breaking news
Chiru Tej Singh
-
వెండి తెరపై అనుభవ పాఠాలు
హన్మకొండ చౌరస్తా : మారుమూల గిరిజన తండాలో పుట్టిన వారిద్దరు.. సమాజంలో కొనసాగుతున్న వివక్షను చిన్ననాటి నుంచే స్వయంగా ఎదుర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా చిన్నచూపు చూడడం భరించలేకపోయారు. ఈ క్రమంలో వివక్షపై పోరాటం చేయాలని ఆ ఇద్దరు యువకులు నిర్ణయించుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో ఒకరు రాజకీయాల్లోకి అడుగిడితే, మరొకరు వైద్యుడయ్యారు. వారు చేస్తున్న వృత్తితో ఆర్థికంగా స్థిరపడ్డారు. అయితే వారు చిన్నతనంలో ఎదుర్కొన్న వివక్షను నిర్మూలించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలోని తండాకు చెందిన ఎన్.సారయ్యనాయక్.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పీజీ పూర్తి చేశారు. సమాజంలో నిమ్న కులాలపై వివక్ష కొనసాగడంపై చలించిపోయారు. తండావాసుల సహకారంతో 2001లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తండావాసులకు విద్య, వైద్యం కోసం శ్రమించారు. మరొకరు ఆనంద్.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి తండావాసి. మిర్యాలగూడలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఆయుర్వేద కళాశాలలో వైద్యవిద్య చదవివారు. ప్రస్తుతం ఢిల్లీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సమాజంలో దళిత, గిరిజనులు, బాలికలపై కొనసాగుతున్న వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నారు. అందుకు సినీ తెరను వేదికగా ఎంచుకున్నాడు. అనుకోకుండా 2010లో ఒక వేదికపై సారయ్యనాయక్, ఆనంద్‌లు పరిచయమయ్యారు. వారు మూడు లఘుచిత్రాలు, రెండు సినిమాలు నిర్మించారు. ప్రముఖుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. చిరుతేజ్‌సింగ్‌పై లఘుచిత్రం జ్ఞాపకశక్తిలో గిన్నిస్ రికార్డు సాధించిన వరంగల్ నగరానికి చెందిన ఎనిమిదేళ్ల చిరుతేజ్‌సింగ్‌పై రూపొందించిన లఘుచిత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చిరుతేజ్‌సింగ్ కేవలం ఒక నిమిషంలో 81 దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పగలగడం అతడి ప్రతిభ. ‘హార్మోన్స్’ చిత్రానికి అవార్డులు.. బంజార మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై 2011లో నిర్మించిన హార్మోన్స్ చిత్రం 2012లో రాష్ట్రవ్యాప్తంగా 60 థియేటర్లలో విడుదలైంది. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మొదలు ఢిల్లీ వరకు ఈ సినిమా ప్రముఖులచే ప్రశంసలు, అవార్డులను అందుకుంది. సామాజిక దృక్పథతో విద్య, వైద్యం, వ్యవసాయం అంశాలపై తెరకెక్కించిన ఈ చిత్రంలో తెలంగాణ యువతకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నటనలో కొత్తైనా సామాజిక అంశం కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కేయూ మాజీ వీసీ గోపాల్‌రెడ్డి, రిటైర్డ్ ఐజీ.జగన్నాథరావు తదితరులు నటించడం విశేషం. అంతేకాకుండా బాలికల విద్యా హక్కు చట్టం, అంటరానితనం, దళిత గిరిజనులపై వివక్ష’ తదితర అంశాలపై రూపొందించిన లఘుచిత్రాలు మేధావులను సైతం ఆలోచింపజేశాయి. వివక్షను తరిమికొట్టడమే లక్ష్యం స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ దళిత, గిరిజనులపై వివక్ష, దాడులు జరుగుతుండడం బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో దళిత, గిరిజనుల్లో చైతన్యం నింపి, రాజ్యాంగ హక్కులను అందించడమే మా లక్ష్యం. అందుకు సినీ తెరను వేదికగా మలుచుకున్నాం. ప్రజలపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది. – సారయ్యనాయక్, సినీ నిర్మాత మెరుగైన విద్య, వైద్యం అందినప్పుడే అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు నగరాల్లోని మురికివాడల్లో నివసించే వారిలో అత్యధిక శాతం దళితులు, గిరిజనులే ఉన్నారు. వీరందరికీ మెరుగైన విద్య, వైద్యం అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందితుంది. ఆ దిశగా గిరిజనుడిగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నా. – ఆనంద్, సినీ దర్శకుడు -
