breaking news
Chintamani Nagesa ramachandra rao
-
అణువణువునా అదే స్ఫూర్తి
చింతామణి నాగేశ రామచంద్రరావు.. డాక్టర్ సి.ఎన్.ఆర్.రావు. రసాయనశాస్త్రంలో ఆయన పరిశోధనలు మైలురాళ్లు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. ఆరు దశాబ్దాలుగా పరిశోధనా ప్రపంచంలో మునిగితేలుతున్న రావును అనేక అవార్డులు, పురస్కారాలు, పదవులూ వరించాయి. శాస్త్రసాంకేతిక అంశాల్లో భారత ప్రధానికి సలహాలు, సూచనలు అందించే ప్రధానమంత్రి శాస్త్రీయ సలహా మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రావును ఇటీవల భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. సైన్స్‌తోనే సుస్థిర భవిష్యత్తు అంటున్న సి.ఎన్.ఆర్.రావుతో.. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.. సైన్స్ రంగంలో అడుగుపెట్టడానికి కారణం? పదిహేడేళ్ల వయసులో 1951లో బీఎస్సీ పూర్తి కాగానే సైన్స్ కోర్సును లక్ష్యంగా ఎంచుకున్నాను. బెంగళూరులో 1951లో కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు.. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సి.వి.రామన్ నాకు గొప్ప స్ఫూర్తి. ఎమ్మెస్సీ చదివేటప్పుడు ప్రముఖ శాస్త్రవేత్త లినస్ పాలింగ్ గురించి తెలిసింది. కెమిస్ట్రీలో సంచలనం సృష్టించిన, ఆయన రాసిన ‘ద నేచర్ ఆఫ్ ది కెమికల్ బాండ్’ చదివాను. ఈ పుస్తకం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. దాంతో పరిశోధనల విషయంలో నాకు పూర్తి స్పష్టత వచ్చింది. రసాయన శాస్త్రమే ఎందుకు? రసాయన శాస్త్రం అంతా కణాలు, పదార్థాల సమ్మేళనమే. విశ్వం అంతా వీటితో కూడి ఉంటుంది. ఒక నిర్దిష్ట అవధిలో కణాలు, పదార్థాల ఆకృతి వెనుకుండే రహస్యాన్ని బంధన అణువుల ఆధారంతో కనుగొనాలని, అదే విధంగా నిర్దిష్ట ఆకృతి సంబంధిత పరమాణు ధర్మాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో రసాయన శాస్త్రాన్ని ఎంచుకున్నాను. పరిశోధనల విషయంలో మీకెదురైన ఇబ్బందులు? దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికి అప్పుడే కాలేజీలో అడుగుపెట్టాను. సదుపాయాలు చాలా పరిమితంగా ఉండేవి. అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసుకుని 1959లో స్వదేశానికి తిరిగొచ్చినా.. దాదాపు అదే పరిస్థితి. నెమ్మదిగా పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్పొచ్చు. దేశంలో ప్రస్తుతం పరిశోధనలపై మీ అభిప్రాయం? పరిశోధనల పరంగా దేశం బాగా ముందడుగు వేస్తోంది. ప్రధానంగా గత పదేళ్లలో పరిశోధనల పరంగా సదుపాయాలు ఎంతో మెరుగయ్యాయి. కొన్ని ఇన్స్టిట్యూట్లు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్నాయి. నా వ్యక్తిగత పరిశోధనల పరంగా చెప్పాలంటే.. గత పది, పదిహేనేళ్లలో అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అసలు ఎలాంటి సదుపాయాలు లేని పరిస్థితిలో మొదలైన నా పరిశోధనలు.. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో సాగుతున్నాయి. ప్రధానమంత్రి శాస్త్రీయ సలహా మండలి చైర్మన్‌గా తీసుకుంటున్న చొరవ? శాస్త్రీయ సలహా మండలి తరఫున సైన్స్, కార్యాచరణ, నిధుల కేటాయింపు వంటి ఎన్నో అంశాలపై ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి సిఫార్సులు చేశాం. వీటిలో అధిక శాతం ఆమోదం పొందడంతోపాటు అమల్లోకి కూడా వచ్చాయి. ఉదాహరణకు.. కొత్తగా ఏర్పాటైన ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లు సలహా మండలి సిఫార్సుల మేరకు జరిగినవే. అదే విధంగా యువతను