breaking news
Caste validation
-
పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి
ఎంపీ గీత కుల ధ్రువీకరణపై హైకోర్టు ఆదేశం.. సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత కుల ధ్రువీకరణ అంశంలో హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కొత్తపల్లి గీతతోపాటు ఏపీ గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎన్నికల కమిషన్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గీత ఎస్టీ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో అరకు నుంచి ఎంపీగా గెలుపొందారని, ఈ కారణంగా ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈ.ఆంజనేయులు, మరొకరు గతేడాది నవంబర్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బుధవారం విచారించింది. పిటీషినర్ల తరుఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ చేసిన వాదనలు విన్న ధర్మాసనం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. -
సబ్‌కలెక్టర్ మెడకు కుల ధ్రువీకరణ వివాదం ?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కుల ధ్రువీకరణ అంశం ఐఏఎస్ అధికారిణిని ఇబ్బందుల్లోకి నెట్టనుందా? సాలూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్పీ భంజ్‌దేవ్ గిరిజన కులస్తుడేనంటూ జారీ చేసిన ధ్రువీకరణ పత్రంతో పార్వతీపురం సబ్ కలెక్టర్ చిక్కుల్లో పడ్డారా? భంజ్‌దేవ్ కొండదొర అంటూ ఆగమేఘాలపై ధ్రువీకరించి వివాదంలో ఇరుక్కున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. గవర్నర్ హౌస్ నుంచి వచ్చిన విచారణ ఆదేశాలు అందుకు ఊతమిస్తున్నాయి. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజ్‌దేవ్ గిరిజనుడు కాదని 2006 మార్చి 10న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై భంజ్‌దేవ్ స్టే కోరినా కోర్టు తిరస్కరించింది. దీంతో భజంద్దేవ్కు మంజూరు చేసిన ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దుచేయాలని ఏపీ గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, న్యాయవాది రేగు మహేశ్వరరావు.. కలెక్టర్, సబ్కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే ప్రభుత్వ మెమో ద్వారా సాలూరు తహశీల్దారుతో దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. భంజ్‌దేవ్, అతని కుటుంబంపై విచారణ చేసి ఇతను గిరిజన కులానికి చెందని వారని సాలూరు తహశీల్దారు నిర్ధారించి, డాక్యుమెంట్లతో సహా సబ్‌కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆప్పటి ఆర్డీఓ స్వయంగా విచారణ చేసి భంజ్‌దేవ్ క్షత్రియుడని నిర్ధారించినట్టు తెలిసింది. అయితే పెండింగ్‌లో ఉన్న భంజ్‌దేవ్ కుల వివాదం ఇటీవల ఎన్నికల ముందు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ ఏడాది మార్చి 29న ఆర్పీ భంజ్ దేవ్ గిరిజనుడేనంటూ పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి తనంతట తానుగా ఆదేశాలు జారీ చేయడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఇదే వివాదంపై మళ్లీ రేగు మహేశ్వరరావు గవర్నర్, రాష్ట్రపతిని కలసి కుల వివాదాన్ని వివరించారు. ఇప్పుడు దానిని గవర్నర్ పరిశీలించి విచారణకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఆరోపణలు నిజమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతుగా విచారణ జరిపి వాస్తవాలు బయటకు లాగితే, పిటీషనర్ల ఆరోపణలు నిజమైతే సబ్ కలెక్టర్ ఇబ్బందుల్లో పడతారన్న వాదన విన్పిస్తోంది. -
కులధ్రువీకరణకు మార్గదర్శకాలు
