breaking news
chemical poisons
-
ఉక్రెయిన్‌లోని రష్యా సైనికులపై విష ప్రయోగం!
మాస్కో: గత ఏడు నెలలుగా ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు. ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో రసాయన విష ప్రయోగం జరగటం వల్ల ఉక్రెయిన్‌లోని తమ సైనికులు ఆసుపత్రుల పాలైనట్లు ఆరోపించింది రష్యా రక్షణ శాఖ. ‘బోటులినమ్ టాక్సిన్ టైప్ బీ’ అనే సేంద్రియ విషం నమూనాలను సైనికుల్లో గుర్తించినట్లు పేర్కొంది. కీవ్ కెమికల్ టెర్రరిజానికి పాల్పడుతోందని ఆరోపించింది. ‘జులై 31న జపోరోఝీ ప్రాంతంలోని వసిలియేవ్కా గ్రామం సమీపంలోని రష్యా సైనికులు తీవ్ర విష ప్రయోగంతో ఆసుపత్రుల పాలయ్యారు. రష్యా సైనికులు, పౌరులపై జెలెన్స్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెర్రరిస్టులు విషంతో నిండిన వాటితో దాడులకు పాల్పడుతున్నారు.’ అని పేర్కొంది రష్యా రక్షణ శాఖ. సైనికులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైన క్రమంలో వారి నుంచి సేకరించిన విష నమూనాలను అంతర్జాతీయ ‘రసాయన ఆయుధాల నిషేధ సంస్థ’(ఓపీసీడబ్ల్యూ)కు పంపించేందుకు సిద్ధమవుతోంది రష్యా. బోటులినమ్ టాక్సిన్ అనేది సైన్స్‌లో అత్యంత విషపూరితమైనదిగా గుర్తింపు పొందినట్లు పేర్కొంది మాస్కో. దీనిని క్లోస్ట్రిడియమ్ బోటులినియమ్ బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి చేస్తారని, ఇది ఎసిటైల్కోలిన్ న్యూరోట్రాన్స్మిటర్ విడుదలను అడ్డుకుంటుందని తెలిపింది. దాని ద్వారా కండరాల పక్షవాతం వస్తుందని స్పష్టం చేసింది. ‘బోటులినమ్ టాక్సిన్ టైప్ ఏ’ను కొన్నేళ్ల క్రితం కండరాల సమస్యల చికిత్స ఔషధాల్లో ఉపయోగించేవారు. దీనిని కాస్మెటోలజీలో బొటాక్స్గా పిలిచేవారు. అయితే, బోటులినమ్ టాక్సిన్ సులభంగా ఉత్పత్తి చేయటం, సరఫరా చేయటం వల్ల దానిని జీవ ఆయుధంగా ఉపయోగించే ప్రమాదం అధికంగా ఉంది. దీనిని ప్రయోగిస్తే మరణాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ విష ప్రయోగం బారినపడిన వారు దీర్ఘకాలం పాటు ఐసీయూలో చికిత్స తీసుకుంటేనే ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇదీ చదవండి: పుతిన్‌కు షాక్.. బాంబు దాడిలో ఉక్రెయిన్ యుద్ధ వ్యూహకర్త కుమార్తె దుర్మరణం! -
నేల తల్లి వైద్యుడు నటరాజన్
విష రసాయనాల చెర నుంచి నేల తల్లికి విముక్తి కల్పించేందుకు నడుంకట్టిన వైద్యుడాయన. సత్తువ కోల్పోయిన సూక్ష్మజీవులకు సజీవ శక్తిని నింపిన శక్తి ప్రదాత. గుక్కపట్టిన పుడమి కల్మషం లేని పసిపాపలా నవ్వుతోందంటే అది ఆ వైద్యుని చలవే. