breaking news
Chennai IT Raids
-
భారీగా బయటపడుతున్న బంగారం
-
భారీగా బయటపడుతున్న బంగారం
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడు, ఆయనచేతే టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమితుడైన వ్యాపారవేత్త జె. శేఖర్ రెడ్డి ఇంట్లో భారీగా కొత్త కరెన్సీ, బంగారం బయటపడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. చెన్నైలోని శేఖర్‌రెడ్డి సహా నలుగురు తెలుగు వ్యాపారవేత్తలకు చెందిన ఆరు ఇళ్లు, రెండు ఆఫీసుల్లో ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) తనిఖీలు జరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ఒక వైపు ఏపీ సీఎం చంద్రబాబు నగదు రహిత వ్యవస్థపై ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీకీ నేతృత్వం వహిస్తుండగా.. ఆయన ఆప్తుల ఇండ్లల్లో ‘నల్ల’సోమ్ము వెలుగులోకి వస్తుండటం గమనార్హం. ఇప్పటివరకుఆయా నివాస స్థలాల నుంచి రూ. 106.52 కోట్ల నగదు(ఇందులో రూ. 9.63 కోట్ల విలువైన కొత్త రెండు వేల రూపాయల నోట్లు ఉండగా, 96.89 కోట్ల పాత పెద్ద నోట్లు ఉన్నాయి)తోపాటు రూ. 36.29 కోట్ల విలువ చేసే 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. అప్రకటిత ఆస్తులకు సంబంధించిన మరికొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నామని, సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలోనే సంచలనం పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము ఇదేనని ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. మొత్తం రూ.142 కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ మొత్తం డబ్బు, బంగారం అంతా తనదేనని శేఖర్‌రెడ్డి చెబుతున్నాడని ఐటీశాఖ పేర్కొంది. ఇదంతా తన ఆస్తులేనని శేఖర్‌రెడ్డి చెబుతున్నా.. వీటికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని ఐటీశాఖ నిర్ధారించింది. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన శేఖర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ సభ్యుడిగానేకాక తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేతగానూ కొనసాగుతున్నారు. ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తోన్న శేఖర్ రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లోకి సులువుగా వెళ్లగలిగే అతికొద్ది మందిలో ఒకరని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. శేఖర్ రెడ్డి తమిళనాడులో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేపట్టినట్టు తెలుస్తోంది. -
కోట్లకు కోట్లు పట్టుబడుతున్న కొత్త కరెన్సీ
కొత్త నోట్ల కోసం ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద రాత్రింబవళ్లు వేచిచూస్తున్న సాధారణ ప్రజానీకానికేమో నగదు దొరకడం లేదు గానీ.. కొంతమంది దగ్గరైతే ఏకంగా కోట్లకు కోట్లు కొత్త కరెన్సీ నోట్లు బయటపడుతున్నాయి. పాత నోట్ల రద్దు అనంతరం జరిగిన పరిణామాలతో కొత్త కరెన్సీ నోట్ల జారీలో పలు అక్రమాలు జరిగినట్టు సీబీఐ విచారణ, ఐటీ తనిఖీల్లో వెల్లడవుతోంది. శుక్రవారం చెన్నైలో జరిగిన ఐటీ రైడ్స్‌లో పాత కరెన్సీ నోట్లు రూ.96.89 కోట్లు పట్టుబడగా.. కొత్త రూ.2000 కరెన్సీ నోట్లు రూ.9.63 కోట్లు బయటపడ్డాయి. ఈ నోట్లను ఆర్థికమంత్రిత్వ శాఖ రికవరీ చేసుకుంది. చెన్నైలోనే నిన్న జరిగిన ఐటీ దాడుల్లో రూ.36.29 కోట్ల విలువైన సుమారు 127 కేజీల బంగారాన్ని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. బంగారంతో పాటు రూ.70 కోట్ల కొత్త రూ.2వేల నోట్లను ఆర్థికమంత్రిత్వశాఖ స్వాధీనం చేసుకుంది. చెన్నై నగరంలో మొత్తం 8 చోట్ల ఏకకాలంలో నిన్న ఐటీ దాడులు నిర్వహించింది. వీటిలో ఇంకా నాలుగు ప్రాంతాల్లో ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు సూరత్‌లో రూ.76 లక్షల కొత్త కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. మహారాష్ట్ర రిజిస్ట్రర్డ్ హోండా సిటీ కారులో కొత్త రూ.2000నోట్లు 3,800 నోట్లను పట్టుకెళ్తుండగా పోలీసులు అడ్డగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురిని సూరత్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. ఇటు కర్ణాటకలోనూ ఆదాయపు పన్ను డిపార్ట్మెంట్ ముమ్మరంగా దాడులు నిర్వహిస్తోంది. హుబ్లీలో ఉన్న హ్యాండ్లూమ్ సెంటర్ అండ్ జువెల్లరీ స్టోర్‌లో ఐటీ దాడి చేసింది.