జారీ చేసిన తెలంగాణ సర్కార్ హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పుట్టినతేదీ, స్థానికత, కులధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీచేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మార్గదర్శకాలనే తెలంగాణకు అన్వయించింది. ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి టి. రాధ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న చోట తెలంగాణ రాష్ట్రం అని ప్రభుత్వం మార్చింది. ఎస్టీలకు మాత్రం ప్రస్తుతం ఉన్న తరహాలోనే తండ్రితో పాటు తాత ధ్రువీకరణను కూడా నిర్ధారించాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్నట్టు ఎస్సీ, ఎస్టీ వర్గాల కింద ఏయే కులా లు వస్తాయనే జాబితాను ఇచ్చింది. అదేవిధంగా సాంఘిక సంక్షేమం ఉన్నచోట షెడ్యూల్ కులాల అభివృద్ధి అని మార్చింది. రాష్ట్రస్థాయిలో స్క్రూ టినీ, రివ్యూకమిటీ చైర్మన్‌గా షెడ్యూల్డ్‌కులాల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి / కార్యదర్శి వ్యవహరిస్తారు. సభ్యులుగా గిరిజన, బీసీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు, షెడ్యూల్డ్ కులాలు, తరగతుల, బీసీ సంక్షేమ శాఖల కమిషనర్లు, సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి/జాయింట్ సెక్రటరీ/ డిప్యూటీ సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా రెవెన్యూ అధికారి మెంబర్ సెక్రటరీగా, షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన బీసీ సంక్షేమ డిప్యూటీ డెరైక్టర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, పౌరహక్కుల పరిరక్షణ/ విజిలెన్స్సెల్లకు చెందిన అధికారి, షెడ్యూల్ కులాల/ గిరిజన సంక్షేమ కమిషనరేట్లలో పరిశోధనాసంస్థ అధికారి సభ్యులుగా ఉంటారు. బీసీలకు సంబంధించి ఏబీసీడీ గ్రూపులకు మండల పరిధిలో ఎమ్మార్వోలు, ఎస్సీలలో ఆది ఆంధ్ర, ఆదిద్రావిడ, అరుంధతీయ, దోమ్, దొంబర, పైడి, పానో, మాదిగ, మాల, మాలదాసరి, మాలదాసు, మాలసాలె, నేత్కాని, మన్నె, పంచమ, పరియా, రెల్లి కులాలకు సంబంధించి మండల పరిధిలో ఎమ్మార్వోలు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇంకా ఎస్సీలలో అనముక, ఆరే మాల, అర్వ మాల, బావురి, బేడజంగం, బుడగజంగం, బైండ్ల, బ్యాగర, చంచటి, చాలవడి, చమర్, మోచి, ముచి, చాంభర్, చండాల, డక్కలి డొక్కలవార్, దండాసి, ధోర్, ఎల్లమల్వార్, ఎల్లమ్మల వాండ్లు, ఘాసి, హద్ది, రెల్లి చంచడి, గోడగల్లి, గోదరి, గోసంగి, హోలేయా, హోలేయా దాసరి, జగ్గలి, జాంభవులు, కొలుపులవాండ్లు, మదాసి కురువ, మదారి కురువ, మాదిగ దాసు, మష్టిన్, మహర్, మలన్ హన్నాయ్, మాల జంగం, మాలమస్తి, మాలసన్యాసి, మంగ్, మం గ్గరోడి, మస్తి, మాతంగి, మెహతర్, మిత్తిల అయ్యవార్, ముండాలా, పాకీ, మోతీ, తోటి, పంబాల, పంబండ, పమిడి, సమాగార, సంబన్, సప్రు, చింధోల్లు, చిందుల్లులకు సంబంధించి ఆర్డీఓ/సబ్‌కలెక్టర్/అసిస్టెంట్ కలెక్టర్ హోదాకు తక్కువ కాని అధికారులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. అలాగే, షెడ్యూల్డ్ తెగలు, గిరిజన వర్గాలకు సంబంధించి అంధ్, భగట,భిల్, చెంచు, చెంచువార్, గదబలు, గోండు, నాయక్‌పోడు, రాజుగోండు, జఠాపస్, కతునాయకన్, కోలం, మన్నెర్వర్లు, కోండ్స్, కోడి, కోధు, దేశాయ, కోండ్స్, డోంగ్రయా కోంద్స్, కుధియా కోండ్స్, ఎనిటి కోండ్స్, కోయ, గౌడ్, రాజా, రాషాకోయ, లింగధారి కోయ(ఆర్డినరీ), కొట్టుకోయ, బినికోయ, రాజ్కోయ, మాలీలు (ఆదిలాబాద్,హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ మినహాయించి), ముఖదొర,నూకదొర, పర్దాన్, పోర్జ, పరంగిపెర్జ, రోన,రేనా, సవర, కాపుసవరలు, మలియా సవరాలు, కుట్టో సవరలు,సుగాలీలు, లంబాడీలు, కులీయా, యానాదులు, ఎరుకల వారికి మండల పరిధిలో ఎమ్మార్వోలు సర్టిఫికెట్లు ఇస్తారు. షెడ్యూల్డ్ కులం బరికి సంబంధించి జిల్లా కలెక్టర్ పరిధిలో, షెడ్యూల్డ్తరగతులకు సంబంధించి కొండకాపులు, కొండరెడ్డిలు, హిల్రెడ్డిలు, గౌడు( ఏజెన్సీలలో), కమ్మర, కోటియా, బెంతోఒరియా, బర్తికా, ధూలియా, ఢులియా, హోల్వో, పైకో, పుతియా, సన్ రోనా, సిదపైకో, రెడ్డిదొర, కొండదొరలు, తోటి (ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ మినహాయించి) నాయకా (ఏజెన్సీలలో), వాల్మీకి(ఏజెన్సీలలో) మన్నెదొర ఆర్డీఓ/సబ్‌కలెక్టర్/అసిస్టెంట్ కలెక్టర్లు సర్టిఫికెట్లు జారీచేసేందుకు అధికారాలు కలిగి ఉన్నారు.