breaking news
Busbhavan
-
మమ్మల్ని ఏపీకి బదిలీ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపుతూ అక్కడి ప్రభుత్వం రిలీవ్ చేసిన నేపథ్యంలో, టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఏపీకి చెందిన వారు తమను సొంత రాష్ట్రానికి పంపాలని కోరుతున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీ స్థానికత ఉన్నవారు తెలంగాణ పరిధిలో విధులు నిర్వర్తించారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో పై స్థాయి అధికారులు మొదలు ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఏపీకి వెళ్లిపోయారు. కానీ డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది, శ్రామిక్‌లు 600 మంది ఇక్కడే ఉండిపోయారు. సాంకేతిక కారణాలతో పైస్థాయికి చెందిన నలుగురైదుగురు కూడా ఇక్కడే ఉండిపోయారు. అయితే వీరిలో 446 మంది ప్రస్తుతం ఏపీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. మేమిక్కడ.. మా కుటుంబాలు అక్కడ తమకు ఏపీలోనే ఓటు హక్కు ఉందని, ఆధార్ కార్డులాంటివి కూడా ఏపీ చిరునామాతోనే ఉన్నాయని ఆ ఉద్యోగులు చెబుతున్నారు. తమ కుటుంబాలు కూడా అక్కడే ఉన్నాయని, తాము మాత్రం ఇక్కడ ఉండి విధులు నిర్వర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పెద్ద సంఖ్యలో వారు బస్‌భవన్‌కు చేరుకుని ఈడీ అడ్మిన్, చీఫ్ పర్సనల్ మేనేజర్లను కలిసి వినతిపత్రం అందజేశారు. తమను ఎలాగైనా ఏపీకి బదిలీ చేయాలని కోరారు. దీంతో రెండు ప్రభుత్వాలు అంగీకరిస్తే రిలీవ్ చేయటానికి తమకు అభ్యంతరం లేదని, ఏపీ సానుకూలంగా స్పందించేలా చూసుకోవాలని అధికారులు చెప్పినట్టు ఉద్యోగులు తెలిపారు. రెండు రాష్ట్రాల సీఎంలు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: సామరస్యంగా పరిష్కరించుకోండి -
హైదరాబాద్ ఆస్తులపై ఆంధ్రకు హక్కు!
భగ్గుమన్న తెలంగాణ కార్మిక నేతలు నివేదిక మార్చకుంటే రేపటి నుంచి మెరుపు సమ్మె నేడు చర్చలకు ఆహ్వానించిన ఉన్నతాధికారులు ఆర్టీసీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ‘విభజన’ కసరత్తు జోనల్‌స్థాయిలో నియమితులైన సీమాంధ్ర అధికారులు తెలంగాణలోనే ఆస్పత్రి, కల్యాణ మండపంలో ఆ రాష్ట్రానికి వాటా: ఆర్టీసీ నివేదిక సిద్ధం హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఆర్టీసీ ఆస్తులను విభజించేందుకు కుట్ర జరుగుతోందన్న వివాదంతో ఆర్టీసీలో సమ్మెకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగుల పంపకం విషయానికి సంబంధించి ఇప్పటికే నివేదిక సిద్ధమైంది. దీన్ని గురువారం జరగనున్న ఆర్టీసీ బోర్డు సమావేశం ముందుంచి ఆమోదముద్ర వేయించి గవర్నర్‌కు అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా విభజన కసరత్తును కొలిక్కి తెస్తున్న ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో కూడిన కమిటీ వివరాలను గోప్యంగా ఉంచడంతో అవి బయటకు పొక్కలేదు. కానీ మంగళవారం ఉదయం ఆ వివరాలు వెలుగులోకి రావడం తో తెలంగాణ ప్రాంత కార్మిక నేతలు అగ్గిమీదగుగ్గిలమయ్యారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా నివేదికలో అంశాలున్నాయని తీవ్రంగా ఆరోపిస్తున్న యూనియన్ నేతలు కమిటీ ప్రతినిధులను నిలదీశారు. ఎట్టిపరిస్థితిలో బుధవారం నాటికి దాన్ని మార్చాల్సిందేనని, ఉన్నదున్నట్టు బోర్డు ముందుంచితే గురువారం నుంచి మెరుపు సమ్మె ప్రారంభిస్తామని వారు హెచ్చరించారు. దీంతో అప్పటికప్పుడు కమిటీ ప్రతినిధులు కొన్ని సవరణలకు అంగీకరించారు. బుధవారం మరోసారి యూనియన్లతో చర్చించి