breaking news
Brussels Visit
-
బ్రస్సెల్స్ లో మా ఆయన క్షేమం: హీరోయిన్
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ విమానం కెప్టెన్ అయిన తన భర్త బ్రస్సెల్స్ లో క్షేమంగా ఉన్నాడని బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్ తెలిపింది. జెట్ ఎయిర్ వేస్ విమానం బెల్జియం రాజధాని బ్రసెల్స్ విమానాశ్రయంలో ల్యాండైన కొద్దిసేపటికే ఆత్మాహుతి దాడులు కుదిపేశాయి. విమానాశ్రయంలో హాహాకారాలు, ఆర్తనాదాలతో భీతావహ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బ్రసెల్స్ లో దిగిన జెట్ ఎయిర్వేస్ సిబ్బంది, ప్రయాణికులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని గుల్ పనాగ్ ట్విట్టర్ లో తెలిపింది. తన భర్త, జెట్ ఎయిర్వేస్ కెప్టెన్ జీఎస్ అట్టారీ విమానంలో ఉన్నారని ఆమె వెల్లడించింది. 'బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతున్నది. భద్రతా సిబ్బంది ఇప్పటికీ బాంబులను కనుగొంటున్నారు. మా ఆయన, విమాన సిబ్బంది, ప్రయాణికులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. అక్కడి వివరాలను ఎప్పటికప్పుడు మా ఆయన ద్వారా తెలుసుకొని ట్విట్టర్ లో షేర్ చేస్తున్నాను. దీనివల్ల విమానం సిబ్బంది, ప్రయాణికుల కుటుంబసభ్యులకు తమ వారి భద్రత గురించి తెలుసుకుంటారు' అని ఆమె మీడియాతో పేర్కొంది. 'ప్రయాణికులు, సిబ్బంది అంతా విమానంలోనే ఉన్నారు. వారి విమానం సురక్షిత ప్రదేశంలో ఉంది. ప్రతి గంటకు మా ఆయన తాజా సమాచారం అందిస్తున్నారు' అని ఆమె తాజాగా ట్వీట్ చేశారు. న్యూఢిల్లీ నుంచి బ్రస్సెల్స్ వెళ్లిన జెట్ ఎయిర్వేస్ సిబ్బందిని, ప్రయాణికులను విమానం నుంచి ప్రస్తుతం దింపి.. పంపించివేశారని మరో ట్వీట్ లో వెల్లడించారు. -
పేలుళ్లు జరిగినా వెనుకడుగేయని మోదీ!
న్యూఢిల్లీ: ఆత్మాహుతి బాంబు దాడులతో బెల్జియం దద్దరిల్లినప్పటికీ ఆ దేశ పర్యటన విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుకే సాగనున్నారు. ఈ నెల 30న ప్రధాని మోదీ బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరుగనున్న భారత్-యూరోపియన్ యూనియన్ సదస్సులో పాల్గొననున్నారు. బ్రసెల్స్ లో ఆత్మాహుతి దాడులు జరిగి 21 మంది చనిపోయిన నేపథ్యంలో ప్రధాని మోదీ తలపెట్టిన ఈ పర్యటనపై పలు సందేహాలు తలెత్తాయి. యూరప్ లో భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, ఈ పర్యటన యథాతథంగా కొనసాగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. బెల్జియం పర్యటన ముగించుకొని అటు నుంచి అమెరికాలోని వాషింగ్టన్ లో పర్యటిస్తారని, అక్కడ మార్చి 31-ఏప్రిల్ ఒకటో తేదీల్లో జరిగే అణుభద్రత సదస్సులో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం సౌది అరేబియాలోని రియాద్ కు వెళుతారని స్వరూప్ వెల్లడించారు. బ్రసెల్స్ పేలుళ్లలో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు గాయపడినట్టు వార్తలు వస్తుండగా.. అందులో ఒకరు క్షతగాత్రులైనట్టు తమకు కూడా సమాచారముందని ఆయన తెలిపారు.