లఘు చిత్ర దర్శకుడికి నాటా ఆహ్వానం
లఘు చిత్రాలను రూపొందించి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న దర్శకుడు ఆనంద్ కుమార్‌కు మరో గౌరవం దక్కింది. ఈ ఏడాది జూలైలో జరగబోయే నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోషియేషన్) మెగా కన్వెన్షన్‌లో దర్శకుడు ఆనంద్ కుమార్ పాల్గొననున్నారు. డాక్టర్ అయిన ఆనంద్ సినీరంగం మీద ప్రేమతో దర్శకుడిగా మారారు. హార్మోన్స్ సినిమాతో దర్శకుడి పరిచయం అయిన ఆనంద్, తరువాత లఘు చిత్రాలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. సామాజిక సమస్యల నేపథ్యంలో ఆనంద్ రూపొందించిన ప్రజా హక్కు, అన్ టచ్ ఎబిలిటీ లాంటి షార్ట్ ఫిలింస్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన 9 ఏళ్ల అమ్మాయి చిరు తేజ్ సింగ్ కథతో తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ఆనంద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించటంతో పాటు పలు అవార్డు కమిటీల జ్యూరీలలో మెంబర్‌గా ఉన్న ఆనంద్‌కు నాటా ఫిలడెల్ఫియాలో నిర్వహించబోయే మెగా కన్వెన్షన్‌కు ఆహ్వానం అందింది. జూలై 6 నుంచి 8 వరకు జరగబోయే ఈ కన్వెన్షన్‌లో ప్రపంచం నలు మూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. -
చిన్నారులకు ప్రేరణ కలిగించేలా ‘చిరు తేజ్ సింగ్’
ప్రస్తుతం వెండితెర మీద బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అద్భుత విజయాలు సాధించిన ఎంతో మంది విజయగాథాలు సినిమాలుగా రూపొందుతున్నాయి. అదే ఫార్ములా ఇప్పుడు షార్ట్ ఫిలింస్‌లోనూ కనిపిస్తుంది. తన మేధాశక్తితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి చిరు తేజ్ సింగ్ జీవిత కథ ఆధారంగా తన పేరుతోనే తనే ప్రధాన పాత్రలో ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. N.S NAIK నిర్మాతగా అవార్డ్ విన్నింగ్ లఘు చిత్రాల దర్శకులు డా. ఆనంద్ కుమార్ దర్శకత్వంలో ఈ షార్ట్ ఫిలిం రూపొందింది. ఫ్యాషన్ డిజైనర్ ఫేమ్ మనాలి రాథోడ్, కాటమరాయుడు ఫేమ్ సౌమ్యవేణుగోపాల్ ప్రధానపాత్రల్లో నటించారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలో 236 ప్రపంచ పటాలను గుర్తించి, బాల మేధావిగా ఎన్నో పతకాలను, ప్రశంసలను సొంతం చేసుకొని తెలుగు జాతి, మరియు భారతదేశ ప్రతిష్టను పెంచిన చిరుతేజ్ సింగ్ చిత్రం విశ్లేషకులు ప్రశంసలు అందుకుంటోంది. తల్లి కూతురి మధ్య ప్రేమ, టీచర్ స్టూడెంట్ మధ్య వున్న ఆసక్తికరమైన మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఎంతోమంది చిన్నారులకు ప్రేరణ కలిగించేలా ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు దర్శకులు డాక్టర్ ఆనంద్ కుమార్. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా అనాధ పిల్లకోసం అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ థియేటర్ లో వేయడం జరిగింది. వారితో పాటు ఈ షార్ట్ ఫిలిం చూసిన సమంత యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియచేశారు. నిర్మాత రాజ్ కందుకూరి,దర్శకులు మధుర శ్రీధర్, వీరశంకర్, సాగర్ చంద్ర, సంగీత దర్శకులు రఘు కుంచె, యువ హీరో అభిజిత్, నటి సీత నారాయణ్‌లతో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు.