
‘షూటౌట్’లో ఒమన్‌పై విజయం
టీమిండియాను గెలిపించిన గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్
హిసోర్ (తజికిస్తాన్): సెంట్రల్ ఏషియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (సీఏఎఫ్‌ఏ) నేషన్స్ కప్ టోర్నీలో భారత జట్టుకు మూడో స్థానం లభించింది. ఒమన్ జట్టుతో సోమవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఒమన్ జట్టుపై భారత్‌కిదే తొలి గెలుపు కావడం విశేషం. నిరీ్ణత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి.
ఒమన్ తరఫున జమీల్ (55వ నిమిషంలో) గోల్ చేయగా... 80వ నిమిషంలో ఉదాంత సింగ్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. ‘షూటౌట్’లో ఒమన్ ఆటగాళ్లు తొలి రెండు షాట్‌లను వృథా చేయగా... చివరిదైన ఐదో షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ నిలువరించి జట్టును గెలిపించాడు. భారత్ తరఫున లాలియన్‌జువాలా, రాహుల్ భెకె, జితిన్ గోల్స్ చేయగా... అన్వర్ అలీ, ఉదాంత సింగ్ గురి తప్పారు.