breaking news
Cosmetics Tools
-
గురుకులాల్లో కాస్మొటిక్ కిట్లపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులకు అందిస్తున్న కాస్మొటిక్ కిట్లపై అయోమయం నెలకొంది. కిట్లలోని వస్తువుల ధరలు భారీగా పెరగడంతో వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేయడం సొసైటీలకు తలకు మించిన భారంగా మారుతోంది. దీనిపై తర్జనభర్జన నెలకొనడంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా కిట్ల పంపిణీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి చొప్పున ఏడాదిలో నాలుగుసార్లు వాటిని విద్యార్థినులకు అందించాల్సి ఉంది. ఈసారి ఇంకా అందించకపోవడంతో పలువురు విద్యార్థినులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకోవల్సి వస్తోంది. కిట్లకు ధరాభారం.. గత విద్యాసంవత్సరం చివర్లో గురుకుల సొసైటీలు విద్యార్థినుల కోసం ప్రయోగాత్మకంగా కాస్మొటిక్ కిట్లను పంపిణీ చేశాయి. కాస్మొటిక్ కేటగిరీలో ఉండే వస్తువులను వేర్వేరుగా కొనుగోలు చేసిన సొసైటీలు... కిట్లుగా మార్చి విద్యార్థినులకు అందించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల్లోని సగానికిపైగా గురుకులాలకు ఈ కిట్లను సరఫరా చేశారు. అయితే సరుకుల కొనుగోలుకు, ప్రభుత్వం ఇచ్చే చార్జీలకు భారీ వ్యత్యాసం ఉండటంతో కిట్లను పంపిణీ చేయడం గురుకుల సొసైటీలకు భారంగా మారింది. మరోవైపు మైనారిటీ గురుకులాల్లో ఇస్తున్న చార్జీలు... ఇతర గురుకుల సొసైటీల్లో ఖర్చు చేసే మొత్తంలో కూడా భారీ తేడా ఉంటోంది. మైనారిటీ గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థినికి ఇచ్చే కిట్‌ను రూ. 300 పెట్టి కొనుగోలు చేస్తుండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీలు ఇందుకోసం రూ. 160 చొప్పున మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. దీంతో మైనారిటీ గురుకులాల్లో అత్యుత్తమ కిట్లు అందుతుండగా మిగతా గురుకులాల్లో కిట్ల నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటోంది. ఫలితంగా వాటిని విద్యార్థినులు పెద్దగా ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థినులకు ఇచ్చే కాస్మొటిక్ కిట్లను ఒకే సంస్థ ద్వారా పంపిణీ చేయించాలని గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కిట్ల పంపిణీని కేంద్రీకరించాలని కోరుతూ ప్రతిపాదనలు తయారు చేశాయి. కిట్‌లో ఉండే వస్తువుల జాబితాను పేర్కొంటూ వాటిని నేరుగా గురుకులాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీలు ప్రభుత్వాన్ని కోరాయి. దీని అమలు సాధ్యాసాధ్యాలపై వచ్చిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది . వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాక గురుకులాలకు కిట్లను పంపిణీ చేయనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
సీక్రెట్ చెవిలో కాదు.. బయటికే చెప్పేస్తా!
తమన్నాలా తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? పాలతో స్నానం చేయాలా? పన్నీటితో జలకాడాలా? అసలు ఆమె ఎలాంటి సౌందర్య సాధనాలు వాడుతుంది... అని అనుకోని వాళ్లుండరు. తెల్లగా ఉండటం ఆ దేవుడు ఇచ్చిన వరం అంటారు తమన్నా. మరి.. చర్మం తళతళలకు మీరేం చేస్తారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే.. పెరుగు, శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని, రాసుకుంటా అంటారామె. ఇది మాత్రమే కాదు.. మరో సీక్రెట్ కూడా ఈ మిల్క్ బ్యూటీ చెప్పారు. అదే ‘అలోవెరా’. దాని గురించి తమన్నా మాట్లాడుతూ- ‘‘రోజంతా షూటింగ్ చేసి, ఇంటికి రాగానే నా స్కిన్ చూసుకుంటే కొంచెం కంగారుగా ఉంటుంది. కానీ, ఆలోవెరా ఉంది కదా అని సరిపెట్టుకుంటాను. బాగా తీరిక చిక్కినప్పుడల్లా ఆ మొక్కలోంచి వచ్చే గుజ్జుని ఒంటికి పట్టించేస్తా. మన చర్మం పసిపిల్లలాంటిది. దాన్ని ఎంత గారాబం చేస్తే అంత అందంగా ఉంటుంది. నేను అలోవెరాతో గారాబం చేస్తాను. మీరు కూడా చేసి చూడండి. అలోవెరాకి మించిన మంచి సౌందర్య సాధనం లేదు. మన ఒంటి మీదకు వయసొచ్చినా అది కనపడనివ్వకుండా చేస్తుంది ’’ అని చెప్పుకొచ్చారు.