breaking news
cm babu
-
బంగారం రుణాలు ఇవ్వొద్దు..!
–బ్యాంకర్లకు సూచించిన సీఎం చంద్రబాబు –వడ్డీ రాయితీని ఎగ్గొట్టేందుకు ప్రయత్నం –గగ్గోలు పెడుతున్న రైతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో షాక్ ఇచ్చారు. ఇక నుంచి రైతులకు బంగారంపై రుణాలు ఇవ్వొద్దని నేరుగా బ్యాంకర్లకు సూచించారు. విజయవాడలో సోమవారం జరిగిన 195వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భూమి వివరాలు ఆధారంగా ప్రాథమిక రుణాలే అందజేయాలని, బంగారం తాకట్టు రుణాలు అందజేయొద్దని ఆదేశించారు. ఇప్పటికే అడంగల్ సరిగా లేకపోవడం, రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. సులభంగా లభ్యమయ్యే బంగారు ఆభరణాల తాకట్టు రుణాలు కూడా ఇవ్వొద్దని సీఎం చెప్పడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వడ్డీ రాయితీని ఎగ్గొట్టేందుకు సీఎం కుట్రపన్నారంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రుణమాఫీ అంటూ మోసం చేశారు. ఇప్పుడు మరోసారి కష్టాల పాలచేసేందుకు పూనుకుంటున్నారని, రైతు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని వాపోతున్నారు. నెరవేరని రుణ లక్ష్యం.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 5.4 లక్షల మంది రైతులకు రూ.1,375 కోట్ల రుణాలు మంజూరు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఖరీఫ్ గడువు ముగిసే సమయానికి 2.9 లక్షల మంది రైతులకు రూ.700 కోట్ల రుణాలు అందజేశారు. ఈ ఏడాది రైతులు కేవలం 51 శాతం మాత్రమే లక్ష్యాలు చేరగలిగారు. అంటే ఈ ఏడాది ఖరీఫ్‌లో వివిధ కారణాలు, ప్రభుత్వ వైఫల్యాలు, నిబంధనల వల్ల సగం మంది రైతులు రుణాలు పోందలేక పోయారన్నది వాస్తవం. రైతులకు బంగారు రుణాలు ఎండమావే.. రైతులు వ్యవసాయ మదుపులు కోసం బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకోవడం సహజం. ఈ ఏడాది జిల్లాలో సుమారు 60 వేల మంది రైతులు బంగారాన్ని తాకట్టుపెట్టి సుమారు వందకోట్ల రుణాన్ని పొందినట్టు సమాచారం. ఏడాది లోపల ఈ రుణాన్ని బ్యాంకర్లకు చెల్లిస్తే వడ్డీ రాయితీని ప్రభుత్వం భరిస్తుంది. ఇది దశాబ్దాలుగా వస్తున్న విధానం. ప్రస్తుత సీఎం దీనికి కోత పెట్టారు. వడ్డీ రాయితీ భారాన్ని తప్పించుకునేందుకు రైతులకు బంగారు రుణాలు మంజూరు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. -
సొంతింటి కలకు చంద్రగ్రహణం
గృహనిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం నీళ్లు! గుబులు పుట్టిస్తున్న సెక్ డేటా సర్వే బడుగుల ఆశలకు 13 ‘ప్రతిబంధకాలు’ బైక్, ఫ్రిజ్.. ఇలా ఏది ఉన్నా రుణం రానట్టే! వేలిముద్రలు.. ఆధార్ అనుసంధానం పేరుతో సంక్షేమ పథకాల అమలులో ఇప్పటికే పేదలకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు సర్కారు దష్టి ఇప్పుడు పేదల పక్కా ఇళ్ల నిర్మాణంపై పడింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇంతవరకూ ఒక్క ఇంటి నిర్మాణానికి కూడా పునాదిరాయి వేయని టీడీపీ ప్రభుత్వం.. పేదల సొంతింటి ఆశలపై నీళ్లు కుమ్మరించే ఎత్తుగడ వేసింది. లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు సెక్ డేటా పేరిట 13 ప్రతిబంధకాలతో సర్వే చేపట్టింది. ఈ నిబంధనల ప్రకారం.. మోటారు సైకిల్, ఫ్రిజ్ వంటివాటిల్లో ఏది ఉన్నా పేదలకు గహనిర్మాణ రుణం రానట్టేనని చెబుతున్నారు. మండపేట : అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు చంద్రబాబు సర్కారు ఎన్టీఆర్ గృహనిర్మాణం పేరిట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సాక్షిగా ఏప్రిల్ 14న పక్కా ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజలు నిర్వహించింది. ఇది జరిగి నాలుగు నెలలు గడచింది. ఇప్పటివరకూ ప్రభుత్వం ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు జిల్లావ్యాప్తంగా వేలాదిగా పేదలు గృహ నిర్మాణ రుణం కోసం దరఖాస్తు చేసుకుని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా 2011 జనాభా ఆధారంగా ఆర్థిక, సామాజిక, కులగణన (సెక్ డేటా) నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ సర్వే చేస్తున్నట్టు హౌసింగ్ సిబ్బంది చెబుతున్నారు. 