breaking news
crackers sound
-
‘మా మున్ని కనిపిస్తే చెప్పండి ప్లీజ్’
బంజారాహిల్స్: దీపావళి పండుగ రోజున సాయంత్రం టపాసుల మోతకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పెంపుడు శునకం తప్పిపోయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లో నివసించే ఆండ్రూఫ్లెమింగ్ దంపతులు తన పెంపుడు కుక్కను ‘మున్ని’ అనే పేరుతో ముద్దుగా పిలుచుకుంటారు. ఈనెల 4వ తేదీన దీపావళి రోజు రాత్రి స్థానిక ప్రజలు పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ శబ్ధాలకు బెదిరి తమ పెంపుడు కుక్క ఇల్లు దాటి పారిపోయిందని చెబుతూ, ఈ మేరకు కుక్క ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ఆచూకీ తెలిసిన వారు 87909 61118 ఫోన్ నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
ఢిల్లీలో శబ్దాలు చేస్తే రూ. లక్ష జరిమానా
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఇకపై ఎవరైనా శబ్ద కాలుష్యానికి పాల్పడితే రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. ముందుగా అనుమతి లేకుండా పెళ్లిళ్లు, పండుగల్లో బాణాసంచా పేల్చినా, లౌడ్ స్పీకర్లు, డీజిల్ జనరేటర్ (డీజీ) సెట్స్ వాడితే విధించే జరిమానాలను సవరించినట్టుగా ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) వెల్లడించింది. ఈ కొత్త నిబంధనల్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) సవరించిన జరిమానాల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటి వేళల్లో 55 డెసిబల్, రాత్రి వేళల్లో 45 డెసిబల్ శబ్దాలకు మాత్రమే అనుమతి ఉంది. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధి వరకు సైలెంట్ జోన్లగా ప్రకటించారు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చి శబ్ద కాలుష్యానికి పాల్పడితే మొదటిసారి రూ. 20 వేలు జరిమానా విధిస్తారు. రెండో సారి చేస్తే రూ. 40 వేలు, అంతకంటే ఎక్కువగా నిబంధనల్ని ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తారని డీపీసీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడితే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఆ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటారు. 1,000 కేవీఏకి మించి డీజీ సెట్స్ వినియోగిస్తే రూ.లక్ష, 62.5 నుంచి 1,000 కేవీ మధ్య డీజీ సెట్స్ వాడితే రూ. 25 వేలు, 62.5 కేవీఏ వరకు డీజీ సెట్స్‌పై రూ.10 వేలు జరిమానా విధించాలని నిబంధనల్ని సవరించారు. -
లైట్ అండ్ స్మైల్
