breaking news
Child laborers
-
చెత్తకుప్పల నుంచి చదువులమ్మ ఒడికి..
హనుమకొండ: చెత్త ఏరే చిట్టిచేతులు నోట్‌బుక్స్ పట్టాయి. చెదిరిన నెత్తి, చిరిగిన బట్టలతో ఉండే పిల్లలు శుభ్రంగా తయారై బడిబాట పట్టారు. 11 మంది బాలలు చెత్తకుప్పలను వీడి చదువులమ్మ ఒడికి చేరుకున్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చెత్త ఏరుకునే బాలలతోపాటు తల్లిదండ్రులను పిలిపించారు. చదువు ప్రాముఖ్యత గురించి వారికి అవగాహన, చైతన్యం కల్పించారు. దీంతో పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. వెంటనే జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీనును పిలిపించి 11 మంది బాల కార్మికులను గురుకులాల్లో చేర్చించారు. పిల్లలకు నోట్‌బుక్స్ అందించారు. బాలలకు, తల్లిదండ్రులకు వినయ్‌భాస్కర్ భోజనం వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. -
పలకాబలపం వదిలి.. పలుగూపారా..
జెనీవా: కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు విలవిల్లాడుతు న్నారు. కడుపు నింపుకునే మార్గం లేక పలక బలపం బదులుగా పలుగు పార చేతపడుతున్నారు. ఫ్యాక్టరీల్లో చేరుతూ బాల కార్మికులుగా మారుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య చాలా తగ్గుముఖం పట్టింది. కానీ కోవిడ్ మహమ్మారి,లాక్డౌన్ కారణంగా వారి సంఖ్య పెరిగిపోతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో), ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ అధ్యయనంలో తేలింది. కోవిడ్ కారణంగా ఈ ఒక్క ఏడాదే ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకి పడిపోయారు. దీంతో ఆ కుటుంబాలన్నీ తమ పిల్లల్ని బలవంతంగా పనుల్లో పెడుతున్నారు. ఐఎల్వో ప్రకారం పేదరికం ఒక్క శాతం పెరిగితే, బాలకార్మికులు 0.7% పెరుగుతారు. భారత్‌లో 20% డ్రాపవుట్లు కరోనా వైరస్ బట్టబయలు కాక ముందే భారత్‌లో 5.6 కోట్ల మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారు. వారిలో 1.1 కోట్ల మంది వరకు వ్యవసాయ క్షేత్రంలోనూ, ఫ్యాక్టరీల్లోనూ పనిచేస్తున్నారు. ఇక కరోనా వైరస్ సోకిన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైందని మొదటిసారి బడిలోకి చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గి పోతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన బాలల హక్కుల కార్యకర్త రమ్య సుబ్రమణియన్ వెల్లడించారు. ఇళ్లల్లోనే ఉంటూ అగ్గిపెట్టెల తయారీ, ఇళ్లల్లో పనికి కుదురుతూ ఉండడంతో కరోనా సంక్షోభ సమయంలో కొత్తగా ఎందరు స్కూలు డ్రాపవుట్లు ఉన్నారో కచ్చితమైన సంఖ్య చెప్పడం కష్టమని ఆమె చెప్పారు. ప్రతీ అయిదుగురిలో ఒక విద్యార్థి స్కూలు నుంచి డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. పూర్తి స్థాయిలో మార్కెట్ పుంజుకొని నిర్మాణ రంగం, రైల్వేలు ఇతర ఫ్యాక్టరీలు తెరుచుకుంటే భారత్‌లో దాదాపుగా 20% డ్రాపవుట్లు పెరుగుతాయని ఆ అధ్యయనం వెల్లడించింది. -
గడప దాటిస్తున్న భయం
రాష్ట్రంలో ఏటా మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రేమ వ్యవహారాలు, కుటుంబ తగాదాలు, చదువంటే అయిష్టత–భయం, అనారోగ్య సమస్యలు ఇల్లు వదలడానికి పురిగొలుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 8,410 మంది కనిపించకుండా పోగా,ఈ ఏడాది ఇప్పటివరకు 7,509 మంది కనిపించకుండాపోయారు. ఈ ఏడాది మిస్సింగ్ కేసుల్లో 3,382 మంది పిల్లలుండటం సమస్య తీవ్రతను సూచిస్తోంది. వీరిలోనూ 1,008 మంది పిల్లలు అపహరణకు గురికావడం అందరిలోనూ తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. మిస్సింగ్ కేసుల్లో రాజధాని నగరం విజయవాడ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. సాక్షి, అమరావతి: ఏదో ఒక భయమే వారిని ఇంటి గడప దాటేలా చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక కారణంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీరి కుటుంబసభ్యుల్లో కొందరు మాత్రమే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలినవారు పరువు పోతుందనే భయం, ఇతర కారణాలతో పోలీసుల దృష్టికి తేవడం లేదు. పోలీసు రికార్డుల ప్రకారం.. ఏటా దాదాపు ఎనిమిది వేల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ప్రేమ వ్యవహారాలు, చదువంటే భయం, కుటుంబ వివాదాలు, అనారోగ్యమే కారణమంటున్నారు.. పోలీసులు. మిస్సింగ్ కేసుల్లో కొన్ని కిడ్నాప్ కేసులూ ఉంటున్నాయి. బలవంతపు వ్యభిచారానికి, బాల కార్మికులుగా, యాచకులుగా మార్చేందుకు నేరగాళ్లు పంజా విసురుతున్నారని చెబుతున్నారు. గతేడాది 8,410 మంది మిస్సింగ్ గతేడాది 8,410 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 7,509 మంది కనిపించకుండా పోయారు. ఈ ఏడాది కనిపించకుండా పోయినవారిలో 5,044 మంది తిరిగి ఇంటికి చేరారు. మిగిలినవారి ఆచూకీ లేదు. గతేడాది 1,025 మంది పిల్లలు కిడ్నాప్‌కు గురికాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 1,008 మంది పిల్లలు కిడ్నాప్ అయ్యారు. కనిపించకుండాపోయినవారు, తిరిగొచ్చినవారిలో ఏకంగా 3,382 మంది పిల్లలు ఉండటం విస్మయపరుస్తోంది. పోలీసుల కార్యాచరణ ఇలా..: ఇంటి నుంచి వెళ్లిపోవడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలపై యువతీయువకులు, విద్యార్థులకు కాలేజీలు, సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కాలేజీలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, చిన్నారులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉండే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు, అనుమానితులపై నిఘా పెంచడం వంటి చర్యలతో మిస్సింగ్ కేసులకు చెక్ పెట్టాలని భావిస్తోంది. -
ఇక్కడ అడుగుకో ‘అంజలి’!
♦ స్పిన్నింగ్ మిల్లుల్లో అంజలిలాంటి మరెందరో బాలకార్మికులు ♦ ‘ఆపరేషన్ స్మైల్-2’ పేరిట అధికారుల దాడులు ♦ శుక్రవారం.. ఒక్క షిప్ట్ తనిఖీలోనే 40 మంది బాలలు ♦ శనివారం మరో 21 మంది బాల కార్మికుల గుర్తింపు ♦ నామమాత్రపు వేతనాలతో కార్మికుల అవస్థలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అక్కడ పనిచేసే కార్మికులకు పని బాధ్యత లే తప్ప.. వారికున్న హక్కులేంటో తెలియవు. కష్టం వస్తే ఎవరికి చెప్పాలో.. ఎవరు తీరుస్తారో ఇప్పటికీ తెలియదు. వారికి తెలిసిందల్లా యాజమాన్యం చెప్పినట్లు 8 నుంచి 9 గంటలు నిరాటంకంగా శారీరక శ్రమ చేయడమే. బతుకు దెరువు కోసమని రాష్ట్రాలు దాటి వచ్చిన ఈ కార్మికుల పట్ల పాలమూరు జిల్లాలోని పలు స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాయి. చేతినిండా పని ఉన్నా.. కడుపు నిండే కూలి రాకపోవడంతో ఆయా స్పిన్నింగ్ మిల్లుల్లో దినసరి వేతనంతో పనిచేస్తున్న కార్మికుల జీవనం దుర్భరంగా మారిపోయింది. ముక్కుపచ్చలారని చిన్నారులతో నిత్యం స్పిన్నింగ్ మిల్లులో పత్తి నుంచి దారంతీసే పనిని యథేచ్ఛగా చేయించుకుంటున్నారు. బాల కార్మికులెందరో.. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, ఆమన్‌గల్, బాలానగర్, షాద్‌నగర్, అడ్డాకుల, మిడ్జిల్ తదితర ప్రాంతాల్లో ఉన్న స్పిన్నింగ్ మిల్లుల్లో అనేకమంది బాలకార్మికులు పనిచేస్తున్నట్లు కార్మికశాఖ అధికారుల బృందం శుక్రవారం ‘ఆపరేషన్ స్మైల్-2’ పేరిట చేసిన ఆకస్మిక దాడుల్లో గుర్తించారు. ఆమనగల్లు, కల్వకుర్తి పట్టణాల్లోని సూర్యలక్ష్మి, సూర్యలత కాటన్ మిల్లులో పనిచేస్తున్న 40 మందిని గుర్తించిన స్మైల్ టీం సభ్యులు మహబూబ్‌నగర్‌లోని బాలసదన్‌కు తరలించారు. అలాగే, శనివారం మిడ్జిల్ మండల పరిధిలోని ఊర్కొండపేట్లో ఉన్న సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో స్మైల్ టీం సభ్యులు తనిఖీలు జరిపి మరో 21 మంది బాల కార్మికులను గుర్తించారు. రోజుకు మూడు షిఫ్టులుగా నడిచే ఈ మిల్లుల్లో ఒక షిఫ్ట్‌లో పనిచేసే బాలకార్మికుల కష్టాలే కార్మికశాఖ అధికారుల దృష్టికి వచ్చాయని, అంజలిలాంటి వారు ఇంకా అనేక మంది దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నారని అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ‘సాక్షి’ పత్రికలో కథనం వచ్చేంత వరకు స్పిన్నింగ్ మిల్లుల్లో బాల్యం మసివారుతున్న తీరుపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అయితే చిన్నారి అంజలి తనను బలవంతంగా అమన్‌గల్‌లోని స్పిన్నిం గ్ మిల్లులో అమ్మ పనికి పెట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేసి చదువు పట్ల తనకున్న ఆకాంక్ష తెలియజేయడంతో స్పిన్నింగ్ మిల్లులో మగ్గుతున్న బాలల వేదన వెలుగులోకి వచ్చింది. తక్కువ జీతం.. ఎక్కువ పనిచేస్తారని.. తక్కువ వేతనానికి ఎక్కువ పనిచేస్తారన్న విశ్వాసంతో అనేక స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఒడిశా, శ్రీకాకుళం, ఛత్తీస్‌గఢ్ నుంచి కార్మికులను తీసుకొస్తున్నారు. వారికి మిల్లు పరిసరాల్లోనే నివాసం ఏర్పాటుచేస్తున్నారు. వారి ఇళ్లు కూడా పిచ్చుక గూళ్లను తలపించేవిగా ఉన్నాయి. ఒక్కొక్క స్పిన్నింగ్ మిల్లులో 500 నుంచి 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కల్వకుర్తిలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్, ఆమన్‌గల్ సూర్యలక్ష్మి కాటన్‌మిల్లు, మిడ్జిల్‌లోని సూర్యలత స్పిన్నింగ్ మిల్లు, అడ్డాకులలోని ప్రగతి, శ్రీవాస స్పిన్నింగ్ మిల్లుల్లో 20, 25 ఏళ్లుగా కార్మికులుగా పనిచేస్తున్నా.. ఇంకా పర్మనెంట్ చేయలేదు. మిల్లుల్లో జరుగుతున్న తంతు ఇదీ.. మిల్లులో పనిచేసే వారికి మొదట చేరినప్పుడు ఇచ్చే రోజువారీ కూలీని సకాలంలో పెంచడం లేదు. స్కిల్డ్, అన్‌స్కిల్డ్ లేబర్‌కు వేతనాల్లో పెద్దగా తేడా లేదు. జిల్లాలోని రెండు మిల్లుల్లో ఒడిశా కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారు జీతాలను పెంచాలని పెద్దగా డిమాండ్ చేయకపోవడంతో యాజమాన్యాలు వారికే అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నాయి. మిల్లుల వద్ద కార్మిక సంఘాలు ఏర్పాటు చేయాలని ఎవరైనా కార్మికులు ప్రయత్నిస్తే వెంటనే వారిని తొలగిస్తున్నారు. దీనివల్ల ఇతర కార్మికులు సంఘాల జోలికి వెళ్లడం లేదు. మిల్లులో ఇచ్చే కూలిని బయటకు చెప్పడానికి కార్మికులు భయపడే పరిస్థితులున్నాయి. ప్రధాన కార్మిక సంఘాలు కూడా మిల్లుల్లో తమ సంఘం కార్యవర్గం ఏర్పాటు చేసుకోలేకపోతుండటంతో కార్మికుల పక్షాన యాజమాన్యాలను నిలదీసే వారు లేరు. సంఘాలు ఏర్పాటైతే కార్మికుల జీతాలు, ఇతర సౌకర్యాలను పెంచాలని అడిగే అవకాశం ఉన్నందున అవి ఏర్పాటు కాకుండా యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి. జిల్లాలో కేవలం కల్వకుర్తిలోని సూర్యలత కాటన్ మిల్లులో మాత్రమే కార్మిక సంఘం ఉన్నట్లు తెలిసింది. సంక్షేమానికి చెల్లుచీటీ.. రోగాలపాలైన కార్మికులు స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు దుమ్ము, ధూళి వల్ల దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. కొన్ని స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యాలైతే.. అనేక మంది కార్మికులకు పీఎఫ్‌ను సైతం అమలు చేయడం లేదు. ఇదేమని అడిగితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఇటువంటి సౌకర్యాలకు ఆసక్తి కనబర్చరని.. మొత్తం వేతనం ఇవ్వమంటారంటూ కుంటి సాకులు చెబుతుండడం విశేషం. రోజంతా కష్టపడినా నెలకు ఒక్కో కార్మికుడికి గిట్టుబాటయ్యేది రూ. 6 వేల నుంచి రూ.7 వేలు మాత్రమే. ఏ ఒక్క రోజు డ్యూటీకి హాజరుకాకపోయినా ఆ రోజు వేతనంలో కోత పడాల్సిందే. నెలసరి సెలవులు, ఈఎల్, సీఎల్ వంటి లీవుల సౌకర్యాలు మిల్లులో పనిచేసే పర్మనెంట్ కార్మికులకు వర్తిం చాల్సి ఉన్నా ఆయా మిల్లుల్లో వాటి ఊసే కనపడడం లేదు. మిల్లుల్లో జరిగే వ్యవహారాలు బయటకు పొక్కినా దానికి కార్మికులను బలిపశువులుగా చేయడం వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం, వేధించడం ఈ ప్రాంత మిల్లు యజమానులకు పరిపాటిగా మారిందని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంజలిని చదివించేందుకు సిద్ధం: కలెక్టర్ చదువుపై ఆసక్తి ఉన్న అంజలిని చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. అంజలిపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించారు. ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. బాలకార్మికులతో పనిచేయించుకుంటున్న స్పిన్నింగ్ మిల్లులపై తక్షణమే విచారణ చేపడతామని, బాలకార్మికులు ఉన్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై జిల్లావ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిర్వహస్తామన్నారు. 9 ఏళ్ల నుంచి చేస్తున్నా జీతం రూ. 7 వేలే.. తొమ్మిదేళ్ల నుంచి స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నా. వేతనం రూ.7 వేలు వస్తుంది. నెలకు 26 రోజులు కచ్చితంగా పనిచేయాల్సిందే. పీఎఫ్ నెలకు రూ.700 కట్ చేస్తున్నారు. ఆ జీతంతో కుటుంబం గడవటం కష్టంగా ఉంది. వేతనాలు పెంచితే మాకు బాగుంటుంది. - సుల్తానా బేగం, కార్మికురాలు, కల్వకుర్తి రెండు నెలలే పనిచేయాల్సి వచ్చింది నేను బాలానగర్ నుంచి స్పిన్నింగ్ మిల్లులో పనిచేయడానికి రోజూ వస్తుంటా. మూడేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. గతేడాది ఆరు నెలలు పనిచేశాను. ప్రస్తుతం పత్తి దిగుబడి తక్కువగా ఉండడంతో రెండు నెలలు మాత్రమే పని ఉంటుందని యజమానులు తెలుపుతున్నారు. మాకు సరిపడా పని ఇవ్వాలి. అలాగే, కూలీ తక్కువగా ఉండటంతో కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది. -నిర్మల, రోజు కూలీ, షాద్‌నగర్ రోజూ రూ. 225 ఇస్తున్నారు రెండేళ్లుగా ఇదే స్పిన్నింగ్ మిల్లో రోజు కూలీగా పనిచేస్తున్నాను. సంవత్సరంలో ఆరు నెలలు పని దొరుకుతుంది. మొదటి సంవత్సరం రోజుకు రూ.180, రెండో సంవత్సరం రోజుకు రూ.190, ప్రస్తుతం రోజుకు రూ.225 ఇస్తూ స్పిన్నింగ్మిల్కు వచ్చిపోవడానికి ఆటోను ఏర్పాటు చేశారు. అదనపు గంటలు పనిచేస్తే భోజనం పెట్టి, మరో రూ.10 ఇస్తున్నారు. కూలి పెంచితే సంతోషిస్తాం. -సంతోష, రోజు కూలీ, బాలానగర్