breaking news
BSNL department
-
ఏపీలో శ్రీదేవి డిజిటల్ సేవలు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ సేవలు అందించేందుకు శ్రీదేవి డిజిటల్ సిస్టం ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం కుదుర్చుకొంది. బీఎస్ఎన్ఎల్ జీఎం ఆడమ్‌తో సంస్థ చైర్మన్ రామకృష్ణంరాజు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఆరు జిల్లాల్లో కేబుల్ టీవీతో పాటు హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్, నెట్ సేవలను ఈ సంస్థ అందించనుంది. మార్కెట్లో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తమ సేవలను అందిస్తామని రామకృష్ణంరాజు తెలిపారు. -
పోలీస్ ఫోన్లు మూగనోము సర్వీస్ కట్
=పేరుకుపోతున్న పెండింగ్ బిల్లులు =బడ్జెట్ కేటాయింపులో అలక్ష్యం =జిల్లాలో రూ.4.90 లక్షల బకాయిలు =ప్రతిసారీ 25 మందికిపైగా ఎస్సైల ఫోన్ సర్వీసులు కట్ =పోలీస్, బీఎస్ఎన్ఎల్ శాఖల మధ్య తప్పని వార్ ‘నా పేరు శివమణి.. నా నంబర్ ఇదీ..’ అంటూ ఎవరైనా ఎస్సై ప్రజలకు గర్వంగా చెప్పుకోవాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఏదైనా అత్యవసరమై ఎస్సైకి ఎవరైనా ఫోన్ చేస్తే ‘ఈ సర్వీసును తాత్కాలికంగా నిలిపివేయడమైనది’ అనే వాయిస్‌తో కంగు తినాల్సిందే. ఇలా జిల్లాలోని పలువురు పోలీసు అధికారుల ఫోన్లు తరచూ మూగనోము పడుతున్నాయి. పోలీసుల సెల్‌ఫోన్ ఎందుకు పనిచేయట్లేదని ఆరా తీస్తే.. బీఎస్ఎన్ఎల్ వాళ్లు సర్వీసును నిలిపివేశారనేది వారి సమాధానం. సర్వీసు ఎందుకు కట్‌చేశారని బీఎస్ఎన్ఎల్ వాళ్లను అడిగితే.. బిల్లుల పెండింగ్‌తో ఈ సమస్య వస్తోందని చెబుతున్నారు. సాక్షి, మచిలీపట్నం : ప్రజలకు, ఉన్నతాధికారులకు నిత్యం అందుబాటులో ఉండేలా పోలీస్ శాఖలో బీఎస్ఎన్ఎల్ గ్రూపు (సీయూజీ) సెల్ఫోన్లు వినియోగిస్తారు. ఇలా జిల్లాలోని 103 మంది ఎస్సైలు, 30 మంది సీఐలు, ఏడుగురు డీఎస్పీలు గ్రూప్ మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఎస్సై, సీఐలకు నెలకు సెల్‌ఫోన్ బిల్లు రూ.500, ల్యాండ్‌లైన్ బిల్లు రూ.750 చొప్పున పోలీసు శాఖ కేటాయిస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా నెలవారీగా ఇచ్చే బడ్జెట్ కేటాయింపులు సకాలంలో రాకపోవడం సమస్యగా మారింది. దీనికితోడు పోలీసుల పాత బకాయిలు సైతం పేరుకుపోవడంతో వారి సెల్‌ఫోన్ సర్వీసులను బీఎస్ఎన్ఎల్ సంస్థ నిలిపివేయాల్సి వస్తోందని సమాచారం. రూ.4.90 లక్షల బిల్లుల పెండింగ్... రాష్ట్రం మొత్తం మీద పోలీస్ శాఖ ఫోన్ బిల్లుల బకాయిలు సుమారు రూ.5.50 కోట్ల మేరకు ఉంటే జిల్లాలో రూ.4.90 లక్షలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. దీనికితోడు జిల్లాలోని పోలీసుల సెల్ఫోన్లు, ల్యాండ్లైన్ల బిల్లులకు నెలవారీగా సుమారు రూ.1.40 లక్షలు చెల్లించాల్సి ఉంది. వాటికి నెలవారీగా బడ్జెట్ కేటాయింపులు సకాలంలో లేకపోవడంతో జిల్లాలో 25 మందికిపైగా ఎస్సైల సెల్ఫోన్లు, పలు స్టేషన్ల ల్యాండ్‌లైన్ ఫోన్లు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. బిల్లు ఇచ్చి 55 రోజులు దాటినా వాటిని చెల్లించకపోవడంతో పూణేలో ఉండే సెంట్రల్ ఆన్లైన్ సిస్టం ద్వారా ఆయా మొబైల్ ఫోన్ల సర్వీసులు నిలిపివేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ఆయా ఎస్సై, సీఐలతో మాట్లాడాలంటే ప్రజలకు, పోలీసు ఉన్నతాధికారులకు సమస్యగా మారుతోంది. ప్రజలకు అందుబాటులో ఉంటారనుకునే ఎస్సైల ఫోన్లు తరచూ ఇలా మూగనోము పట్టడం స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. పోలీస్ విభాగం అత్యవసర సేవలకు సంబంధించినది కావడంతో బిల్లు చెల్లించని ఫోన్ల సర్వీసులు నిలిపివేసిన సమాచారాన్ని బీఎస్ఎన్ఎల్ అధికారులకు చెబితే వాటిని కొనసాగిస్తున్నారు. ఇంకా జిల్లాలోని పలువురు ఎస్సైలు మాత్రం తమ శాఖకు చెందిన ఫోన్ల సర్వీసును నిలిపివేస్తే ఇబ్బంది లేదనుకుని సొంత నంబర్లు వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. పరిమితికి మించి వినియోగం... జిల్లాలో పలువురు ఎస్సైల ఫోన్ బిల్లులు చూస్తే గుండె గుబేలుమంటుంది. పోలీసు శాఖ నిర్దేశించిన మొత్తాన్ని మించి వేలకు వేలు బిల్లులు వాడుతున్న వారున్నారు. దీంతో వారికి నెలకు ఇచ్చే రూ.500 కంటే అధిక మొత్తం వస్తే జీతాల నుంచి రికవరీ పెడుతున్నారు. గతంలో మచిలీపట్నం రూరల్ స్టేషన్లో పనిచేసిన ఒక ఎస్సై తన సెల్బిల్లును రూ.30 వేలు వాడి వేరొకచోటకు బదిలీపై వెళ్లిపోయాడు. అదే స్టేషన్‌కు కొత్తగా బదిలీపై వచ్చిన ఎస్సై ఈ సిమ్‌కార్డును వినియోగంలోకి తీసుకురావడానికి పాతబకాయి రూ.30 వేలు చెల్లించాల్సి వచ్చింది. చిలకలపూడి స్టేషన్లో గతంలో పనిచేసిన ఒక ఎస్సైకి రూ.35 వేలు సెల్ బిల్లు రావడంతో ఆ మొత్తాన్ని చెల్లించి తనకు స్వాధీనం చేయాలని అక్కడకు బదిలీపై వచ్చిన ఎస్సై ఒత్తిడి చేయడంతో చెల్లించి వెళ్లాడు. ఇలా బదిలీల సమయంలో పాత, కొత్త ఎస్సైల నడుమ సెల్ బిల్లులు వివాదాలకు కూడా దారితీస్తున్నాయి. ఎందుకొచ్చిన గొడవ అనుకునే తెలివైన ఎస్సైలు పలువురు మాత్రం డిపార్ట్మెంట్ వ్యవహారాల వరకు బీఎస్ఎన్ఎల్ గ్రూప్ సిమ్‌లను ఉపయోగించి మిగిలిన వ్యవహారాలకు వేరొక సిమ్‌ను వాడుతున్నారు. ఇలా జిల్లాలో పలువురు ఎస్సైలు, సీఐలు డ్యూయల్ సిమ్ ఫోన్లు, రెండు పోన్లు వాడుతుండటం కొసమెరుపు.