అంధుల క్రికెట్ జట్టుకు రూ.కోటి నజరానా
సీఓఏ నిర్ణయం
ముంబై: ఇటీవల అంధుల టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ రూ.కోటి నజరానా ప్రకటించింది. గత నెల 25న సమావేశమైన బోర్డు నూతన పరిపాలన కమిటీ (సీఓఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12న బెంగళూరులో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రైజ్‌మనీని భారత అంధుల క్రికెట్ సంఘానికి (సీఏబీఐ) బోర్డు ఇవ్వనుంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని ఆటగాళ్లకు పంచనున్నారు.
‘బీసీసీఐ నుంచి ఈ మేర గుర్తింపు లభించడం మాకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. సీఓఏకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రపంచకప్ నిర్వహించేందుకు మేం అప్పులు చేయాల్సి వచ్చింది’ అని సీఏబీఐ అధ్యక్షుడు జీకే మహంతేష్ అన్నారు. అలాగే ఇది మంచి పరిణామమని.. ఇకనుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా టోర్నీలు ఆడతామని ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఇప్పటిదాకా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సీఏబీఐ.. బీసీసీఐ తమను ఈమాత్రమైనా గుర్తించడంతో సంతోషంలో తేలుతోంది.