breaking news
cross attack
-
ఎదురుకాల్పుల్లోఇద్దరికి గాయాలు
బరంపురం: గంజాం జిల్లాలో పోలీసులు, కరుడుగట్టిన నేరస్థుల మధ్య శనివారం అర్ధరాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో మోస్ట్‌వాంటెడ్ ఇద్దరు క్రిమినల్స్ బంజనగర్కి చెందిన గౌరి స్వంయి, సహచరుడు భువనేశ్వర్‌కు చెందిన శ్రీకాంత్ స్వంయి అలియాస్ టేరుల కాళ్లకి తీవ్ర గాయాలయ్యాయి. గౌరి, టేరు దగ్గర నుంచి రెండు విదేశీ తుపాకీలు, ఒక బైక్ మొబైల్ ఫోన్లను పోలీసులు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాంచల్ డీఐజీ ఆశిష్ కుమార్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జిల్లాలోని బుగడలో మానితార బ్యాంక్‌ను దోపిడీ చేసిన సంఘటనలో సంబంధం ఉన్న నిందితులను పట్టుకునేందుకు గంజాం పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుల ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారు. భువనేశ్వర్ నుంచి జిల్లాలోని బుగడకు నిందితులు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుగడలో నిఘా పెట్టారు. ఇంతలో రెండు బైక్‌లపై బుగడ వైపు గౌరీ స్వంయి, శ్రీకాంత్ రాణా మరో ఇద్దరు సహచరులతో వస్తున్న సమయంలో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వచ్చినట్లు గమనించిన గౌరి స్వంయి, సహచరుడు శ్రీకాంత్ రాణా తొలుత పోలీసులపై బాంబుల దాడి చేశారు. అనంతరం తుపాకీలతో కాల్పులు జరిపారు. తప్పించుకున్న సహచరులు ఈలోగా చీకట్లో ఇద్దరు సహచరులు బుగడ ఆడవుల్లోకి పారిపోయారు. పోలీసులు ఆత్మ రక్షణగా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల సంఘటనలో గౌరీ స్వయి, సహచరుడు శ్రీకాంత్ రాణాల నాలుగు కాళ్లకి తీవ్రగాయాలయ్యాయి. వారి దగ్గర నుంచి 2 మౌజర్ (7ఎంఎం)పిస్టల్, 5 పేలని గుళ్లు, ఒక బైక్, రెండు మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మానవతా దృక్పథంతో తొలుత గౌరీ స్వంయి, శ్రీకాంత్ రాణాలను బుగడ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చి ప్రాథమిక చికిత్స అనందరం మెరుగైన చికిత్సల కోసం ఎంకేసీజీ మెడికల్ కళాశాల అస్పత్రికి తరలించి వైద్యుల సహాయంతో చికిత్సలు జరిపారు. కరుడు గట్టిన నేరస్థులు గౌరీ స్వంయి, శ్రీకాంత్ రాణాలు కొద్ది రోజుల క్రితం జరిగిన బుగడలోని మణితార బ్యాంక్ దోపిడీ సంఘటనలో ముఖ్య నిందితులని, గంజాం, కొంధమాల్ జిల్లాల్లో సుమారు 20కి పైగా దోపిడీ, దొంగతనాలు, హత్యా దాడులు వంటి నేరాలు ఉన్నాయని డీఐజీ ఆశిష్ కుమార్ సింగ్ చెప్పారు. తప్పించుకున్న మిగతా నిందితులను గాలిస్తున్నట్లు చెప్పారు. -
'ఎదురుదాడి ప్రయత్నాలు మానుకోండి'
నల్లగొండ: ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల్లో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాల గురించి గళమెత్తుతానే తప్పా... అభివృద్ధి పనులకు అడ్డుచెప్పే వ్యక్తిని కాదని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తాను అడ్డుపడుతున్నట్లు టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని గుత్తా తిప్పికొట్టారు. అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవకతవకలు సరిదిద్దకుండా తనపై ఎదురుదాడికి దిగడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని హితబోధ చేశారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ అండ్ బి అధికారులు రహదారుల పనులకు సంబంధించి టెండర్లు పిలిచిన పనులు టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం అభివృద్ధిని నిరోధించడమవుతుందని అన్నారు. నాన్‌సీఆర్‌ఎఫ్ కింద మంజూరైన నిధులతో దేవరకొండ ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులు ఇళ్లలో బోర్లు వేయించుకోవడాన్ని అవినీతి చర్యగా పేర్కొన్నారు. ఎంపీ నిధులతో చేపట్టిన రహాదారుల పనుల్లో నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తే తానే స్వయంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్తో విచారణకు ఆదేశించిన నైజం తనదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పు డే సూర్యాపేట నియోజకవర్గంలో రూ.35 కోట్లతో రోడ్లు నిర్మించానని, 2015-16లో మంజూరు కావాల్సిన 400 కేవీ సబ్‌స్టేషన్‌ను 2013-14లో మంజూరయ్యే విధంగా యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించానని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం వరకే తన బాధ్యతని అన్నారు.