breaking news
chalamasetti
-
‘నువ్వు మా పాలేరువి రా’
రామవరప్పాడు: ‘ఒరేయ్.. తోలు తీస్తా, నువ్వు ఎవడవిరా మాకు చెప్పడానికి.. ఉద్యోగం నుంచి తీయించేస్తా, మా కింద పాలేరువి’ అంటూ జనసేన నేత చలమలశెట్టి రమేష్ ఎనికేపాడు పంచాయతీ కార్యదర్శి విద్యాధర్‌ను బూతులు తిట్టడం తీవ్ర దుమారం రేపింది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు శివాలయం పల్లాల్లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా, మహత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణలో మంగళవారం జనసేన నాయకులు రణరంగం సృష్టించారు. ఈ విగ్రహాల ఆవిష్కరణకు హాజరైన చలమలశెట్టి రమేష్ రంకెలేస్తూ వీధి గూండా మాదిరి పంచాయతీ కార్యదర్శిని బూతులు తిట్టి, కాలర్ పట్టుకుని తొయ్యడం కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై ఈ రీతిగా చేయడాన్ని పలువురు గ్రామస్తులు ప్రశ్నించడంతో గొడవ కాస్తా పెద్దదైంది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల జనసేన పారీ్టలో చేరిన గ్రామానికి చెందిన టంకసాల సుబ్బారావు, ఆయన కుమారుడు ఉపసర్పంచ్ టంకసాల శివ ప్రసాద్ వంగవీటి మోహన్ రంగా, గాంధీ విగ్రహాల ఏర్పాటుకు పూనుకున్నారు. బీసీ నాయకుడైన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని జనసేన మండల నాయకుడు పొదిలి దుర్గారావు సూచించారు. అయితే టంకసాల సుబ్బారావు, టంకసాల శివప్రసాద్‌లు ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి రంగా, గాంధీ విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ఈ విగ్రహాల ఆవిష్కరణకు నియోజకవర్గ జనసేన నేత చలమలశెట్టి రమేష్‌ను ఆహ్వనించారు. గ్రామంలోని జనసేన నాయకులకు గాని, పక్క గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలకు గాని సమాచారం ఇవ్వకుండా ఆవిష్కరణ పూర్తి చేశారు. దీనిని జనసేన పార్టీలోని మరో వర్గం ప్రశ్నించడంతో ఘర్షణ ప్రారంభమైంది. రెండు వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ తీవ్ర స్థాయిలో తోసుకున్నారు. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ ఘటనా స్థలానికి చేరుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించగా.. రెచ్చిపోయిన చలమలశెట్టి రమేష్ కార్యదర్శిపై విరుచుకుపడ్డారు. షర్టు కాలర్ పట్టుకొని దుర్భాషలాడారు. బుజ్జగిస్తున్న కూటమి నాయకులు గ్రామస్తుల మధ్య ప్రభుత్వ ఉద్యోగికి తీవ్ర అవమానం జరగడంతో కార్యదర్శి విద్యాధర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కూటమి నాయకులు కలుగజేసుకుని బుజ్జగిస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కేసుల వరకూ వెళ్ల వద్దని సముదాయించారు. దీంతో తనపై జరిగిన దాడిని వివరిస్తూ మండలాధికారులకు విద్యాధర్ ఫిర్యాదు చేశారు. -
ఏరీ... ఎక్కడ!
ప్రజా ప్రతినిధి అంటే ఓడినా, గెలిచినా నిత్యం ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. గెలిస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఓటర్ల మన్ననలు అందుకోవాలి. ఓడితే ఆ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాసటగా నిలవాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులుగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మాగంటి రూప, గంటి హరీష్‌ల జాడే కానరాకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): అధికారం ఉంటే హల్చల్ చేస్తారు. ఆ అధికారం దూరమైతే ఆచూకీలేకుండా పోతారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు హడావుడి... తెలుగుదేశం పార్టీ నేతల తీరు ఇదీ అని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాల నుంచి పోటీచేసి ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ అభ్యర్థుల ఆచూకీ కోసం ఆయా నియోజకవర్గ ప్రజలు భూతద్దాలు పెట్టి వెతికినా కనిపించడంలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనాన్ని సృష్టించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటిపోయింది. ఇన్ని నెలలయినా టీడీపీ నుంచి పోటీ చేసిన ముగ్గురు పార్లమెంటు అభ్యర్థుల జాడ పార్టీ కార్యక్రమాల్లో లేకుండా పోయింది. మురళీ రాగం ఏమైంది...? మూడు నెలల కిందట ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్లమెంటు స్థానాల నుంచి టీడీపీ ఓటమిని మూటగట్టుకుంది. