breaking news
council chairman election
-
'అస్త్ర సన్యాసం చేయలేదు'
హైదరాబాద్: తాము అస్త్ర సన్యాసం చేయలేదని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షనేత మాట్లాడుతుండగానే ఓటింగ్ మొదలుపెట్టారని విమర్శించారు. మండలి చైర్మన్ ఓటింగ్‌లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్కు ఓటు వేసినట్టేనని ఆయన అన్నారు. ఎమ్మెల్సీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డీఎస్ డిమాండ్ చేశారు. -
మండలి ఛైర్మన్ ఎన్నిక నుంచి తప్పుకొన్న కాంగ్రెస్
-
మండలి ఛైర్మన్ ఎన్నిక నుంచి తప్పుకొన్న కాంగ్రెస్
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఎన్నికల బరినుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకొంది. చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్దంగా జరగడంలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పోడియంలోకి దూసుకెళ్లారు. రహస్య బ్యాలెట్‌కు ఏ పద్ధతిలో వెళ్లారని, ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని సీనియర్ సభ్యుడు డి. శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ వాదోపవాదాల మధ్యనే తెలంగాణ శాసనమండలిలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి ఓటు హక్కును తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ వినియోగంచుకున్నారు. దీంతో చైర్మన్ పోడియం వద్ద కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. ఎన్నిక ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిక ప్రక్రియను నిరసిస్తూ తాము ఎన్నికల బరిలోంచి తప్పుకొంటున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సభలో అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నాయని, అసెంబ్లీ కార్యదర్శి చేతుల్లోని కాగితాలను తీసుకుని చించేయడం సభ్యత కాదని శాసనభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ సభ్యులు సభకు క్షమాపణ చెప్పాలని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసిన తర్వాత మండలి ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను యథాతథంగా కొనసాగించారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అధికార పక్షం ప్రవర్తిస్తోందని, ఇప్పటికిప్పుడు ఇంత హడావుడిగా మండలి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం.. అది కూడా రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాల్సిన అవసరం ఏముందని తెలంగాణ శాసన మండలి సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ నిలదీశారు. మండలి ఛైర్మన్ ఎన్నిక కోసం మొదలైన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తనకు కూడా నిబంధనలు తెలుసని, అయినా సంప్రదాయాలను బట్టి నిబంధనలు ఎన్నిసార్లు మార్చుకోలేదని అడిగారు. ఇంత దౌర్జన్యంగా సభ నడిపించాలా అని ఆయన అనడంతో సభలో గందరగోళం నెలకొంది. శాసనసభా వ్యవహారాల శాఖ హరీశ్ రావు మంత్రి అడ్డు తగలడంతో డీఎస్ ఆవేశానికి లోనయ్యారు. ఇది పద్ధతి కాదన్నారు. తాను ఉదాహరణలు కూడా చెప్పానని అన్నారు. స్పీకర్ పదవికి ఓపెన్ ఎలక్షన్ ఉండటం బాగుంటుందని, దాన్నే తాము ఇప్పుడు చెబుతున్నామని, సీక్రెట్ బ్యాలెట్ పెట్టడానికి వెనక ఉద్దేశం ఏంటని అడిగారు. ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. నాయకులంతా స్థానిక ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. తర్వాత ఎప్పుడు పిలిచినా తామంతా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని తెలిపారు. అయితే, మండలి చైర్మన్ ఎన్నికను గవర్నర్ షెడ్యూలు చేశారని, ఇది మనమెవరం పెట్టుకున్నది కాదని హరీశ్ రావు చెప్పారు. పోటీలో ఒకరి కంటే ఎక్కువమంది ఉంటే బ్యాలెట్ ద్వారానే ఛైర్మన్‌ను ఎన్నుకోవాలని కూడా నిబంధనలో ఉందంటూ ప్రస్తావించారు. దాంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ప్రతి సభ్యుడికీ ఎన్నిక ప్రక్రియ మీద సమాచారం అందించామని, దానికి ఒప్పుకొనే నామినేషన్లు దాఖలు చేసి, ఇప్పుడు వాయిదా వేయాలనడం హాస్యాస్పదమని హరీశ్ అన్నారు. 1980లో రాజ్యసభలో హిదయతుల్లా ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయనిచ్చిన రూలింగ్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పెద్దల సభ గౌరవం పెరిగేలా ఎన్నిక ప్రక్రియకు సహకరించాలని కోరారు. హరీశ్ చక్కగా చిలక్కి చెప్పినట్లు చెప్పారని, అయితే ప్రభుత్వ సూచనల ప్రకారమే గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారని డీఎస్ అన్నారు. గవర్నర్ ఎప్పుడూ ప్రభుత్వ సూచనలను బట్టే చెబుతారని గుర్తుచేశారు. గవర్నర్‌కు కూడా తాము ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదన్న విషయం చెప్పామని, అయితే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే తాము నామినేషన్ వేశామని తెలిపారు.