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులకు ప్రాణశక్తిని ఇచ్చేది పంచగవ్యమని రైతులకు నచ్చ జెప్పి, ఒప్పించి, మెప్పించి విశ్వవ్యాప్తం చేయటంలో ఆయన కృషి భగీరథుని తలపిస్తే, తను మూడు సంవత్సరాలు పగలూ, రేయనకా కష్టపడి సంపాదించిన జ్ఞానంపై పేటెంట్ కూడా పొందకుండా రైతులకు అందించిన వైనం పురాణాల్లో దధీచిని తలపిస్తుంది. పంచగవ్యకు రైతులోకంలో వేదంలా గౌరవం కల్పించిన వ్యక్తి తమిళనాడులోని కోడుమూడికి చెందిన డా. కె. నటరాజన్. ఎంబీబీఎస్ చేసి వైద్యవృత్తిలో స్థిరపడిన నటరాజన్ యాదృచ్ఛికంగా జరిగిన ఓ ఘటనతో పంచగవ్య తయారీ, దాన్ని ప్రచారం చేసే పనిని తన కర్తవ్యంగా ఎంచుకున్నారు. పదిహేనేళ్ల క్రితం మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆయన కోడిమూడిలోని శివాలయానికి వెళ్లారు. పూజాకార్యక్రమం పూర్తయ్యాక ప్రసాదంగా పంచగవ్యను ఇవ్వటం అక్కడి సంప్రదాయం. పంచగవ్యను ప్రసాదంగా ఇవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలేమిటని నటరాజన్ పూజారిని ప్రశ్నించారు. పూజారి పంచగవ్యతో జీవరాశులకు కలిగే ప్రయోజనాలు, మొక్కలపై అది చూపే ప్రభావాన్ని నటరాజన్‌కు వివరించారు. ఇదంతా విన్న నటరాజన్‌కు ఆ క్షణంలో అదే తన జీవిత లక్ష్యంగా, భగవంతుడే తనకు కర్తవ్యాన్ని బోధిస్తున్న భావన కలిగింది. తన జీవిత పరమార్థం దానితోనే ముడిపడి ఉన్నట్టు ఆయనకు అనిపించింది. ఒక వైద్యుడిగా ప్రస్తుతం జరుగుతున్న అనారోగ్యకర పరిణామాల పట్ల అవగాహన ఉన్న ఆయనకు ఈ ప్రక్రియ సరైన పరిష్కారంగా అనిపించింది. అలా ఆయన పంచగవ్య గురించి తెలుసుకొని రైతులకు ఉపయోగపడేలా దాన్ని అందించాలని నిశ్చయించుకున్నారు. మూడేళ్ల శోధన.. పంచగవ్యకు సంబంధించిన వివరాల కోసం నటరాజన్ వేదాల ను శోధించి సమాచారాన్ని సేకరించారు. రకరకాల నిష్పత్తుల్లో వివిధ రకాల పదార్థాలను కలపి ద్రావణాన్ని తయారు చేయటం. తయారుచేసిన ద్రావణాన్ని రైతులకు ఇచ్చిపంటలపై పిచికారీ చేయించటం, వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకొని కొన్ని పదార్థాలను కలపటం, మరి కొన్నింటిని తొలగించటం, వాటిని కలిపే నిష్పత్తుల్లో మార్పులు, చేర్పులు చేయటం, ఇలా రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు. ప్రతి రోజూ పరిశోధనలతోనే గడిచింది. మూడేళ్ల శ్రమ తరువాత పంచగవ్య వెలుగులోకొచ్చింది. నిర్ణీత ప్రమాణాలతో దానికి తుదిరూపునిచ్చారు. దీన్ని వినియోగించడంతో అన్ని పంటల్లోనూ మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు వచ్చి చెబుతుండటంతో దీనిపై మరింత నమ్మకం కలిగింది. విస్తృత ప్రచారం, ఉచిత శిక్షణా తరగతులు పంచగవ్యను తయారు చేసింది మొదలు, శరవేగంతో దాని ప్రయోజనాలను రైతుల్లోకి తీసుకెళ్లారు నటరాజన్. పంచగవ్య వాడటం వల్ల కలిగే లాభాల గురించి రైతుల మనస్సుల్లో బలంగా నాటుకునేలా ప్రచారం చేశారు. ఉచిత శిక్ష ణా తరగతులు నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. ఖండాంతరాల నుంచి శిక్షణ కోసం.. ఒక్క భారతదేశంలోని రైతులే గాక, విదేశాల నుంచి సైతం వచ్చి పంచగవ్య తయారీ, వాడే పద్ధతులపై నటరాజన్ వద్ద శిక్షణ పొందుతున్నారు. క్యూబా, మలేషియా, అమెరికా, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల నుంచి వస్తున్నారు. పంచగవ్య తయారీ వెనుక ఆయన కృషిని ఎవరైనా ప్రశంసిస్తే తను నిమిత్త మాత్రుడనని, పంచగవ్యకు సంబంధించిన సమాచారమంతా వేదాల్లోనే ఉందని ఎంతో వినయంగా చెబుతారాయన. పంచగవ్య అనేది ఒక అద్భుత సంపద. తరగని గని. ఎవరైనా, ఎంతైనా ఉపయోగించుకోవచ్చు అంటారాయన. పంచగవ్యను చాలా తక్కువ ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చని, సొంత ఆవులుంటే ఈ ఖర్చు మరింత తగ్గుతుందని అంటారాయన. రైతులు మరింత సమయం కేటాయించి, శ్రద్ధతో పంచగవ్యను తయారుచేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతార ని నటరాజన్ సూచిస్తున్నారు. పంటలపై పిచికారీ ఇలా.. వంద లీటర్ల నీటికి మూడు లీటర్ల పంచగవ్యను కలిపి పంటలపై పిచికారీ చేయాలి. పిచికారీకి ముందు ద్రావణాన్ని వడకట్టాలి. సాగు నీటి ద్వారానూ పంచగవ్యను పంటలకు అందించవచ్చు. తడులు ఇచ్చేటప్పుడు నీటివెంట ఎకరాకు 20 లీటర్ల పంచగవ్యను అందించాలి. డ్రిప్ ద్వారాను పంచగవ్యను అందించవచ్చు. విత్తనాలకు పంచగవ్యను పట్టించి విత్తుకోవచ్చు. పంచగవ్యతో నాణ్యమైన పండ్ల దిగుబడి దీన్ని పిచికారీ చేయటం వల్ల పంటల్లో పూత బాగా వస్తుంది.. ఉద్యాన పంటల్లో దీనిని పిచికారీ చేస్తే పండ్ల రసాలు మంచి రుచిగా ఉండటమే కాక నిల్వ ఉండే కాలం పదిరోజులు వరకూ పెరిగింది. మామిడి తోటల్లో పూత బాగా రావటంతోపాటు పండ్ల నిల్వ కాలం పెరిగింది. రుచి కూడా ఎక్కువ రోజుల పాటు నిలిచి ఉన్నట్టు రైతులు గుర్తించారు. సువాసన దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటుంది. పంచగవ్య మొక్కల పెరుగుదలకు ఉపయోగపడటమే కాక మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రకృతి వ్యవసాయంలోనే కాక రసాయన సేద్యం చేస్తున్న పొలాల్లో పంచగవ్యను క్రిమిసంహారిణిగా వాడుతుండటం విశేషం. పంచగవ్య తయారీ, శిక్షణ, మార్కెటింగ్ వివరాలకోసం డా.కె.నటరాజన్ (+91 94433 58379)ను సంప్రదించవచ్చు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ పంచగవ్య తయారీకి కావలసిన పదార్థాలు.. తాజా ఆవు పేడ - 5 కిలోలు ఆవు మూత్రం - 3 లీటర్లు ఆవు పాలు - 2 లీటర్లు ఆవు నెయ్యి - 1/2 కేజీ ఆవు పెరుగు - 2 లీటర్లు చెరకు రసం - 3 లీటర్లు లేత కొబ్బరి నీళ్లు - 3 లీటర్లు పండిన అరటి పండ్లు - 12 కల్లు లేదా ద్రాక్షరసం - 2 లీటర్లు పంచగవ్య తయారీ ఇలా.. పంచగవ్య తయారీకి ఒక కుండ, ప్లాస్టిక్ క్యాన్ లేదా కాంక్రీట్‌తో కట్టిన తొట్టెను కాని ఉపయోగించాలి. లోహపు పాత్రలు వాడకూడదు. మొదట తాజా ఆవుపేడను కుండలో వేయాలి. దానిపై ఆవునెయ్యిని వేయాలి. మూడు రోజుల పాటు రోజుకు రెండు సార్లు కలియబెట్టాలి. నాలుగో రోజు మిగిలిన పదార్థాలను ఈ మిశ్రమానికి కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పదిహేను రోజుల పాటు, రోజూ రెండుసార్లు కలియబెట్టాలి. కుండపైన మూత ఉంచి వ్యాధికారక శిలీంధ్రాలు ఆశించకుండా కాపాడాలి.