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థులు మాగంటి రూప, చలమలశెట్టి సునీల్, గంటి హరీష్ మాధుర్ ఎన్నికలైపోయాక నియోజకవర్గాన్నే మరచిపోయారు. సినీ నటుడు మాగంటి మురళీమోహన్ రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ కావాలని కలలుగని తొలిసారి 2009లో పోటీచేసి మహానేత వైఎస్ గాలిలో ఓటమి చవిచూశారు. అప్పుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై పోటీచేసి ఓడిపోయిన మురళీమోహన్ ఆ తరువాత సేవా కార్యక్రమాలతో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతూండే వారు. తరువాత 2014లో పోటీచేసి ఎంపీ కావాలనే కలను మురళీమోహన్ సాకారం చేసుకున్నారు. ఎంపీ అయ్యాక కోడలు రూపను వెంట తిప్పుకుంటూ తన రాజకీయ వారసురాలుగా ఎంపీకి పోటీ చేస్తారనే సంకేతాల్లో పంపించారు. ఆ క్రమంలోనే గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీగా కోడలు రూప బరిలోకి దిగగా వైఎస్సార్సీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్ చేతిలో లక్షపై చిలుకు ఓట్ల తేడాతో ఘెర పరాజయాన్ని మూటగట్టుకోక తప్పింది కాదు. అప్పటి నుంచి మామ, కోడలు జనానికి దూరమయ్యారు. స్థానికత్వం కోసం రాజమహేంద్రవరం వెంకటేశ్వరనగర్‌లో మురళీమోహన్ సొంత ఇల్లు కూడా నిర్మించుకున్నారు. ఈ నెలాఖరుకు రాజమహేంద్రవరంలోని ఇంటిని కూడా ఖాళీచేసి రాజకీయాలకు ప్యాకప్ చెప్పేందుకు సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇంటి వద్ద పనిచేస్తున్న సిబ్బందికి నెలాఖరు వరకూ మాత్రమే పని ఉంటుందని, ఆ తరువాత ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పేశారంటున్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని మురళీమోహన్ చెప్పిన మాటలు ఏమయ్యాయని పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది. గంటి హరీష్దీ అదే దుస్థితి అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓటమిచెందిన గంటి హరీష్ మాధుర్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగికి ఉన్న పేరు, ప్రతిష్టలు, బాలయోగి వారసుడిగా సానుభూతి కలిసి వస్తుందని అతని కుమారుడు మాధుర్‌ను టీడీపీ బరిలోకి దింపింది. బాలయోగిపై ఉన్న సానుభూతితో గెలుపు ఖాయమనే అతి విశ్వాసానికి పోయిన ఆ పార్టీ ఫలితాల్లో బోర్లాపండింది. ఓటమి తరువాత మాధుర్ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అమలాపురం నల్లవంతెనకు సమీపాన ఇల్లును అద్దెకు తీసుకుని స్థానికంగా ఉంటామని ఎన్నికలప్పుడు నమ్మకాన్నికలిగించే ప్రయత్నం చేశారు. తీరా ఓడిపోయాక గడచిన మూడు నెలల్లో పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు లేవు. బాలయోగి వారసుడిగా పార్టీకి ఓ ఊపు వస్తుందనుకున్న అధిష్టానం అంచనాలు తలకిందులయ్యాయి. సునీల్ సీను అంతే... జిల్లా కేంద్రం కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి మూడోసారి ఓటమి తరువాత చలమలశెట్టి సునీల్ ఎక్కడున్నాడో పార్టీ శ్రేణులకు కూడా తెలియడం లేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014 వైఎస్సార్సీపీ, 2019లో టీడీపీ...ఇలా మూడు ఎన్నికలు ... మూడు పార్టీలన్నట్టుగా పోటీచేసిన సునీల్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినా మూడు ఎన్నికల్లో వరుస ఓటముల తరువాత పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించే సాహసం చేయలేకపోతున్నారంటున్నారు. వాస్తవానికి సునీల్ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ కాకినాడ ఎల్బీ నగర్లో పెద్ద బిల్డింగ్ అద్దెకు తీసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించే వారు. అటువంటి భవనం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఎన్నికల ముందు రావడం ... ఓటమి తరువాత కనిపించకుండా పోవడం షరామామూలేనని అంటున్నారు. ఇలా ముగ్గురు టీడీపీ పార్లమెంటు అభ్యర్థులు జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. ఇటీవల చంద్రబాబు కాకినాడలో పార్టీ జిల్లా సమీక్షా సమావేశానికి వచ్చినప్పుడు మురళీమోహన్, రూప, సునీల్ మొహం చాటేశారు. ఎటొచ్చీ హరీష్‌మాధుర్ ఆ ఒక్క రోజు మాత్రమే వచ్చి ఆ తరువాత జిల్లాలో కనిపించలేదు. ఇలా ఓటమి తరువాత పార్లమెంటు నియోజకవర్గాన్ని విడిచిపెట్టిపోయే నేతల తీరును క్యాడర్ ఏవగించుకుంటోంది. -
కాపు నేతలను విమర్శించే స్థాయి ‘చలమలశెట్టి’కి లేదు
కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా అమలాపురం టౌన్: రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ్యకు కాపు నేతలైన ముద్రగడ పద్మనాభం, చిరంజీవి, దాసరి నారాయణరావును విమర్శించే స్థాయి లేదని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆ పదవి చేపట్టే వరకూ కూడా కాపులన్న సంగతి రాష్ట్రంలోని కాపులకే తెలియదని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఇటీవల తరచూ ముద్రగడను విమర్శిస్తూ, కాపు జాతిని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజప్ప మాట్లాడితే కాపులపై కేసులు, జైళ్లూ అంటున్నారని, తనకు అంతట పదవి ఇచ్చిన వారి మెప్పు కోసం ఆయన అంతలా మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వానికి కాపులు బుద్ధి చెప్పే రోజు రాక మానదనిహెచ్చరించారు.