breaking news
Chemical liquid
-
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ..
సాక్షి, నల్గొండ: అధికారుల ఉదాసీన వైఖరిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సంపాదనే ధ్యేయంగా తాగే నీటి నుంచి పాలు, అల్లం తదితర నిత్యావసరాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బీబీనగర్ మండలం హైదరాబాద్ దగ్గరగా ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ పదార్థాలను మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లతో పాటు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. దీంతో బీబీనగర్ మండలం రోజురోజుకు కల్తీకి కేరాఫ్‌గా మారుతోంది. భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో కల్తీ పాల తయారీ ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ.. గతంలో మండలంలోని బీబీనగర్, జైనపల్లి, కొండమడుగు గ్రామాల్లోని కొందరు అక్రమార్కులు పొలాల్లో చల్లే యూరియా వాడి పాలను కల్తీ చేసేవారు. ఇప్పుడు ఏకంగా మనుషుల శవాలను భద్రపరిచేందుకు వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను కలుపుతుండటాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తాజాగా మండలంలోని మొబైల్ టెస్టింగ్ వ్యాన్‌తో చేపట్టిన తనిఖీల్లో బయటపడింది. కొండమడుగు గ్రామంలోని ఓ పాల వ్యాపారి తన పాల సేకరణ సెంటర్లో పాలు పగలకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా మార్చురీల్లో మృతదేహాలు కుళ్లిపోకుండా వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను వాడుతున్నట్లు తేలింది. దాంతో పాటు పాలల్లో నీళ్లతో పాటు సుక్రోజ్, అమ్మోనియం సల్ఫేట్‌ను కలిపి అధికంగా పాలను తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చదవండి: మలక్‌పేట్‌లో బాలింతల మృతిపై ప్రాథమిక నివేదిక.. కారణాలివే.. నెమురుగొముల పరిధిలో బయటపడిన కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ (ఫైల్) అల్లం, నీళ్ల బాటిళ్లు సైతం పాల కల్తీతో పాటు కూరల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ సైతం కల్తీ చేసి విక్రయించడాన్ని గతంలో నెమురగొముల గ్రామ పరిధిలో పోలీసులు గుర్తించారు. కుళ్లిపోయిన అల్లం, ఎల్లిగడ్డలను మిషన్లలో వేసి అది పాడవకుండా పేస్ట్‌లో కెమికల్‌ను వాడుతున్నట్లు తేలింది. అలాగే బీబీనగర్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు విక్రయించే వాటర్ బాటిళ్ల విషయంలో చిరు వ్యాపారులు కల్తీకి పూనుకున్నారు. కిన్లీ, బిస్లరీ స్లిక్కర్లతో కూడిన వాటర్ బాటిళ్లను సేకరించి వాటిలో మామూలు వాటర్‌ను నింపి విక్రయించారు. ఈ విషయాన్ని పోలీసులు గతంలో వెలుగులోకి తెచ్చారు. ఇలా మండలంలో ఒకదాని తర్వాత మరొకటి కల్తీ వ్యాపారం బయటపడుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కల్తీ జరగకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న బాటిళ్లలో మామూలు వాటర్‌ను నింపి అమ్ముతున్న అక్రమార్కులు (ఫైల్) తనిఖీలు ముమ్మరం చేస్తాం గ్రామాల్లో పాల కల్తీకి పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు తనిఖీలను ముమ్మరం చేస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కల్తీ పాలు తయారు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయిస్తాం. పాలు, ఇతర ఫుడ్ తయారీకి సంబంధించిన విషయాల్లో అనుమానం వస్తే మాకు సమాచారం ఇవ్వాలి. – జ్యోతిర్మయి, జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
ఇలాచేస్తే.. వారం రోజులు మాంసం తాజాగా ఉంటుంది
చండీగఢ్: మేక, గొర్రెను కోసిన తర్వాత దాని మాంసం ఆరు గంటలు మాత్రమే బయటి వాతావరణంలో తాజాగా ఉంటుంది. దాన్నే ఫ్రిజ్‌లో భద్రపరిస్తే రెండు రోజులపాటు తాజాగా ఉంటుంది. ఆ తర్వాత కుళ్లిపోతుంది. రెండు రోజులకన్నా ఎక్కువ సేపు మాంసాన్ని భద్రపర్చాలంటే దానికి రసాయనాలను పూయక తప్పదు. రసాయనాల మిశ్రమం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. ఎలాంటి రసాయనాలు పూయకుండా మరి ఎక్కువ రోజులపాటు మాంసాన్ని భద్రపర్చాలంటే ఏం చేయాలి? సరిగ్గా ఇదే దిశగా హర్యానాలోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు చెందిన జంతు ఉత్పత్తుల విభాగం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి విజయం సాధించారు. మాంసాన్ని పొరలుగా కట్‌చేసి దానిమ్మ తొక్క నుంచి తీసిన యాంటీఆక్సిడెంట్లను ఎక్కిస్తే ఆ మాంసం ఫ్రిజ్‌లో పెట్టకపోయినా మామాలు ఇంటి ఉష్ణోగ్రతలో వారం రోజులపాటు తాజాగా ఉంటుందని తేలింది. బ్యాక్టీరియాను సమర్థంగా ఎదుర్కొనే ఫ్లవొనాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు దానిమ్మ తొక్కలో ఉంటాయి. దానిమ్మ తొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పటికే పరిశోధకులు కనిపెట్టారు. దానిమ్మ తొక్క పొడిని ఔషధంగా వాడినట్లయితే మధుమేహాన్ని నియంత్రించవచ్చని, గుండె జబ్బులను, కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న డీఆర్డీవో శాస్త్రవేత్తలు సరిహద్దు ప్రాంతాల్లో, మంచు పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు తాజా మాంసాన్ని చేరేవేసే ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సాధారణంగా సైనిక బేస్ క్యాంపులకు చేరేవేసే మాంసాహారం దూరప్రాంతాల్లో ఉన్న సైనికుల వద్దకు చేరేసరికి మూడు, నాలుగు రోజులు గడిచి చెడిపోతోంది. ఒక్క గొర్రె, మేక మేంసాన్ని తాజాగా ఉంచేందుకే కాకుండా కోడి, పంది మాంసాన్ని తాజాగా ఉంచేందుకు కూడా దానిమ్మ పండు తొక్కలు ఉపయోగపడతాయని వారు తెలియజేశారు.