breaking news
Chit fund business
-
చిట్టీల పేరుతో కుచ్చు టోపీ..
నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన సైదులు అనే చిట్టీల వ్యాపారి రూ.6 కోట్లకు టోపీ వేసి కుటుంబంతో ఉడాయించాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి ఉన్న విషయం గమనించిన దాదాపు 800 మంది బాధితులు న్యాయం చేయాలని నల్గొండలోని ఎస్పీ కార్యాలయం వద్ద బుధవారం మధ్యాహ్నం ధర్నా చేశారు. ఎస్పీ లేకపోవడంతో డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. చిట్టీల పేరుతో మోసగించి ఉడాయించిన సైదులుపై నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 20 సంవత్సరాలుగా నార్కెట్‌పల్లిలో నమ్మకంగా ఉంటూ చీటీల వ్యాపారం చేసేవాడు. 50 వేల నుంచి 2లక్షల రూపాయల వరకూ చీటీలు వేసేవాడు. దాదాపు 6 కోట్ల రూపాయల వరకూ దండుకుని రాత్రికి రాత్రి కుటుంబంతో సహా ఉడాయించాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నార్కెట్‌పల్లి పోలీసులు చెప్పారు. -
రూ.64.70 లక్షలకు ఐపీ
ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: నగరానికి చెందిన చిట్‌ఫండ్ వ్యాపారులైన షేక్ అబ్దుల్ రషీద్-షేక్ రషీద్బేగం దంపతులు 64.70లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంగళవారం దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు. మొత్తం ఎనిమిదిమంది రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మొదటి ఇద్దరు ప్రతివాదులైన కాంతాలి శ్రీనివాసరావు-పద్మ దంపతులకు 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సుందని పేర్కొన్నారు. పిటిషన్లో తెలిపిన ప్రకారం.. షేక్ అబ్దుల్ రషీద్-షేక్ రషీద్బేగం దంపతులు ఖమ్మంలో చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించేవారు. వ్యాపార అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. చిట్టీలు పాడుకున్న వారు డబ్బును వాయిదాల ప్రకారం చెల్లించకపోవడంతో వ్యాపారంలో నష్టపోయారు. అప్పులు తీర్చలేక, ప్రతివాదుల ఒత్తిళ్లు తట్టుకోలేక దివాళ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్‌దారుల తరఫున న్యాయవాదులుగా తాళ్ళూరి దిలీప్, రావుల వెంకట్ వ్యవహరిస్తున్నారు. రూ.7.3లక్షలకు మరో వ్యాపారి... రఘునాధపాలెం మండలంలోని రుద్రంకోట గ్రామానికి చెందిన పసుపులేటి అప్పారావు 7.03లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంగళవారం దివాలా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 12మంది రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషన్లో తెలిపిన ప్రకారం.. పిటిషన్‌దారుడైన పసుపులేటి అప్పారావు ఖమ్మం చుట్టుపక్కల గేదెల వ్యాపారం నిర్వహించేవాడు. ఇందుకోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చాడు. ఆ తరువాత గేదెలు చనిపోవడం, వ్యాపారంలో ఒడుదుడుకులు వచ్చాయి. దీంతో అప్పులు తీర్చలేకపోయాడు. ప్రతివాదుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమవడంతో తనను దివాలా తీసినట్టుగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ దివాలా పిటిషన్ దాఖ లు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాదుదిగా కన్నెబోయిన నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.