breaking news
contractual staff
-
మెరుపు సమ్మె.. విమానాలు ఆలస్యం
సాక్షి, ముంబై: ఎయిర్ ఇండియా కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో ముంబై విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా విమానాలు ఆలస్యమయ్యాయి. ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించిన తమ సహచరుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్‌తో బుధవారం రాత్రి నుంచి కిందిస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ‘ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ (ఏఐఏటీఎస్) ఉద్యోగులు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. పరిస్థితిని అంచనా వేస్తున్నాం. విమాన రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నామ’ని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. అయితే సమ్మె కారణంగా ఎన్ని విమానాలకు ఆటంకం కలిగిందనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయిన ఎయిర్ ఇండియా ఉద్యోగులను మళ్లీ వెనక్కి పిలిచినట్టు తెలుస్తోంది. మరోవైపు విమానాల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాంట్రాక్టు ఉద్యోగుల పంట పండనుంది. 70 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ రాష్ట్ర అన్ని ప్రభుత్వశాఖలను కాంట్రాక్ట్ ఉద్యోగుల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాలని ఆదేశించారు. డెబ్భై వేలకు పైగా ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించినట్లు అన్ని కార్యాలయాల అధికారులకు తెలిపారు. అన్ని శాఖల అధికారులు దీనిపై తమ ప్రతిపాదనలను చీఫ్ సెక్రటరీకి తెలియజేయాలని కేజ్రీవాల్ చెప్పారు. ఇప్పటికే గెస్ట్ టీచర్స్ ను పర్మినెంట్ చేయాలన్న దానిపై పూర్తి వివరాలను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్ కు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.తమ ప్రతిపాదనలను ఎల్జీ అంగీకరించని పక్షంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయంపై ఆయన ఎంతో పట్టుదలగా కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే సీఎం కేజ్రీవాల్ ఈ చర్యలు చేపట్టారు. ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 17,000 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఢిల్లీ శాసనసభకు 2013, 2015లలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఆప్ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చిన విషయం విదితమే.