పరిశోధనలవైపు ఆకర్షించేందుకు రామానుజం ఫెలోషిప్స్, ఇతర కొత్త ఫెలోషిప్స్ అందుబాటులోకి తేవడం కూడా శాస్త్రీయ సలహా మండలి సూచనలతోనే. సైన్స్‌పై యువతలో అంతగా ఆసక్తి పెరగట్లేదు. దీనిపై మీ అభిప్రాయం? నిజమే. గత కొన్నేళ్లుగా యువతలో సైన్స్ అంటే ఆసక్తి సన్నగిల్లుతున్న మాట వాస్తవమే! దీనికి సహచరులు, సమాజం కూడా కారణం. సైన్స్‌ను గౌరవించాలి. చక్కటి పనితీరు ప్రదర్శించే యువ శాస్త్రవేత్తలు కచ్చితంగా అద్భుత అవకాశాలు అందుకుంటారు. ఈ క్రమంలో గత రెండు మూడేళ్లుగా చేపడుతున్న చర్యల ఫలితంగా పరిస్థితి కొంత ఆశాజనకంగా మారుతోంది. పరిశోధనల విషయంలో ప్రైవేటు సంస్థలు చొరవ చూపాలని మీరు అన్నారు. ఇది సాధ్యమేనా? వాస్తవానికి మన దేశంలో సైన్స్ రంగం అభివృద్ధి అంతా ప్రభుత్వం మద్దతుతో సాగుతోంది. కానీ అమెరికాలో, జపాన్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రైవేటు సంస్థలు కూడా చొరవ చూపడానికి ఇదే సరైన సమయం. అప్పుడే.. ఇతర దేశాల్లో మాదిరిగా.. సైన్స్ పరిశోధనల కోసం జీడీపీలో 2 నుంచి 3 శాతం కేటాయింపులను ఆశించేందుకు వీలవుతుంది. దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అభివృద్ధి దిశగా మీ సలహా? సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల అభివృద్ధికి మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలి. తద్వారా రానున్న 15- 20 ఏళ్లలో దేశం గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని అభిలషిస్తున్నాను. నేటి యువత చక్కటి అవకాశాలు అందుకునేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి. ఇందుకోసం ఎంతో ముందస్తు ప్రణాళిక అవసరం. వాస్తవానికి.. ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం తగినన్ని మెరుగైన ఇన్స్టిట్యూట్లు ప్రస్తుతం మన దేశంలో లేవు. వీటిని ఏర్పాటు చేసి.. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల పట్ల ఆసక్తి కలిగేలా చేయాలి. విద్యార్థులు కూడా సైన్స్ పట్ల ఆసక్తి చూపాలి. ఇదే నా సలహా!! -
సీఎన్ఆర్ రావుకూ భారతరత్న
రసాయన శాస్త్ర దిగ్గజం రావు న్యూఢిల్లీ: రసాయన శాస్త్రంలో ఎనలేని కృషి చేసిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్రరావు (79)కు కూడా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో పాటు భారతరత్న అవార్డు దక్కింది. ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో ఈ మేరకు ప్రకటించింది. ఐదేళ్ల విరామం తర్వాత భారతరత్న పురస్కారాలను ప్రకటించారు. చివరిసారిగా 2008లో పండిట్ భీమ్సేన్ జోిఫీకి ఈ అవార్డు దక్కింది. సర్ సి.వి.రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంటున్న మూడో శాస్త్రవేత్త రావు. కర్ణాటకకు చెందిన ఆయనకు ఘన స్థితి, నిర్మాణ, పదార్థ రసాయన శాస్త్రాల్లో దిగ్గజంగా అంతర్జాతీయంగా ఎనలేని పేరు ప్రఖ్యాతులున్నాయి. ప్రధాని శాస్త్ర సలహా మండలి సారథి అయిన రావు 1,400కు పైగా పరిశోధన పత్రాలు సమర్పించడమే గాక 45 పుస్తకాలు కూడా రచించారు. ఎన్నో ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది మొదట్లోనే చైనా తన అత్యున్నత శాస్త్ర పురస్కారంతో రావును గౌరవించింది. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. దాదాపుగా ప్రపంచంలోని ప్రతిష్టాత్మక సైంటిఫిక్ అకాడమీలన్నీ సభ్యత్వం, ఫెలోషిప్ వంటివాటితో రావును సత్కరించాయి. నానో మెటీరియల్స్, గ్రాఫీన్‌లపై రెండు దశాబ్దాలుగా రావు విసృ్తత పరిశోధనలు చేస్తున్నారు. ఆయనకు భారతరత్న ప్రకటించడాన్ని శాస్త్ర, సాంకేతిక రంగ ప్రముఖులంతా ముక్తకంఠంతో స్వాగతించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకోనున్న సీఎన్ఆర్ రావు రసాయన శాస్త్రంలో చేసే కృషిని క్రికెట్లో సచిన్ సాధించిన ఘనతలతో పోల్చవచ్చని ఆ రంగ ప్రముఖులు చెబుతుంటారు! రసాయన శాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు కొలమానంగా చెప్పే హెచ్-ఇండెక్స్‌లో గత ఏప్రిల్‌లో ఆయన 100 పాయింట్లకు చేరుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా రికార్డు సృష్టించారు. ఐదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిశోధన ప్రస్థానం ఆయనది. 1934 జూన్ 30న బెంగళూరులో జన్మించిన రావు మైసూరు విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, 1953లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి స్నాతకోత్తర విద్య అభ్యసించారు. అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఐఐటీ కాన్పూర్‌లో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా 13 ఏళ్లు పని చేశారు. 1984లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. నానో టెక్నాలజీపై ఆయన రాసిన పుస్తకం సామాన్యులు కూడా ఆ శాస్త్రాన్ని సులువుగా అర్థం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మరక కూడా... అయితే రెండేళ్ల క్రితం ప్రొఫెసర్ రావుపై గ్రంథ చౌర్యం ఆరోపణలు వచ్చాయి. అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనే ప్రఖ్యాత జర్నల్‌కు పంపిన పరిశోధన పత్రంలో ఇతర శాస్త్రవేత్తల పుస్తకాల్లోని కొన్ని భాగాలను ఎత్తి రాశారన్న ఆరోపణలపై సదరు జర్నల్‌కు ఆయన క్షమాపణలు చెప్పడమే గాక ఆ పత్రాన్ని వెనక్కు తీసుకునేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఐఐఎస్సీలోని తమ పీహెచ్డీ విద్యార్థి వాటిని పరిశోధన పత్రంలో చొప్పించారని పరిశోధన పత్రం రచనలో రావుతో పాలుపంచుకున్న మరో శాస్త్రవేత్త అనంతరం ప్రకటించారు. నా దేశం నన్ను గుర్తించింది: రావు సాక్షి ప్రతినిధి, బెంగళూరు: భారతరత్న పురస్కారం దక్కడం పట్ల ఆనందంతో పాటు ఆశ్చర్యానికి కూడా లోనయ్యానని ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు అన్నారు. ‘‘నా దేశం నన్ను గుర్తించింది. ఎల్లప్పుడూ దేశానికి రుణపడి ఉంటాను. నా భార్య, పిల్లలు, విద్యార్థులకు రుణపడి ఉంటాను. ఇది విజ్ఞానానికి లభించిన గుర్తింపు’ అని పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ రావుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. భారతదేశానికి, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆయన ఎంతో చేశారన్నారు. ప్రొఫెసర్ రావు చేసిన పరిశోధనలు, ఆయన బోధన నైపుణ్యం పలు తరాలను ప్రగాఢంగా ప్రభావితం చేశాయంటూ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి కొనియాడారు. సీఎన్ఆర్ రావుకు జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావుకు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. సీసీఎంబీ డెరైక్టర్ అభినందనలు ఇండియన్ సైన్స్ రంగానికి మార్గనిర్దేశకత్వం వహిస్తూ కృషి చేస్తున్న ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు భారతరత్న ప్రకటించడం సంతోషదాయకమని హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరె క్టర్ సీహెచ్ మోహన్ రావు పేర్కొన్నారు. రసాయన శాస్త్రంలో రాసిన పుస్తకాల ద్వారా విద్యార్థులకు ఆయన సుపరిచితులన్నారు.