breaking news
bus plunges
-
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం ..30మంది మృతి
అసోం: రాష్ట్రంలోని సోనాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. సిల్చార్ నుండి గౌహతి ప్రయాణిస్తూ మంగళవారం రాత్రి పొద్దుపోయాక తూర్పు జైంతియా హిల్స్ దగ్గర అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. లోతైన లోయలో పడిపోవడంతో 30 మంది మృతి చెందారు, మరికొంతమంది గాయపడ్డారు. 95 శాతం మంది ప్రయాణీకులు మరణించినట్టు ఐఎన్ఎస్ తెలిపింది.సుమారు 500 అడుగుల కిందికి పడిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టుతెలుస్తోంది. బీఎస్ఎఫ్ , పోలీసు యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది. గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో స్థానిక యువకులు సహాయచర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రదేశంలో రాత్రి పూట ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే మొదటి సారని జిల్లా ఎస్పీ తెలిపారు. -
ముంచింది నిర్లక్ష్యమే!
సాక్షి, ముంబై: మాల్శేజ్ రోడ్డును విస్తరించకపోవడం, రైల్వేలైన్ నిర్మాణాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘాట్‌పై వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఠాణే-అహ్మద్‌నగర్ బస్సు గురువారం మాల్శేజ్‌ఘాట్ లోయలో పడి 27 మంది ప్రయాణికులు మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్శేజ్ ఘాట్‌రోడ్డు మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంపై మరోసారి చర్చ మొదలయింది. ప్రతి వర్షాకాలంలో మాల్శేజ్‌ఘాట్ రోడ్డు ప్రయాణం ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తోంది. తొందర్లోనే ఈ మార్గాన్ని నాలుగులేన్ల రహదారిగా మారుస్తామని, ఠాణే-అహ్మద్‌నగర్ రైల్వేలైన్ కూడా వేస్తామని ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు పలుసార్లు హామీ ఇచ్చినా అవేవీ నెరవేరలేదు. సర్కారు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతాలు ఇంకా చాలా వె నుకబడి ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి కేవలం 130 కిలోమీటర్లు, ఠాణే నగరానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో మాల్శేజ్‌ఘాట్ ఉంది. 222 నంబరు జాతీయ రహదారి ఘాట్ మార్గం మీదుగా కళ్యాణ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ వరకు వెళ్తుంది. అయినప్పటికీ అనేక మంది ఈ రహదారిని వినియోగించుకోకుండా పుణే లేదా ఇతర మార్గాల మీదుగా వెళ్తుంటారు. దీనికి ప్రధాన కారణం మాల్శేజ్ ఘాట్ రోడ్డు ఎంతో ఇరుగ్గా, అనేక మలుపులతో ఉండడమే! కళ్యాణ్ నుంచి ముర్బాడ్ మీదుగా అహ్మద్‌నగర్ వెళ్లేవాటితోపాటు ఇతర బస్సులు మాత్రమే ఈ మార్గం మీదుగా వెళ్తుంటాయి. ప్రయాణ సమయం కాస్త ఆదా అవుతుందని తెలిసినా ఈ మార్గంలో ప్రయాణించడానికి చాలా మంది ఇష్టపడరు. ఈ రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించాలని వాహనదారులు, ముర్బాడ్ నుంచి మాల్శేజ్ ఘాట్ వరకు ఉన్న ప్రాంతాల ప్రజలు అనేక రోజులుగా కోరుతున్నారు. గుడ్డిలో మెల్లలా కళ్యాణ్-నిర్మల్ రోడ్డుకు మాత్రం జాతీయ రహదారిగా హోదా కల్పించారు. కాగితాలకే పరిమితమైన రైల్వేలైన్ ...! కళ్యాణ్-అహ్మద్‌నగర్ వయా మాల్శేజ్ ఘాట్‌రోడ్డుకు ప్రత్యామ్నయంగా రైల్వేమార్గం నిర్మించాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా మారింది. ముంబైకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో రైల్వేమార్గం ఏర్పాటైతే స్థానిక గ్రామాలు అభివృద్ధి చెందడంతోపాటు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వేలైన్ ప్రతిపాదన గత 39 ఏళ్లుగా కాగితాలకే పరిమిత మయింది. మాల్శేజ్‌ఘాట్ రైల్వే ప్రాజెక్టును 1974లో కేవలం రూ.108 కోట్ల బడ్జెట్‌తో చేపట్టాలనుకున్నారు. అయితే ప్రస్తుతం దీని అంచనావ్యయం ఏకంగా రూ.వెయ్యి కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఇంకా సర్వే పనులే పూర్తి చేయలేదు. కళ్యాణ్-అహ్మద్‌నగర్ వయా మాల్శేజ్ ఘాట్‌రోడ్డు విదర్భ, మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాలను కలుపుతుంది. దీనిని నాలుగులేన్లుగా విస్తరిస్తే మాల్శేజ్ ఘాట్ చుట్టుపక్కల ప్రాంతాలూ అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. మాల్శేజ్ రైల్వేలైన్ సర్వే పనులు చేపట్టనున్నట్టు రామ్‌విలాస్ పాశ్వాన్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారు. నిధులు లేకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఈ మార్గం చాలా లాభసాటిగా ఉంటుందని రైల్వే 2006లో చేపట్టిన సర్వేలో వెల్లడయింది. 204 కిలోమీటర్ల రైల్వేమార్గం నిర్మాణానికి రూ.772 కోట్ల వ్యయమవుతుందని అంచనా. అయితే భూసేకరణ, ఇతర పనులు కొనసాగించేందుకు నిధులు లేకపోవడంతో పనులు ముందుకుసాగడం లేదు. మూడేళ్లలో 189 ప్రమాదాలు... మాల్శేజ్ ఘాట్‌పై గత మూడేళ్లలో 189 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 59 మంది ప్రాణాలను కోల్పోయారు. గత సంవత్సర కూడా 42 ప్రమాదాలు సంభవించగా, 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మందికి గాయాలయ్యాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఎంఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై లోయలో పడడంతో 27 మంది మరణించారు. ఈ మార్గంపై పదేళ్ల కిందట జరిగిన వాటితో పోలిస్తే ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఇందులో ప్రభుత్వ కృషి ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళలు, వర్షాకాలంలో వాహనదారులు ఈ మార్గం మీదుగా వెళ్లకపోవడం వల్లే ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. -
నదిలో పడిన బస్సు: 16 మంది మృతి
జావా దీవిలోని సిసుర్వా సమీపంలో బుధవారం ఓ బస్సు నదిలో పడిన ఘటనలో 16 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఈ ఘటనలో 32 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరికొంత మందికి స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పారు. వారంత ఇండోనేషియాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. 60 మంది ప్రయాణికులతో ఓ బస్సు బుధవారం హిల్స్ రిసార్ట్స్‌ను సందర్శించి అనంతరం ఇండోనేషియా రాజధాని జకార్తాకు తిరుగు ప్రయాణంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. బస్సు బ్రేకులు సరిగా పనిచేయకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.