breaking news
Built-in speaker
-
యాపిల్ వాచ్.. వచ్చేసిందోచ్..
క్యుపర్టినో, కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా అత్యాధునిక ఫీచర్స్‌తో స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేందుకు ఇందులోనే బిల్ట్ఇన్ స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. అలాగే, ఫిట్నెస్ను ట్రాక్ చేసేందుకు, వ్యాయామాలను సూచించేందుకు వర్కవుట్ యాప్ కూడా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, 18 క్యారట్ గోల్డ్ కేస్‌లతో ఈ వాచీలు లభ్యమవుతాయి.గోల్డ్ వాచ్ ధర 10,000 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఇక స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ రేటు 549-1099 డాలర్ల వరకూ ఉంటుంది. వాచ్ ‘స్పోర్ట్’ ధర 349-399 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. వీటి విక్రయాలకు మొదట 9 తొమ్మిది దేశాల్లో ఏప్రిల్ 10 నుంచి ముందస్తు బుకింగ్స్ మొదలవుతాయి. -
ఖురాన్ చదివే కలం
సాక్షి, సిటీబ్యూరో: అవును... ఈ శీర్షికను మీరు సరిగానే చదివారు. అదేంటీ...పెన్ను రాయడానికే కదా....చదవడమేంటీ? అనే అనుమానం కలుగుతోందా? అదే మరి టెక్నాలజీ మహిమ. వివిధ భాషలను చదివే కలాలు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఖురాన్ చదివేందుకు ప్రత్యేకమైన కలం అందుబాటులోకి వచ్చింది. ఖురాన్‌లోని ఏ వచనాన్నయినా బిగ్గరగా, స్పష్టంగా వినిపించడం దీని ప్రత్యేకత. ఇందుకు చేయాల్సిందిల్లా పెన్నును అరబ్బీలో ఉన్న ఖురాన్లో చదవదలచిన వయనం (ఆయత్)పై పెట్టి కదిలించడమే. ఖురాన్‌ను శ్రావ్యంగా చదివే వారిని ఖారీ అంటారు. ప్రపంచ ప్రఖ్యాత ఖారీలు అబ్దుల్ రెహ్మాన్అల్ సుదైస్, అబ్దుల్ బాసిత్ అబ్దుస్సమద్, అలీ అల్ హుదైఫీ, సాద్ అల్-ఘమిది వంటి వారి గళాలను ఈ కలంలో వినవచ్చు. ఎలాగంటారా? ఈ పెన్నులోని మీటను నొక్కడం ద్వారా ఆంగ్లం, జర్మన్, ఉర్ధూ, పర్షియా, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, ఫ్రెంచి భాషల్లో కావాల్సినదానిని ఎంచుకొని ఖురాన్ వచనాలను వినొచ్చు. చైనా నుంచి తయారై వచ్చిన ఈ పెన్నులకు మంచి డిమాండ్ ఉంది. చదువు రాని వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీనితో పాటు ఖురాన్ ప్రతిని, పెన్నును ఉపయోగించే మాన్యువల్, ఇయర్ ఫోన్స్, చార్జర్, తజ్వీద్ పుస్తకాలను అందిస్తున్నారు. వీటన్నింటి తో కలసి రకాలను బట్టి ఈ పెన్నులను రూ.2,500, 2,800, రూ.3వేల వంతున విక్రయిస్తున్నారు. ఈ కలానికి 4జీబీ మెమోరీ, దాన్ని విస్తరించేందుకు టి.ఎఫ్. కార్డు సదుపాయాలు ఉన్నాయి. రికార్డింగ్ ఆప్షన్, యూఎస్బీ పోర్ట్‌తో పాటు బిల్ట్ ఇన్ స్పీకర్ ఉన్నాయి. ఈ పెన్ను కేవలం ఖురాన్, దీంతో పాటు లభించే తజ్వీద్ పుస్తకాలను మాత్రమే చ దువుతుంది. ఎందుకంటే ప్రత్యేక సిరాతో ముద్రించిన వాటిని మాత్రమే ఇది చదవగలదు. ఖురాన్ కాకుండా, ధార్మిక పుస్తకాలైన సహీ బుఖారి, ముస్లిం, రియాజుస్ సలెహత్ తదితర పుస్తకాల పెన్నులు కూడా ఉన్నాయని వీటిని విక్రయిస్తున్న అబ్దుల్ మోమిన్ తెలిపారు.