breaking news
cattle killed
-
తెగిపడ్డ విద్యుత్ వైర్లు.. మూగజీవాలు మృతి
బొమ్మలరామారం: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. జిల్లాలోని బొమ్మల రామారం మండలం బండకాడిపల్లి గ్రామ శివారులో సోమవారం ఉదయం అకస్మాత్తుగా 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. దీన్ని స్థానికులు గమనించకపోవడంతో.. అటుగా వెళ్లిన 8 గేదెలు, ఒక ఆవు, రెండు నక్కలు మృతి చెందాయి. పశువులు మృతి తో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేసి మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు. -
విజృంభిస్తున్న గాలికుంటు వ్యాధి
2,185 పశువులు మృత్యువాత = 19 జిల్లాల్లోని 1,368 గ్రామాల్లో వ్యాధి లక్షణాలు = మొద్దు నిద్ర వీడని ప్రభుత్వం = పశు సంవర్ధక శాఖలో సిబ్బంది కొరత = పాడి రైతులు లబోదిబో = తొలుత చింతామణి తాలూకాలో వ్యాధి గుర్తింపు = రైతుల్లో అవగాహన లేమి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న గాలికుంటు వ్యాధి పశు సంపదను కబళిస్తోంది. పోలియో చుక్కల్లాగా దీనికీ వ్యాధి నిరోధక చుక్కలున్నప్పటికీ పశు సంవర్ధక శాఖలో సిబ్బంది కొరత వల్ల ఈ కార్యక్రమం చురుకుగా సాగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య కేంద్రాలున్నప్పటికీ వైద్యులు, కంపౌండర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 2,500 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం వ్యాధి తీవ్రత లేని జిల్లాల సిబ్బందిని వ్యాధి పీడిత జిల్లాలకు తరలించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా గాలికుంటు వ్యాధి లక్షణాలు లేవు. 2010 నుంచి చుక్కల మందుల ద్వారా దీనిని అదుపులో ఉంచుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వ్యాధి వ్యాపించి ఉండవచ్చని పశు సంవర్ధక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. తొలుత చిక్కబళ్లాపురం జిల్లా చింతామణిలో ఈ వ్యాధి బయటపడింది. తర్వాత కోలారు జిల్లా నుంచి 19 జిల్లాల్లోని 1,368 గ్రామాలకు వ్యాపించింది. సెప్టెంబరు ఒకటి నుంచి ఇప్పటి దాకా సుమారు 17,500 పశువులకు వ్యాధి సోకింది. వీటిలో 2,185 మరణించాయి. దాదాపు 20 రోజులుగా దీనిపై పత్రికల్లో పుంఖాను పంఖాలుగా కథనాలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల కిందట పశు సంవర్ధక శాఖ మంత్రి టీబీ. జయచంద్ర దీనిపై అధికారులతో సమీక్షించి, నిపుణల కమిటీని నియమించారు. రోగానికి మూల కారణాలను తెలుసుకుని, పరిష్కార మార్గాలను సూచిస్తూ నివేదికను సమర్పించాల్సిందిగా కమిటీ సభ్యులను కోరారు. రైతుల్లో అవగాహనా రాహిత్యం వ్యాధి పీడిత పశువులకు ఏ విధంగా చికిత్సలు చేయించాలనే అవగాహన రైతుల్లో కొరవడింది. వ్యాధి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి యుద్ధ ప్రాతిపదికన చుక్కల మందులు వేయించాలి. ఈ చుక్క లమందును కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రాష్ట్రం పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మరో వైపు చుక్కల మందు వేయిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందని రైతుల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. చుక్కల మందు వేసిన తర్వాత రెండు రోజుల పాటు పశువులకు జ్వరం వస్తుంది. దాని వల్ల ఆహారం తీసుకోవు. దరిమిలా పాల దిగుబడి తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల చాలా మంది రైతులు మందు వేయించడానికి ముందుకు రాకుండా, ఆఖరికి పశు సంపదనే పోగొట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు చిక్కబళ్లాపురం జిల్లాలో 215, రామనగరలో 664, కోలారులో 512, మండ్యలో 325, తుమకూరు, చామరాజ నగర జిల్లాల్లో చెరో 50, బెంగళూరు నగరంలో 94 పశువులు మృత్యు వాత పడ్డాయి. రోగ లక్షణాలు పశువుల నోటి నుంచి జొల్లు కారడం. నోరు, నాలుక, దవడలపై పుండ్లు ఏర్పడడం. కాలి గిట్టల మధ్య పుండ్లు రావడం. మేతను నిరాకరించడం. పాల దిగుబడి తగ్గడం. దీనిని నివారించడానికి వ్యాధి పీడిత పశువులను వేరుగా ఉంచాలి. వెంటనే చుక్కల మందు వేయించాలి. వ్యాధి పీడిత పశువుకు వేసిన గడ్డిని ఇతర పశువులకు వేయకూడదు. వాటికి ప్రత్యేక పాత్రల్లోనే కుడితి లేదా నీరు ఇవ్వాలి. వ్యాధి నివారణకు నోటిలోని పుండ్లను గ్లిసరిన్తో శుభ్రం చేయాలి. రోజూ యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు ఇవ్వాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్నే ఇవ్వాలి. ముఖ్యంగా అరటి పండ్లు, రాగి అంబలి ఇస్తూ ఉండాలి.