుపు కోవాలంటే, ప్రతి పౌరుడూ చిత్తశుద్ధితో పని చేయక తప్పదు. ఇప్పటి దేశ కాల పరిస్థితులను చూస్తుంటే, ఇక ఆ దిశలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి ఆచరించాల్సిన అవ సరం వచ్చిందని అనిపిస్తోంది.ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్న ఆయుధం – ప్రశ్న! ప్రశ్నలోంచి ఎదు గుతూ వచ్చిందే సైన్సు!! ఈ సైన్సు అంత ముఖ్యమైందిగా ఎందుకయ్యిందీ? అంటే చీకటిలోంచి వెలుగులోకి వెళ్ళాలంటే సైన్సే ఆసరా కాబట్టి. అనాగరికతనూ, మూర్ఖత్వాన్నీ వదిలి విశాల విశ్వంలో అత్యాధునిక మాన వులుగా నిల బడాలంటే సైన్సు తప్ప మరో మార్గం లేదు. అన్యాయాల్ని, అబద్ధాల్ని, దుర్మా ర్గాల్ని ఛేదించాలంటే తీసుకోక తప్పదు సైన్సు సహాయం. అలాగే ఇప్పుడు ప్రభుత్వాల మూఢత్వం బద్దలు కొట్టాలన్నా, మనకున్నది ఒక్కటే పదునైన ఆయుధం – అదే సైన్స్!– డా.దేవరాజు మహారాజు, సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ -
నోబెల్ ఇండియా: సర్ సి.వి.రామన్ విజ్ఞాన కాంతిపుంజం
పురస్కారం: నోబెల్ పురస్కారం అందుకున్న భారతీయులలో రెండవ వారు సర్ చంద్రశేఖర వేంకట రామన్. సి.వి.రామన్ భౌతిక శాస్త్రంలో ‘కాంతి విక్షేపణము - రామన్ ఫలితం’ అనే అంశంపై విస్తృతంగా పరిశోధించారు. ఆ పరిశోధనలకు గాను 1930వ సంవత్సరపు నోబెల్ బహుమతిని అందుకున్నారు. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో కాంతి (లైట్), శబ్దం (సౌండ్) విభాగాలలో వేంకట రామన్ ఎన్నో విజయవంతమైన ఆవిష్కరణలు చేశారు. ఆయా రంగాలలో 400కు పైగా పరిశోధన పత్రాలు, ఎనిమిది గ్రంథాలను ప్రచురించారు. రామన్ బాల్యం: చంద్రశేఖర వేంకట రామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనైకోవిల్ గ్రామంలో 1888వ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన జన్మించారు. రామన్ తండ్రి ఆర్. చంద్రశేఖర అయ్యర్ కళాశాల అధ్యాపకులు. గణిత, భౌతిక శాస్త్రాలు బోధించేవారు. తల్లి పార్వతి అమ్మాళ్ గృహిణి. ఈ దంపతుల రెండవ సంతానమే వేంకట రామన్. ఈయన చిన్నతనంలో చంద్రశేఖర అయ్యర్‌కు విశాఖపట్నం ఎ.వి.ఎన్. కళాశాలలో భౌతిక శాస్త్రాధ్యాపకునిగా ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ కుటుంబం విశాఖపట్నానికి మారింది. వేంకట రామన్... విశాఖలోని సెయింట్ ఎలాషియస్ ఆంగ్లో ఇండియన్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఆయన 12 సంవత్సరాలకే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన ప్రతిభాశాలి. ఆ రోజుల్లో ఇలాంటి మేధావులకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగా ఉండేది. సర్కారు ఖర్చుతో ఉన్నత విద్యాభ్యాసానికి ఇంగ్లండు పంపేవారు. సి.వి.రామన్‌కు ఆ అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్యకారణాల వల్ల వైద్యుల ఆమోదం లభించలేదు. ఆ కారణంగా ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లలేకపోయారు. కాలేజీ చదువులకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. రామన్ 1904లో బంగారు పతకంతో బీఏ పట్టా అందుకున్నారు. 1907లో భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా సాధించారు. కాంతి విక్షేపణ, వివర్తనలపై రాసిన థీసిస్ 1906లో ప్రచురితమైంది. రామన్ ఉద్యోగ జీవితం: రామన్‌కు అసిస్టెంట్ అకౌంటెంట్‌గా కలకత్తాలో పోస్టింగ్ వచ్చింది. సర్కారు ఉద్యోగం చేస్తూనే రామన్ ఐఏసీఎస్ (ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్)లో చేరి భౌతిక శాస్త్రంలో ప్రయోగాలు చేశారు. ఏడాది తిరిగేసరికి (1917లో) కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌గా చేరారు. రామన్ 1921వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన సముద్ర యానం చేశారు. ఆ ప్రయాణంలో ఓడ పైనుండి సముద్రాన్ని వీక్షించిన రామన్ మదిలో ఎన్నో సందేహాలు మొలకెత్తాయి. సముద్ర జలాలు ఆకుపచ్చ - నీలి రంగుతో ఎందుకు కనిపిస్తాయి? అనే సందేహం ప్రధానమైనది. కలకత్తాకు చేరగానే కాంతి వివర్తనం, విక్షేపాలపై ప్రయోగాలు ప్రారంభించారు. ఈ ప్రయోగాల ఫలితంగా రామన్ విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలోనే అత్యంత ప్రభావం కలిగిన ‘రామన్ ఫలితాన్ని’ కనుగొన్నారు. తన బలం... తెలిసిన క్షణం! రామన్‌కు తన పరిశోధనల విలువ తెలిసేలా, రామన్ ఫలితం గురించి ప్రపంచంలోని భౌతిక శాస్త్రజ్ఞులకు తెలిసేలా చేసిన సంఘటన క్రాంప్టన్కు నోబెల్ బహుమతి రావడమే. 1927లో కాంప్టన్‌కు నోబెల్ బహుమతి తెచ్చిన ప్రయోగంలో ‘ఎక్స్’ కిరణాలను పారదర్శకమైన యానకం గుండా పంపితే, కొన్ని కిరణాల తరంగ దైర్ఘ్యాలలో మార్పులు కలుగుతాయనీ, దీనినే కాంప్టన్ ఫలితం అంటారని కాంప్టన్ ప్రచురించాడు. వెంటనే రామన్ ఏకవర్ణ కాంతి తరంగాలతో (మెర్క్యూరీ ల్యాంప్ ఉపయోగించి) రామన్ ఫలితాన్ని, తరంగ దైర్ఘ్యంలో తగ్గుదల ఉన్న కాంతి కిరణాలను (వీటినే రామన్ లైన్స్ అంటారు) బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన శాస్త్రవేత్తల సెమినార్లో విజయవంతంగా ప్రయోగం చేసి ప్రదర్శించారు. ఫలితంగా డాక్టర్ చంద్రశేఖర వేంకట రామన్‌కు 1930వ సంవత్సరపు నోబెల్ బహుమతి ప్రకటించారు. నోబెల్ పురస్కారం లభించిన తర్వాత కూడా రామన్ శబ్ద తరంగాలపై పరిశోధనలను కొనసాగించారు. భారతీయ సంగీత వాద్యాలైన వయొలిన్, మృదంగం మొదలైన వాద్యాలలో శబ్ద తరంగాలు ఏ విధంగా శృతి పేయమైన శబ్దాలను ఉత్పాదిస్తాయో కనుగొని ఆ పరిశోధనలను ప్రచురించారు. భౌతిక, విజ్ఞాన శాస్త్రంలో రామన్ ప్రతిభకు తార్కాణంగా ప్రపంచంలోని ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు లభించాయి. భారత ప్రభుత్వం సి.వి.రామన్ ప్రతిభ, భారతదేశానికి పేరు తెచ్చిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఆయనను 1954లో ‘భారతరత్న’ బిరుదుతో సత్కరించింది. వైవాహిక జీవితం: రామన్ 1906లో అమ్మాళ్‌ను వివాహమాడారు. వీరికి చంద్రశేఖర్, రాధాకృష్ణన్ అనే ఇద్దరు కుమారులు. సి.వి.రామన్ తన జీవితమంతా భౌతిక శాస్త్ర పరిశోధనలకే అంకితమై, అంతిమ క్షణాల వరకూ భౌతికశాస్త్ర విషయాలతోనే గడిపారు. రామన్ ఎఫెక్ట్ అనువర్తనాలతో వెయ్యికి పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. రామన్ వ్యక్తిత్వం! రామన్‌కు ‘భారతరత్న’ పురస్కారం లభించినప్పుడు, ఆ పురస్కారం అందుకోవటానికి ఢిల్లీకి రమ్మని స్వయంగా అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ఆహ్వానం వచ్చింది. అందుకు రామన్ రాసిన జవాబే ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం. ‘‘మీరు నాపై చూపిన ఆదర సత్కారాలకు కృతజ్ఞుణ్ని. ప్రస్తుతం నేను నా విద్యార్థి ఒకరి పీహెచ్డీ పరిశోధన వ్యాసం పరిశీలనలో తుది దశలో ఉన్నాను. నా విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా ‘థీసిస్’ పని వాయిదా వేయలేను, క్షంతవ్యుడను’. ఈ ఉత్తరం సర్ రామన్‌కు తన కర్తవ్య ధర్మం పట్ల గల శ్రద్ధను తెలియపరుస్తుంది. 1943లో భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఛి)లో రిటైర్ అయిన వెంటనే బెంగళూరులో రామన్ పరిశోధనా సంస్థను స్థాపించారు. ఆ సంస్థలోనే 1970, నవంబర్ 21వ తేదీన అంతిమ శ్వాస తీసుకున్నారు. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు రామన్ ఎఫెక్ట్ మెర్క్యూరీ ల్యాంప్ నుండి ఏకవర్ణ కాంతి తరంగాలను ఒక పారదర్శక యానకం గుండా ప్రసరింపజేస్తే, యానక ధర్మాలపై ఆధారపడి ఆ కాంతిలో కొంత భాగం వివర్తనం చెంది, తక్కువ తరంగ ధైర్ఘ్యం గల కాంతిగా బహిర్గతమౌతుంది. సముద్ర జలంపై ఇదే ప్రక్రియతో నీలి రంగు కాంతి బహిర్గతమవుతుంది. దీనినే ‘రామన్ ఫలితం’ (రామన్ ఎఫెక్ట్) అంటారు. రామన్ ఫలితాన్ని ఉపయోగించి, యానక పదార్థం యొక్క నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. ఈ విధంగా ఎన్నో పదార్థాల స్ఫటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడింది. రామన్ ఫలితాన్ని మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 28, 1928వ తేదీన సి.వి.రామన్, కె.ఎస్.క్రిష్ణన్‌ల రీసెర్చి ఫలితంగా ప్రచురించారు. రామన్‌కు లభించిన గౌరవ పురస్కారాలు 1924 - రాయల్ సొసైటీ ఫెలోషిప్ ఊఖ 1929 - బ్రిటిష్ మహారాణి నుండి నైట్‌హుడ్, సర్ 1930 - నోబెల్ పురస్కారం 1941 - ఫ్రాంక్లిన్ పతకం 1954 - భారతరత్న 1957 - లెనిన్ శాంతి బహుమతి 1917 - ఐఅఇ గౌరవ కార్యదర్శి 1933 - 48 భారతీయ విజ్ఞాన సంస్థ ఐఐఛి బెంగళూరులో ప్రొఫెసర్, 1948లో ఐఐఛిడెరైక్టర్ రామన్ రాసిన గ్రంథాలలో కొన్ని 1. కాంతి వివర్తనము (scattering of light) 2. అకాస్టిక్ (Acoustic) నాద తరంగ శాస్త్రం 3. ఆప్టికా (Optica) దృగ్గోచర కాంతి శాస్త్రం 4. ఖనిజములు, వజ్రముల కాంతి ధర్మాలు 5. స్ఫటికముల భౌతిక విజ్ఞానం 6. పుష్పాల రంగుల - అవగాహన 7. వీణ, వయొలిన్, తబల, మృదంగం మొదలైన సంగీత వాద్యాలలో శబ్ద తరంగాలు. పత్రికలు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ స్థాపన, సంపాదకత్వం ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్స్ అండ్ జర్నల్ ఆఫ్ ద ఇండియన్ అకాడెమీ ఆఫ్ సెన్సైస్ కరెంట్ సైన్స్ జర్నల్ ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఫలితం ఆవిష్కరణకు గుర్తుగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం (నేషనల్ సైన్స్ డే) జరుపుకుంటారు. తన లక్ష్యాన్ని, ధ్యేయాన్ని గుర్తించి వాటి సాధన కోసం శ్రద్ధగా పనిచేసిన ప్రతిభాశాలి సర్ చంద్రశేఖర వేంకట రామన్. -
పరిశోధనలపై పెట్టుబడులు పెరగాలి: ప్రణబ్ ముఖర్జీ
పాట్నా: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్ ప్రపంచ అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతి అందుకొని 80 ఏళ్లకుపైగా గడిచినా దేశంలో మరెవరూ ఆ పతకాన్ని అందుకోలేకపోవడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. దేశం మళ్లీ నోబెల్ అందుకోవాలంటే పరిశోధన, సృజనాత్మక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐఐటీ పాట్నా స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు. హర్గోవింద్ ఖురానా, చంద్రశేఖర్, అమర్త్యసేన్ లాంటి భారతీయులు నోబెల్ అందుకున్నా.. వారు స్థానిక సంస్థల్లో పరిశోధనలు చేయలేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 200 యూనివర్సిటీల్లో భారత్‌కు చోటు దక్కకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ చరిత్రలో నలంద, విక్రమశిల, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి విద్యనందించాయని, అలాంటి శోభను మళ్లీ తీసుకురాలేమా అంటూ ప్రశ్నించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యలో వినియోగించుకుంటే ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో బీహార్ రాష్ట్ర గవర్నర్ డీవై పాటిల్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో గౌన్లు ధరించే సంస్కృతికి స్వస్తి చెప్పేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.