మన్యం దరి..జాతీయ రహదారి
భీమవరం-విజయనగరం మధ్య హైవే
రూ.5,150 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు
తాడేపల్లిగూడెం : భీమవరం రుచుల్ని ఆస్వాదించి.. తాడేపల్లిగూడెంలో అపరాల సువాసనల్ని ఆఘ్రాణించి.. ఉభయగోదావరి జిల్లాల నడుమ గోదారమ్మ పరవళ్లను వీక్షించి.. రాజమహేంద్రవరాన్ని పలకరించి.. రంపచోడవరం, చింతపల్లి, అరకులోయ నడుమ మన్యం అందాలతో కనువిందు చేసుకుంటూ రయ్యిరయ్యిన విజయనగరం చేరుకునే అవకాశం కలగబోతోంది. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం, రంపచోడవరం మీదుగా విజయనగరం వరకూ 515 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 1,350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 7 రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ సర్కారు ఇప్పటికే అంగీకారం తెలిపింది. వీటిలో భీమవరం-విజయనగరం జాతీయ రహదారి ఒకటి.
కిలోమీటరుకు రూ.10 కోట్లు
515 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణానికి కిలోమీటరుకు రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.5,150 వెచ్చించనున్నారు. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌లోని కేఎన్ రోడ్డు (కోడేరు నల్లజర్ల రోడ్డు), తణుకు రోడ్డు మీదుగా నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి నిర్మిస్తారు. తాడేపల్లిగూడెం నుంచి పిప్పర వరకు ఇప్పటికే నాలుగు వరుసల రోడ్డుగా విస్తరించారు. పుష్కర నిధులతో ఇటీవల తాడేపల్లిగూడెం-భీమవరం రహదారిని మెరుగుపర్చారు. భీమవరం నుంచి చిలకంపాడు లాకుల వరకు గూడెం వచ్చే రోడ్డులో కుడివైపున కాలువ ఉన్న దృష్ట్యా ఎడమ వైపున వ్యవసాయ క్షేత్రాల వరకు రోడ్డును విస్తరిం చాల్సి ఉంది.
అక్కడి నుంచి తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ వరకు రెండు పక్కలా కేఎన్రోడ్డులో రోడ్డును విస్తరించుకోవచ్చు. నిడదవోలు మార్గంలో కుడివైపు మాత్రమే రహదారిని విస్తరించాల్సి ఉంటుంది. ఎడమ పక్కన గోదావరి- ఏలూరు కాలువ ఉన్న కారణంగా ఒకపక్క మాత్రమే రోడ్డును విస్తరించే అవకాశం ఉంది. నిడదవోలు రైల్వేగేటు సమీపంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించుకోవాల్సి ఉంటుంది. సమిశ్రగూడెం నుంచి విజ్జేశ్వరం వరకు కుడి వైపున, విజ్జేశ్వరం నుంచి కొవ్వూరు మార్గంలో కుడి వైపున రోడ్డు విస్తరించాల్సి ఉంటుంది.
అక్కడి నుంచి కొవ్వూరు- రాజమండ్రి వంతెన లేదా బైపాస్ మార్గంలో రాజమండ్రి మీదుగా రంపచోడవరం, చింతపల్లి, అరకు, విజయనగరం వరకు ఈ రహదారి నిర్మిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖకు 2016 డిసెంబరు నెలాఖరులోగా డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) అందజేయడంతోపాటు, అనంతరం సకాలంలో భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయగలిగితే నిర్మాణానికి నిధులు విడుదలవుతాయి. ఈ కొత్త జాతీయ రహదారి నిర్మాణం భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాలకు ప్రయోజనకరమే. భీమవరం నుంచి ఆక్వా ఉత్పత్తులు, తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, అపరాలు, నూనెలు, ధాన్యం వంటి సరుకుల్ని ఉత్తరాంధ్రకు సులభంగా రవాణా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ రహదారిని ఆనుకుని వ్యాపారాలు విస్తరించే అవకాశాలు మెరుగవుతాయి.