breaking news
Chaganti Koteswara
-
కల్యాణ శ్రీనివాసం
అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం విశాఖపట్నం: విశాఖ తిరుమలైంది. బంగాళాఖాతం పాలకడలిగా మారింది. స్వర్ణభారతి స్టేడియం సకల దేవతలకు నెలవైంది. ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా విష్వక్సేనా ఆరాధనోత్సవంతో కల్యాణం ప్రారంభమైంది. శ్రీవారి నైద్యాధిపతి విష్వక్సేనుల ఆరాధన చేశారు. అనంతరం అంకురారోపణ కార్యక్రమం జరిగింది. స్వామివారి అత్యంత సన్నిహితుడు, సేవకుడు మన విన్నపాలని స్వామివారికి హనిస్సు రూపంలో చేర్చడానికి అగ్ని కార్యం జరిపారు. సామూహిక సంకల్పం జరిపారు. అనంతరం స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్లు వామహస్తానికి కంకణధారణ చేశారు. తరువాత గోత్ర ప్రవరలు తెలిపారు. శ్రీదేవి, భూదేవిల గోత్ర నామాలు చెప్పిన అనంతరం మహా సంకల్పం చేశారు. స్వామివారిని నూతన వస్త్రధారణతో అలంకరించారు. అయ్యవారికి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం పెట్టిన తరువాత కల్యాణం వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా స్టేడియం గోవింద నామాలతో దద్దరిల్లింది. కల్యాణం అనంతరం భక్తులు క్యూలో ఉండి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదనరావు, డా.జయంతి సావిత్రి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు భక్తులకు అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఎం.జి.గోపాల్, ఎస్.ఓ. రఘనాథ్, ప్రధాన అర్చకుడు గురురాజ్, చాగంటి కోటేశ్వరరావు, అన్నదానం డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఉత్సవాల ఇన్చార్జ్ సురేంద్రరెడ్డి, సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు. భక్తుల పరమానందం విశాఖపట్నం: శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు భక్తుల కనులపండువలా సాగుతున్నాయి. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈనెల 23 నుంచి ప్రారంభమైన వైభవోత్సవాలకు ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులు ఇక్కడే వీక్షిస్తున్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతం,7 గంటలకు తోమాలసేవ, కొలువు, అర్చన, 8 గంటలకు నివేదన, శాత్తుమొర, 8.30 గంటలకు భక్తులచే సామూహిక సహస్రనామ తులసి అర్చన, 10 గంటలకు రెండో నివేదన, 10 గంటల తరువాత భక్తులకు వీలుగా సర్వదర్శనం, సాయంకాలం సహస్ర దీపాలంకరణసేవ, 6 గంటలకు కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు,7.30 గంటలకు రాత్రి కైంకర్యం, 8.30 గంటలకు స్వామివారికి ఏకాంత సేవ జరిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. ఎటువైపు చూసినా భక్తులతో స్టేడియం జనసంద్రంగా మారింది. స్వామివారి కల్యాణం చూడడానికి సుమారు 25 వేల మంది భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. భక్తి ప్రపత్తులతో వెంకన్న కల్యాణం వీక్షించారు. నేటి సేవ విశేషపూజ.. తిరుమలలో ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు జరిగే ప్రధాన సేవ విశేషపూజ. ఈ సేవలో సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి,భూదేవి సమేతంగా మలయప్ప స్వామికి జరుగుతుంది. ఈసేవ 1991 ఏప్రిల్ 8 నుంచి ప్రారంభించారు. తరువాత కాలంలో అర్జిత సేవగా రూపుదిద్దుకుంది. శ్రీవారి అలయం లో రెండవ అర్చన, రెండు నైవేద్యం తర్వాత దేవేరులతో కూడి శ్రీమలయ్యప్పస్వామి కల్యాణమండపానికి వేంచేస్తారు. వైఖానసాగమ శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహిస్తారు. తరువాత శ్రీస్వామివారలకు (స్నపన) తిరుమంజనం నిర్వహిస్తారు. -
శ్రీవారి సేవ మహద్భాగ్యం
ఎంవీపీకాలనీ : శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యసేవల్లో పాల్గొనడం మహద్భాగ్యమని రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్డేడియంలో బుధవారం టీటీడీ నిర్వహించే వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు-2014, టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి సేవ టోకెన్‌ను ఆయన అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించే స్వామి నిత్య సేవల్లో విశాఖ వాసులు పాల్గొనాలని కోరారు. ఎంవీపీకాలనీలోని ఉన్న టీటీడీ కల్యాణ మండపానికి అధ్యాత్మిక కేంద్రంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు సూచించారు. టీటీడీ జేఈవో పొలా భాస్కరరావు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 29 వరకు తొలిసారిగా విశాఖలో వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు జరుపుతున్నామన్నారు. తొలి రెండు రోజులు చాగంటి కోటేశ్వరరావుచే తిరుమల వైభవంపై ప్రవచనాలు ఉంటాయన్నారు. 23 నుంచి 29 వరకు స్వామికి నిత్య కైంకర్యాలు వ్యాఖ్యాన సహితంగా జరుగుతాయని తెలిపారు. సుమారు ఎనిమిది వేల మందికి సేవలో పాల్గొనేందుకు ఉచితంగా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సేవల టోకెన్లు ఇస్తారన్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో ముగుస్తుందన్నారు. చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ విశాఖలో టీటీడీ అధికారులు విశాఖలో వేంకటేశ్వరుని వైభవోత్సవాలు జరపడం విశాఖ ప్రజ లకు వరం అన్నారు. ఆరోగ్యం, ఆర్థిక కారణాలతో శ్రీవారిని దర్శించుకోలేని వారికి ఇక్కడే ఆ భాగ్యం దక్కుతుందని చెప్పారు. కార్యక్రమం లో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జీవి యంసీ సీఈ బి.జయరామిరెడ్డి, టీటీడీ స్పెషలాఫీసర్ రఘనాథ్, సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు.