దిగ్గజం లేకుండానే.. భారత జట్టు ప్రకటన
బెంగళూరు: సెంట్రల్ ఏషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (సీఏఎఫ్‌ఏ) నేషన్స్ కప్‌లో పాల్గొనే భారత ఫుట్‌బాల్ జట్టును సోమవారం ఎంపిక చేశారు. 23 మందితో కూడిన ఈ జట్టులో దిగ్గజ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రిని ఎంపిక చేయలేదు. నిజానికి ముందుగా ప్రకటించిన ప్రాబబుల్స్‌లోనూ ఛెత్రి లేడు. ఆగస్టు 1 నుంచి జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొన్న 29 మందిలో 23 మందిని ఎంపిక చేశారు. కోత్త కోచ్ ఖాలిద్ జమీల్ జట్టుతో పాటు తజికిస్తాన్‌కు పయనమవుతారు. ఈ నెల 29 నుంచి జరిగే నేషన్స్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది.ఇందులో ఆతిథ్య జట్టు తజికిస్తాన్‌తో పాటు ఇరాన్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. ముందుగా 29న తజికిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. అనంతరం సెపె్టంబర్ 1న ఇరాన్, 4న అఫ్గానిస్తాన్‌లో పోటీపడుతుంది. సన్నాహక టోర్నీగాఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు కీలకమైన మ్యాచ్‌లు ముందున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత నేషన్స్ కప్‌ను పూర్తిస్థాయి సన్నాహక టోర్నీగా సద్వినియోగం చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది.ఏఎఫ్సీ క్వాలిఫయర్స్‌లో తనకన్నా తక్కువ ర్యాంకు జట్లు బంగ్లాతో డ్రా చేసుకున్న భారత్... 0–1తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది. థాయ్‌లాండ్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత్ 0–2తో ఓడిపోవడంతో కోచ్ మనొలో మార్కెజ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చాన్నాళ్ల తర్వాత మళ్లీ జట్టుకు స్వదేశీ కోచ్ జమీల్‌ను ఎంపిక చేశారు. తదుపరి ఏఎఫ్సీ క్వాలిఫయర్స్‌లో భారత్ అక్టోబర్ 9, 14 తేదీల్లో సింగపూర్‌తో ఇంటా బయటా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఛెత్రిలాంటి మేటి ఆటగాళ్లు లేరు నేషన్స్ కప్ జట్టులోకి మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రిని ఎంపిక చేయనప్పటికీ అతనిలాంటి నాణ్యమైన ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో లేరని కోచ్ జమీల్ అంగీకరించారు. నేషన్స్ కప్ అనేది కేవలం సన్నాహక టోర్నీ కావడం వల్లే ఛెత్రిలాంటి దిగ్గజాన్ని ఎంపిక చేయలేదని చెప్పారు. ‘భారత్‌లో సునీల్ ఛెత్రి అంతటి ఆటగాళ్లు లేనపుడు... అతను ఆడతానంటే అభ్యంతరం ఏముంటుంది. అతనొక దిగ్గజం.జట్టు కోసం ఎంతో చేశాడు. అలాంటి ఆటగాడి అనుభవాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటాం’ అని జమీల్ అన్నాడు. ప్రస్తుతం నేషన్స్ కప్‌పై దృష్టి పెట్టినట్లు చెప్పాడు. కీలకమైన ఆసియా క్వాలిఫయర్స్‌కు ముందు జరుగుతున్న ఈ పోటీలను సది్వనియోగం చేసుకుంటామన్నాడు.భారత ఫుట్‌బాల్ జట్టు: గుర్ప్రీత్ సింగ్, అమ్రిందర్, హృతిక్ (గోల్ కీపర్స్); రాహుల్, నోరెమ్ రోషన్, అన్వర్ అలీ, సందేశ్, చింగ్లేశన సింగ్, మింగ్తన్మవియా రాల్తే, మొహమ్మద్ ఉవాయ్ (డిఫెండర్లు); నిఖిల్ ప్రభు, సురేశ్, ఫరూఖ్ భట్, జీక్సన్ సింగ్, బోరిస్ సింగ్, ఆశిక్ కురునియన్, ఉదాంత సింగ్, మహేశ్ సింగ్ (మిడ్ ఫీల్డర్లు); ఇర్ఫాన్, మాన్వీర్, జితిన్, లలియంజులా ఛాంగ్తే, విక్రమ్ ప్రతాప్ (ఫార్వర్డ్).