13 అంశాలతో నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఏ ఒక్కటి ప్రతికూలంగా ఉన్నా వారు గృహ నిర్మాణ రుణం మంజూరుకు అనర్హులేనని వారంటున్నారు. రుణం ఎవరెవరికి రాదంటే.. రెండు లేదా మూడు లేదా నాలుగు చక్రాల వాహనాలు కానీ, ఫిషింగ్ బోట్ కానీ ఉంటే రుణం ఇవ్వరు. 3, 4 చక్రాల వ్యవసాయ పరికరాలున్నా రుణం రాదు. కిసాన్ కార్డుపై రుణపరిమితి రూ.50 వేలు దాటి ఉన్నా అనర్హులే. కుటుంబంలో ఎవ్వరూ ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు. కుటుంబంలో ఎవ్వరూ ప్రభుత్వం వద్ద నమోదైన వ్యాపార, వాణిజ్య సంస్థలతో సంబంధాలు కలిగి ఉండకూడదు. కుటుంబంలో ఏ ఒక్కరి నెలసరి ఆదాయం రూ.10 వేలు మించరాదు. ఆదాయ పన్ను, వృత్తిపన్ను చెల్లించిన వారూ అనర్హులే. మూడు లేదా అంతకంటే ఎక్కువ గదులు కలిగిన పక్కా గోడలు, ఇంటికప్పు కలిగి ఉండకూడదు. ఫ్రిజ్ ఉన్నా అనర్హులే. ల్యాండ్‌లైన్ టెలిఫోన్ ఉండకూడదు. రెండున్నర ఎకరాలకు మించి పంటభూమి ఉంటే రుణం రానట్టే. ఒక సీజన్లో రెండు లేదా మూడు పంటలు పండే ఐదెకరాల నీటి తీరువా భూమి, అంతకంటే ఎక్కువ నీటితీరువా భూమి ఉన్నా అనర్హులే. కనీసం 7.5 ఎకరాలు సొంత భూమి లేదా అంతకంటే ఎక్కువ ఉండి ఒక నీటిపారుదల పరికరం కలిగి ఉన్నా రుణం రాదు. బైక్ నిత్యావసరం కాదా! ప్రస్తుతం మోటారు సైకిళ్లు ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారాయి. గతంలో సైకిళ్లపై వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు తదితర వ్యాపారాలు సాగించేవారు సైతం మారుతున్న కాలానికి అనుగుణంగా ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వ్యాపారాలు చేస్తున్నారు. అలాగే తమ అవసరాలకు తగ్గట్టు పేదలు ఫైనాన్స్‌లో వాయిదా పద్ధతుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు సమకూర్చుకుంటున్నారు. అలాగే, జీవనోపాధి కోసం ఆటో నడుపుకుంటున్న పేదలు ఎందరో ఉన్నారు. ప్రభుత్వం ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ఈ అంశాల ఆధారంగా పేదలకు గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేయకపోవడం సరికాదని, నిబంధనలు సడలించాలని పలువురు కోరుతున్నారు. మొదటి నుంచీ గాలిమేడలే.. చంద్రబాబు సర్కారు తొలినుంచీ పేదలకు గాలిమేడలే కడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది జిల్లాకు 6,213 ఐఏవై ఇళ్లు మంజూరయ్యాయి. గత ప్రభుత్వంలో జీవో 23 కింద మంజూరైన ఆర్పీహెచ్ ఇళ్లను ఈ పథకంలోకి మార్చి, ఐఏవై నిధులను సర్దుబాటు చేశారన్న విమర్శలున్నాయి. అర్బన్వి మినహా జిల్లాలోని మిగిలిన 17 నియోజకవర్గాలకుగాను ఒక్కోదానిలో ఇంటికి రూ.10 వేల చొప్పున వెయ్యి ఇళ్లకు మరమ్మతులు నిర్వహించేందుకు ఇచ్చిన ఆదేశాలు ఆచరణకు నోచుకోలేదు. మరోపక్క అంబేడ్కర్ జయంతి రోజున జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కింద ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. కానీ ఇప్పటివరకూ ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. దీనినిబట్టి పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు విమర్శిస్తున్నారు. తీర్మానాలు రావాలి గృహనిర్మాణ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సెక్ డేటా సర్వే ఆధారంగా జరుగుతుంది. అర్హుల ఎంపికకు గ్రామసభల తీర్మానాలు తప్పనిసరి. జిల్లాలో ఇప్పటివరకూ కొన్ని పంచాయతీల నుంచి మాత్రమే గ్రామసభల తీర్మానాలు వచ్చాయి. అధిక శాతం పంచాయతీల నుంచి తీర్మానాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం. – సెల్వరాజ్, హౌసింగ్ పీడీ