మార్పుచేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారుల హామీపై నమ్మకంగా లేకపోవడంతో కార్మికులు సమ్మెకు సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకూ నివేదికలో ఏముంది? ఆర్టీసీ ప్రధాన కార్యాలయభవనం బస్‌భవన్‌తోపాటు తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి, ట్రాన్స్‌పోర్టు అకాడమీ, బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపం, బ్యాంకులను ఉమ్మడి ఆస్తులుగా నివేదికలో పొందుపరిచారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటున్నందున బస్‌భవన్‌ను పాలనా సౌలభ్యం కోసం రెండుగా విభజిస్తే అభ్యంతరం లేదని తెలంగాణ సిబ్బంది పేర్కొన్నా... ఇప్పుడు దానిపై సీమాంధ్రకు హక్కు కల్పిస్తూ నివేదిక సిద్ధం చేశారు. అలాగే పైన పేర్కొన్న మిగతా ఆస్తులన్నింటిపైగా సీమాంధ్రకు హక్కు ఉండబోతోంది. ఆర్టీసీ ఆస్పత్రికి సంబంధించిన రేడియాలజీ విభాగం, బ్లడ్‌బ్యాంకు, ఆపరేషన్థియేటర్, మియాపూర్‌లోని బస్‌బాడీ ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాపు, ప్రింటింగ్ ప్రెస్‌లను రెండుగా విభజించే వీలులేనందున వాటిని షేరింగ్ ప్రాపర్టీలుగా నిర్ధారించారు. అయితే వీటి నుంచి సేవలు పొందడమే కాకుండా వాటి విలువలో కూడా సీమాంధ్రకు వాటా ఉంటుందనేది నివేదిక సారాంశం. అధికారుల బదిలీల్లో జిల్లా, జోనల్ స్థాయి కాకుండా రాష్ట్రస్థాయి అధికారుల్లో స్థానికతను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. దీని ప్రకారం డిపో మేనేజర్, అంతకంటే పైస్థాయి పోస్టుల్లో ఉన్న అధికారులనే ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి పంపుతారు. కానీ అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ సూపర్వైజర్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ ప్లానింగ్, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్, అసిస్టెంట్ మేనేజర్ మెటీరియల్స్.. తదితరాలకు సంబంధించి సీమాంధ్రకు చెందిన వారు దాదాపు 400 మంది తెలంగాణలో పనిచేస్తున్నారు. రాష్ట్రం విడిపోయినా వీరు తెలంగాణలోనే పనిచేసే వెసులుబాటు ఉంటుంది. ఆర్టీసీ నష్టాలను జనాభా ప్రాతిపదికన పంచాలని నివేదికలో పేర్కొన్నారు. కానీ కొన్నేళ్లుగా సీమాంధ్రలోనే నష్టాలెక్కువగా ఉంటున్నాయి. గడచిన ఐదేళ్లలో తెలంగాణలో రూ.557 కోట్ల నష్టాలొస్తే, సీమాంధ్రలో రూ.1168 కోట్ల వరకున్నాయి. ఈ అంశాలన్నింటిలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందనేది ఈ ప్రాంత కార్మిక నేతల వాదన. ఎట్టిపరిస్థితిలో ఇక్కడి స్థిరాస్తులపై సీమాంధ్రకు హక్కు కల్పించొద్దని, ఐదేళ్ల నష్టాల ప్రాతిపదిక మేరకే నష్టాలను రెండు రాష్ట్రాల మధ్య పంచాలని, జోనల్ స్థాయిలో నియామకాలు జరిగీ రాష్ట్రస్థాయి కే డర్‌గా మారిన పోస్టులోనివారిని కూడా స్థానికత ప్రకారం ఆయా ప్రాంతాలకు పంపాలని కార్మికనేతలు గట్టిగా డిమాండ్ చేశారు. టీఎంయూ, ఈయూ, ఎన్ఎంయూ, తెలంగాణ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలు అధికారులను కలిసి హెచ్చరించారు. తీరు మారకుంటే మెరుపుసమ్మె: టీఎంయూ సీమాంధ్ర అధికారులు కుట్రపూరితంగా తెలంగాణకు అన్యాయం చేస్తూ నివేదిక సిద్ధం చేశారని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి తెలిపారు. దాన్ని వెంటనే మార్చాలని కోరారు. ప్రస్తుత నివేదికను బోర్డు సమావేశంలో ప్రవేశపెడితే ఎక్కడి బస్సులు అక్కడే స్తంభింపజేస్తామన్నారు. నివేదిక మార్చే వరకు మెరుపు సమ్మె కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.