breaking news
Christian prophet
-
బిల్లీ గ్రాహమ్ కన్నుమూత
మాంట్రీ(యూఎస్): విఖ్యాత క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రచారకర్త బిల్లీ గ్రాహమ్ కన్ను మూశారు. ఆయన వయసు 99 ఏళ్లు. గత కొన్నేళ్లుగా ప్రొస్టేట్ కేన్సర్, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉత్తర కరోలినాలోని తన స్వగృహంలో మృతిచెందారు. అమెరికాలో ఉదారవాద ప్రొటెస్టాంట్లు, రోమన్ కేథలిక్‌లకు పోటీగా మత ప్రచార కార్యక్రమాలను ఆయన ఒక ఉద్యమంలా నిర్వహించారు. 185కు పైగా దేశాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించి సంప్రదాయ క్రైస్తవుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్టుల పాలనలోని క్రైస్తవులకు కూడా ఆశా కిరణం గా నిలిచారు. మత బోధనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందికి చేరువైంది గ్రాహమే అంటే అతిశయోక్తి కాదు. ‘అమెరికా పాస్టర్’గా పేరొందిన గ్రాహమ్.. ఐసన్‌హోవర్ నుంచి జార్జి డబ్ల్యూ బుష్ వరకు పలువురు అమెరికా అధ్యక్షులకు ఆధ్యాత్మిక సలహాదారుగా, సన్నిహితుడిగా వ్యవహరించారు. బహిరంగ ప్రార్థనలే కాకుండా టీవీలు, రేడియోల ద్వారా కూడా గ్రాహమ్ మిలియన్ల కొద్ది అభిమానులను సంపాదించుకున్నారు. గ్రాహమ్ మృతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు. 21 కోట్ల మందికి ప్రసంగం 2005లో న్యూయార్క్ పట్టణంలో నిర్వహించిన తన చివరి ప్రార్థనలో ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల మందిని ఉద్దేశించి ప్రసంగించి రికార్డు సృష్టించారు. అయనలా మరో ఎవాంజలిస్ట్ ఇలాంటి బృహత్తర కార్యక్రమం తలపెట్టే అవకాశాలు దాదాపు అసాధ్యమే. 1983లో అప్పటి అధ్యక్షుడు రీగన్ నుంచి గ్రాహమ్ అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను అందుకున్నారు. గ్రాహమ్ 1918, నవంబర్ 7న చార్లెట్లో సంప్రదాయ క్రైస్తవుల కుటుంబంలో జన్మించారు. కాలేజీలో చదువుతుండగా చైనాకు చెందిన రూత్ బెల్ అనే యువతితో పరిచయమైంది. 1943లో వారు వివాహం చేసుకున్నారు. -
సింహాలకు దేవుడు లేడా?
'ఒకడు స్వర్గం చూడాలంటే వాడు కచ్చితంగా మరణించాలి' అని బైబిల్ సామెత. ఇలాంటివే తెలుగు సినిమాల్లోనూ వినబడతాయ.. 'గన్ చూడాలనుకో తప్పులేదు.. కానీ బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్' లాంటివి. జననం, మరణం, దైవం, కార్యం కాంబినేషన్లో చెప్పుకోవడానికి బోలెడు డైలాగులున్నాయి మనకు. పాపం ఇలాంటివి ఏ ఒక్కటైనా చెవికి ఎక్కితే అలెక్ క్షేమంగా ఉండేవాడు. ఇంతకీ మనవాడు ఏం చేశాడంటే.. దక్షిణాఫ్రికాకు చెందిన అలెక్ ఎన్ డీవానె క్రైస్తవ మతబోధకుడు. తన ప్రార్థనాశక్తిని నలుగురికీ చూపించుకోవాలనే ఆలోచనతో ఏకంగా సింహంతో ప్రాక్టికల్ చేయబోయాడు. ప్రఖ్యాత కుర్గెర్ సఫారీ పార్కులోకి వెళ్లి.. సింహాలగుంపు ముందు నిల్చొని.. 'దేవుడు నిజంగా శక్తిమంతుడైతే ఈ సింహం నన్నేమీ చెయ్యదు' అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. అరుపులకు బెదిరిపోయిన సింహాలు అలెక్ వైపు కోపంగా దూసుకొచ్చాయి. అప్పుడు గానీ పూర్తిగా అర్థంకాలేదు మనోడికి.. 'దైవశక్తిని నమ్మాలే గానీ వాస్తవావాస్తల జోలికి వెళ్లకూడదు' అని! అయితే జ్ఞానోదయం అయినంత ఫాస్ట్ గా కాళ్లు పనిచేయలేకపోవడంతో క్రూరజంతువులకు దొరికిపోయాడు. పరుగుపెట్టే ప్రయత్నంలోఉన్న అతనిపై ఓ సింహం పంజా విసిరింది. అంతే, ఒక్క దెబ్బకు పిరుదుల ప్రాంతం నుంచి అరకేజీ మాంసం ముద్ద ఊడిపడింది. జూ సంరక్షుడు తుపాకి పేల్చకుండా ఉండేదుంటే అలెక్ ప్రాణాలు ఈపాటికి గాల్లో కలిసిపోయి ఉండేవి. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అలెక్.. 'జంతువులపై తనకున్న ఆధిపత్యాన్ని భగవంతుడు నా ద్వారా నిరూపించాలనుకున్నాడు' అని తన చర్యను సమర్థించుకుంటున్నాడు. ఓ గాడ్..!