breaking news
cellkon
-
సెల్కాన్ 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.1,349
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్టెల్ ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ పేరుతో 4జీ మార్కెట్లో జోరు పెంచింది. తాజాగా సెల్‌కాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని రూ.1,349కే స్మార్ట్‌ఫోన్‌ను బండిల్ ఆఫర్లో తీసుకొచ్చింది. ఇటీవలే కార్బన్ మొబైల్స్‌తో కలిసి రూ.1,399లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. పోటీ కంపెనీలకు చెక్ పెట్టేందుకు ఫీచర్ ఫోన్ ధరలో 4జీ స్మార్ట్ఫోన్లను ఎయిర్టెల్ ప్రవేశపెడుతోంది. ఫీచర్ ఫోన్లకు బదులుగా కస్టమర్లు స్మార్ట్ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారని భారతి ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో వెంకటేశ్ విజయరాఘవన్ సోమవారమిక్కడ మీడియాకు చెప్పారు. మొబైల్స్ తయారీలో ఉన్న ఇతర కంపెనీలతో కూడా ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. బండిల్ ఆఫర్ ఇదీ.. మార్కెట్లో సెల్కాన్ స్మార్ట్ 4జీ హ్యాండ్సెట్ ధర రూ.3,500 ఉంది. బండిల్ ఆఫర్ కింద కస్టమర్లు రూ.2,849 చెల్లించాలి. రూ.169 ప్లాన్‌ను ఎంచుకుని 36 నెలలు రీచార్జ్ చేసుకోవాలి. 18 నెలల తర్వాత 500 రూపాయలు, 36 నెలలు పూర్తి కాగానే రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఇస్తారు. దీంతో హ్యాండ్సెట్ కోసం కస్టమర్ చెల్లించే మొత్తం రూ.1,349 అవుతుంది. రూ.169 ప్లాన్ కింద ప్రతి రోజు 500 ఎంబీ 4జీ డేటా అందుకోవచ్చు. లోకల్, ఎస్టీడీ కాల్స్ రోజుకు 300 నిమిషాలు లేదా వారానికి 1,200 నిమిషాలు ఉచితం. ఎయిర్టెల్ పాత కస్టమర్లు సైతం ఈ ఫోన్‌ను కొనుక్కుని ఆఫర్ పొందవచ్చు. రూ.169 ప్లాన్ వద్దనుకునేవారు మొదటి 18 నెలల్లో రూ.3,000 విలువైన మొత్తాన్ని రీచార్జ్ చేసుకుంటే రూ.500, ఆ తర్వాతి 18 నెలల్లో రూ.3,000 రీచార్జ్ చేస్తే రూ.1,000 రిఫండ్ చేస్తారు. సెల్కాన్ స్మార్ట్ 4జీ.. స్మార్ట్ 4జీ 4 అంగుళాల ఫుల్ టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3.2 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. మై ఎయిర్టెల్ యాప్, ఎయిర్టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ యాప్స్ లోడ్ అయి ఉన్నాయి. రెండు నెలల్లో 5 లక్షల హ్యాండ్సెట్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. ఫీచర్ ఫోన్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవడానికి ఈ ధర కలిసి వస్తుందని చెప్పారు. -
'తిరుపతిని డిజిటల్ హబ్‌గా మార్చుతాం'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం సమీపంలో సెల్కాన్ మొబైల్ కంపెనీకి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెల్కాన్ కంపెనీ ద్వారా యువతకు వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రత్యక్షంగా 20 వేల ఉద్యోగాలు, పరోక్షంగా 40 వేల ఉద్యోగాల వరకు అందనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తిరుపతిని డిజిటల్ హబ్‌గా మార్చనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రానికి త్వరలో మరిన్ని హార్డ్‌వేర్ కంపెనీలు రానున్నాయని తెలిపారు.