నగరంలో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న వాహనాలు, సాంకేతిక పరికరాల వాడకం, పచ్చదనం తగ్గిపోతుండటం.. ఇలాంటి కారణాలతో పొల్యూషన్ ఒక సొల్యూషన్ లేని సమస్యగా మారిపోతోంది. అయినా పండుగ సంబరాల పేరిట రూ. వేలల్లో ఖర్చుపెట్టి మరి కాలుష్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కాలుష్యం లేని క్రాకర్స్‌తో, మరిన్ని దీపాల వెలుగులతో పండుగను జరుపుకోలేమా? టపాసులతో పాటు ఈ దీపావళిని పచ్చని పండుగగా మలుచుకుందాం. - ఎస్.సత్యబాబు సుప్రీంకోర్టు విధించిన పరిమితి ప్రకారం.. క్రాకర్స్ చేసే శబ్ద పరిమాణం 125 డెసిబుల్స్ మించకూడదు. అది దాటితే వ్యక్తుల్లో వినికిడి లోపం కలిగే ప్రమాదం ఉంది. అయితే నగరంలో అత్యధికులకు ఎకో ఫ్రెండ్లీ, స్మోక్ లెస్ ఫైర్ క్రాకర్స్ గురించి అవగాహన లేదు. దేశంలోని ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన సిటీలోనే వినియోగం తక్కువ. ఈ ఉత్పత్తులపై అవగాహన పెరిగితే మాత్రమే మనం కాలుష్య రహిత దీపావ ళిని భావితరాలకు పండుగ లాంటి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వగలం. ఎకో ఫ్రెండ్లీ.. సంప్రదాయ క్రాకర్స్‌కు భిన్నంగా ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ వాక్యూమ్ కంబషన్ మెథడ్‌లో రూపొందుతున్నాయి. వీటిని రిసైకిల్డ్ పేపర్‌తో తయారు చేస్తారు. తయారీలో ఎటువంటి కెమికల్స్ వినియోగించరు. తద్వారా శబ్దం, పొగ రెండూ తక్కువగానే వస్తాయి. వీటిని వీధిలోనే అక్కర్లేదని ఇంట్లో సైతం కాల్చుకోవచ్చని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ తయారీదారులు చెబుతున్నారు. మరోవైపు ఈ క్రాకర్స్ విభిన్న రకాల సైజ్లు, షేప్స్‌లో, పోకీమాన్, మ్యాంగో మ్యాజిక్, రెయిన్బో స్మోక్, స్వీట్.. వంటి పేర్లతో లభిస్తున్నాయి. ఇవి కూడా తమిళనాడులోని శివకాశిలోనే తయారవుతున్నాయి. మామూలు క్రాకర్స్ రూ.100 నుంచి రూ.10,000 దాకా ఖరీదులో ఉంటే, ఇవి రూ.40 నుంచి రూ.1,500 వరకూ మాత్రమే ఉన్నాయి. జర దీరే జలావో.. రెగ్యులర్ క్రాకర్స్‌లో కాపర్, పొటాషియం నైట్రేట్, కార్బన్, లెడ్, కాడ్మియమ్, జింక్, సల్ఫర్.. వంటి రసాయనాలుంటాయి. ఇవి కాల్చినప్పుడు విషతుల్యమైన వాయువులు వాతావరణంలోకి కలసిపోతున్నాయి. వీటి ద్వారా వినికిడిలోపం, అధిక రక్తపోటు, శ్వాసకోస ఇబ్బందులు, స్కిన్ అలర్జీస్ వంటి రకరకాల సమస్యలు కలుగుతున్నాయి. చప్పుడు లేకుండా వెలుగులు చిమ్మే అవకాశం వున్న మతాబులు, ఆకాశ దీపాలు వంటి ఆప్షన్లతో.. లెటజ్ గో ఫర్ ఎకో అండ్ ప్యాకెట్ ఫ్రెండ్లీ ఫెస్టివల్. ‘గ్రీన్’ టిప్స్.. - దీపాలను అమర్చే రంగోలీని ఆర్గానిక్ రంగులతో నింపండి. తాజా పువ్వులు, మట్టి ప్రమిదలతో చూడచక్కని రంగోలీ చేసుకోవచ్చు. - ఫుడ్ కార్నర్, రీడింగ్ కార్నర్ లాగా ఈ దివాలీకి ఇంట్లో గ్రీన్ కార్నర్‌ని ఏర్పాటు చేయండి. - బాల్కనీ లేదా టైపై గ్రీన్ కార్నర్‌ను ఏర్పాటు చేసుకోగలిగితే.. గ్రీన్ దివాలీ సూపర్బ్‌గా చేసుకోవచ్చు. - విద్యుత్ ఆదా చేసే ఎనర్జీ సేవింగ్ ఎల్ఈడి లైట్స్‌తో ఇంటిని వెలిగించండి. - పచ్చని మొక్కలు, ఎల్ఈడీ లైట్లు, హ్యాండ్ మేడ్ దీపాలు, జ్యూట్‌తో చేసిన కళాత్మక వస్తువులు... వీటిని బహుమతులుగా అందించవచ్చు. - వీటితో పాటు వర్చువల్ టపాసులు, లైట్లు, సౌండ్స్‌తో పండుగ సంబరాల అనుభూతిని కాలుష్యరహితంగా కలిగిస్తాయి.