రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ రివ్యూ
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న రాజ్ తరుణ్.. ఈ మధ్య డీలా పడిపోయాడు. ఆయన ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. గతేడాదిలో వచ్చిన తిరగబడరా సామీ మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్.. ‘చిరంజీవ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. రాహుల్ అవురెడ్డి, సుమాసిని రాహుల్ నిర్మించిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. నేటి(నవంబర్ 7) నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటి?రాజ్‌తరుణ్ అంబులెన్స్ డ్రైవర్. దేవుడిపై పెద్దగా నమ్మకం ఉండదు. మనోడి క్యారెక్టర్ నచ్చి హీరోయిన్ కుషిత కల్లపు ప్రేమలో పడిపోతుంది. ఓ రోజు అంబులెన్స్‌లో వెళ్తుంటే రాజ్ తరుణ్‌కి యాక్సిడెంట్ అవుతుంది. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు కొన్ని శక్తులు వస్తాయి. మనుషుల తలపై ఓ మీటర్ కనబడుతుంది. అందులో ఆ వ్యక్తి ఆయుష్షు ఎంతవరకు ఉందో కనిపిస్తుంది.తనకు వచ్చిన ఈ స్పెషల్ పవర్స్‌ని ఉపయోగించి అప్పుల బాధల నుంచి బయటపడతాడు. తన ప్రియురాలి ఫ్యామిలీని కూడా సేవ్ చేస్తాడు. ఇలా జీవితం హాయిగా గడుపుతున్న రాజ్ తరుణ్‌కి.. ఓ రోజు మార్కెట్లో చాలా మంది పిల్లలను కనిపిస్తారు. వారందరి ఆయుష్షు ఆ రోజే ముగిసిపోతుందనే విషయం తెలుస్తుంది. అసలు ఆ పిల్లలు ఎవరు? ఎందుకు వచ్చారు? వాళ్లంతా చనిపోతారనే విషయం తెలిసిన తర్వాత రాజ్ తరుణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? వాళ్లను రక్షించేందుకు ఏం చేశాడు? అసలు ఈ స్పెషల్ పవర్స్ ఆయనకు ఎందుకు వచ్చాయి? చివరకు తనకున్న పవర్స్‌తో వారిని రక్షించాడా లేదా? అనేది తెలియాలంటే ఆహాలో సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..మన పక్కనున్న వ్యక్తి చనిపోతాడనే విషయం ముందే మనకు తెలిస్తే..అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి సంఘర్ణనకు లోనవుతారు? ఇలాంటి ఐడియాలు వినడానికే ఆసక్తికరంగా ఉంది. ఆ పాయింట్‌నే తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అదిరే అభి. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో ముందే తెలిసే స్పెషల్ పవర్ ఉన్న హీరో.. దాన్ని అడ్డుపెట్టుకొని ఎలా ఎదిగాడు. ఆ పవర్ కారణంగా ఎలాంటి ఒత్తిడికి లోనయ్యాడు? ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు? అనేది ఈ సినిమాలో చూపించాడు. సీరియస్ పాయింట్‌ని తీసుకొని దాన్ని ఫన్నీ వేలో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ అంతా సరదాగానే గడిసిపోతుంది. హీరోకి స్పెషల్ పవర్స్ వచ్చిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుడిలో నెలకొంటుంది. ప్రాణాలు కాపేందుకు హీరో ప్రయత్నం ఆకట్టుకునేలా ఉంటుంది. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల సీరియస్ సీన్స్ వర్కౌట్ అయినా.. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి .వరుసగా వచ్చే ట్విస్టులు కథనంపై ఆసక్తిని పెంచుతాయి. క్లైమాక్స్ లో మరో వచ్చే సీన్లు ఉత్కంఠకి గురిచేస్తాయి. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ దాన్ని అంతే అద్భుతంగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్‌ని బలంగా రాసుకొని.. కథనంపై ఇంకాస్త దృష్టి పెడితే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..రాజ్ తరుణ్ ఎప్పటి మాదిరే తన పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయిస్తూ..చాలా హుషారుగా కనిపించాడు. హీరోయిన్గా కుషిత కల్లపు పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. ఇమ్మాన్యుయెల్ కాసేపు కనిపించి నవ్వించాడు. సంజయ్ కృష్ణ, కిరీటీ, గడ్డం, రాజా రవీంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అచ్చు రాజమణి సంగీతం జస్ట్ ఓకే. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. సినిమా నిడివి 1.50 గంటలే ఉండడం ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.