breaking news
Control of road traffic accidents
-
మద్యం షాపులకు తప్పని స్థాన చలనం
⇔సుప్రీం కోర్టు ఉత్తర్వులతో జిల్లాలో 200 మద్యం షాపుల తరలింపు ⇔ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుకు కసరత్తు ⇔ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ అధికారులు తిరుపతి క్రైం: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు పక్కన ఉన్న మద్యం షాపులను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఉత్తర్వులను 2017 ఏప్రిల్ 1 నుంచి తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఆయా ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంగా ఆలయాలకు, విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలో ఉండాలని నిర్దేశించింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం జిల్లాలోని సుమారు 200 దుకాణాలను తొలగించాల్సింది. దీంతో మద్యం దుకాణాల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. ఇటు ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే అలాంటి దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వేరొక చోట షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు, వైన్‌షాపు యజమానులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో జనసాంధ్రతను బట్టి దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ అంతర్రాష్ట్ర సరిహద్దుల ఆధారంగా దుకాణాలు వెలిశాయి. ప్రస్తుతం చిత్తూరు ఎక్సైజ్‌శాఖ పరిధిలో 206, తిరుపతి పరిధిలో 190 దుకాణాలకు ప్రభుత్వం లైసెన్స్‌లు జారీ చేసింది. ఏటా సగటున రూ.255 కోట్లుకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.350 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ తరుణంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలోని సుమారు 200 షాపుల వరకు తొలగించి వేరొక చోట ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రధాన రహదారుల్లో... ⇔చెన్నై– బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 4)లో 28 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔కలకడ–చిత్తూరు (ఎన్‌హెచ్ 40) రోడ్డుపై 11 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔మదనపల్లె – క్రిష్ణగిరి (ఎన్‌హెచ్ 42) రోడ్డుపై 18 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔రేణిగుంట (ఎన్‌హెచ్ 716) రోడ్డులో 21 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔పూతలపట్టు – తిరుపతి (ఎన్‌హెచ్ 140) రోడ్డులో 32 మద్యం దుకాణాలు ఉన్నాయి. ⇔పుత్తూరు రాష్ట్ర రహదారిపై 17 మద్యం దుకాణాలున్నాయి. ⇔జిల్లాలో ఎన్‌హెచ్, ఎస్‌హెచ్‌లపై 8 బార్లు, జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 98 అనధికార మద్యం దుకాణాలను తొలగించాల్సిందే. కోర్టు తీర్పుపై ఎదురుచూపు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది. జాతీయ ప్రధాన రహదారులను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. రాష్ట్ర రహదారులు ఇళ్ల మధ్యలో కూడా వెళ్లాయని, అటువంటి వాటిని మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై ఈ నెల 22వ తేదీన కోర్టు తీర్పు వెలువడనుంది. ఈ తీర్పుపైనే మద్యం షాపుల యజమానులు, ఎక్సైజ్ అధికారులు ఆశలు పెట్టుకున్నారు. తీర్పు ఎలా వస్తుందనేది వేచి చూడాలి. -
మేము సైతం రహదారి భద్రత ఉద్యమంలో..
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏకు విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం రవాణా శాఖ చేపట్టే రహదారి భద్రతా ఉద్యమంలో తాము కూడా పాల్గొని, ప్రజల్లో అవగాహన కల్పిస్తామని సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్ వెల్లడించారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వారు విడివిడిగా శనివారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు. మొదట అక్కినేని అఖిల్ తన నూతన కారు మెర్సిడెస్ బెంజ్ (రూ. 1.94 కోట్లు) రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. తనకు నచ్చిన నంబర్ ‘టీఎస్ 09 ఈఎల్ 9669’ కోసం ఇటీవల వేలంలో రూ. 46,500 చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీఏ అధికారులతో మాట్లాడుతూ.. తాను ఇప్పటికే ‘డ్రంకన్‌డ్రైవ్’పై వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వివరించారు. రోడ్డు భద్రతా కార్యక్రమాల్లోనూ తన వంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం తన కొత్త వాహనం బీఎండబ్ల్యూ (రూ. 1.21 కోట్లు) రిజిస్ట్రేషన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఈ కారు కోసం ఆయన ఇటీవలే ‘టీఎస్ 09 ఈఎల్ 9999’ నంబర్ కోసం వేలంలో రూ. 10.5 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఆల్‌నైన్ నంబర్ కోసం ఇంతపెద్ద మొత్తం చెల్లించడం ఇదే మొదటిసారి. వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ నిబంధనల ప్రకారం ఫొటో దిగి, డిజిటల్ ప్యాడ్‌పైన సంతకం చేశారు. ఈ సందర్భంగా ‘ఆర్టీఏ చేపట్టే రోడ్డు భద్రతా ఉద్యమంలో పాల్గొనాలని’ జేటీసీ రఘునాథ్ ఆహ్వానించగా, తప్పకుండా హాజరవుతానని చెప్పారు. ఆర్టీవో జీపీఎన్ ప్రసాద్, ఇతర అధికారులు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.